Friday 24 December 2021

రామాయణము , ఉత్తరకాండ ------ అరువదిరెండవసర్గ

                            రామాయణము 

                         ఉత్తరకాండ ------ అరువదిరెండవసర్గ 

చ్యవనమహర్షి మాటలు విన్న శ్రీరాముడు ఋషీశ్వరులకు అంజలి ఘటించి" ఆ లవణుడు ఎక్కడ ఉన్నాడు ?. అతని గురించి సవివరముగా నాకు తెలుపుము . " అని పలికెను . ఆ మాటలు విన్న ఋషీశ్వరులు" రామా! ఆ లవణాసురుడు మధువనములోనే నివసించుచున్నాడు . సమస్త ప్రాణులు అందునా ముఖ్యంగా తాపసులు అతనికి ఆహారములు . అతడు ప్రతీరోజు వేలకొలది సింహములను , పెద్దపులులను , లేళ్ళను , ఏనుగులను అట్లే మనుషులను చంపి తన ఆహారముగా చేసుకొనుచున్నాడు . " అని పలికెను . వారి మాటలు విన్న శ్రీరాముడు" ఓ మహాత్ములారా !ఆ రాక్షుసుడి   విషయంలో  మీరు ఇక ఏమాత్రం భయపడనవసరం లేదు " అని వారికి ధైర్యం చెప్పి అక్కడే ఉన్న తన సోదరుల వైపు తిరిగి " సోదరులారా! మీలో లవణుని సంహరింపగల వీరుడు ఎవరు ? " అని ప్రశ్నించెను . అన్న మాటలు విన్న భరతుడు " అన్నా! ఆ రాక్షసుని నేను హతమార్చెదను . ఆకార్య భారము నాకు అప్పగించుము " అని పలికెను . అప్పుడు అక్కడే ఉన్న శత్రుజ్ఞుడు లేచినిలబడి " అన్నా! భరతుడు ఇదివరకు నీవు వనవాసమునకు వెళ్ళినప్పుడు నీరాక కోసం నిరీక్షించుచు అయోధ్యను పాలించెను . ఆ సమయంలో అతడు పెక్కు కష్టములను అనుభవించెను . అతడు భూమిపైనే శయనించుచు జటలు , నారచీరలు ధరించి ఫలమూలములను ఆహారముగా స్వీకరించుచు నందీ గ్రామములోని నివసించెను . ఆ విధంగా పెక్కు దుఃఖములకు లోనయ్యేను . మహారాజా! లవణాసురుడుని సంహరించుటకు ఈ సేవకుడు (నేను) ఉండగా మరలా అతడిని యుద్ధ కష్టములకు పంపుట ఎందులకు " అని పలికెను . 
ఆ మాటలు విన్న శ్రీరాముడు " శత్రుఘ్నా ! నీవు పలికినది సముచితముగానే ఉన్నది.  భరతుడిని ఇంకా శ్రమపెట్టుట నీకు ఇష్టం లేనిచో వీరుడువైన నీవే ఆ లవణాసురుడి యొక్క నగరంలో ప్రవేశించి అతడిని హతమార్చుము . నిన్ను ఆ రాజ్యమునకు రాజును చేసెదను . నీవు శూరుడవు, యుద్ధాది సమస్త విద్యలు నేర్చినవాడవు . మధురాక్షసుని కుమారుడైన లవణుడు మిక్కిలి పాపాత్ముడు సర్వ సమర్థుడవైన నీవు నా ఆదేశం ప్రకారం అతడిని హతమార్చి ఆ రాజ్యమును ధర్మబద్ధంగా పాలింపుము " అని పలికెను . 

రామాయణము ----- ఉత్తరకాండ , అరువదిరెండవసర్గ -------------- సమాప్తం . 

శశి,

ఎం.ఏ , ఎం.ఏ(తెలుగు),తెలుగు పండితులు . 

No comments:

Post a Comment