Sunday 10 March 2019

రామాయణము కిష్కిందకాండ -అరవదియేడవసర్గ

                              రామాయణము 

                        కిష్కిందకాండ -అరవదియేడవసర్గ 

నూరుయోజనములు దూరము వున్న సముద్రమును లంఘించుటకు హనుమంతుడు సిద్దపడుతూ ,తన శరీరమును పెద్దగా పెంచెను . 

అలా పెద్దగా పెరిగిన హనుమంతుడిని చూసిన వానరులందరూ విచారమును వదిలి ,ధైర్యము తెచ్చుకుని సంతోషముతో జయజయద్వానములు చేసిరి . వారి జయజయ నాదములతో మరింత ఉత్సాహముగా శరీరమును పెంచిన హనుమంతుడు ని చూచుటకు వానరులందరూ తలలు ఎత్తవలసివచ్చినది . ఆ సమయములో వానరులు హనుమంతుడి మోకాలివరకు కూడాలేరు . 
అప్పుడు హనుమంతుడు వానరుల ఉత్సాహమును మరింత పెంచుతూ "ఓ వానరులారా !నేను అవలీలగా ఆకాశములో నక్షత్రములను దాటి వెళ్ళగలను . ఈ భూమండలమును చుట్టి రాగలను . కొండలను పిండి చేయగలను . సముద్రమును భూమిపై వేయగలను . "అని పలికెను . 
ఆ మాటలు విన్న జాంబవంతుడు "నాయనా !హనుమా !నీ పరాక్రమునకు తగినట్టు మాట్లాడావు . నీ మాటలతో మాలో బతుకు ఆశని పెంచావు . మా వనరులందరి ప్రాణములు నీ పైనే ఆధారపడి వున్నాయి . నీవు వచ్చేవరకు మేము ఎదురుచూస్తూ ఇక్కడే ఉంటాము "అని పలికెను . అప్పుడు మారుతి "నేను వెంటనే ఈ సముద్రమును లంఘించెదను . అయితే నా బలమును ఈ భూమి తట్టుకోలేదు . కావున నేను ఈ మహేంద్ర గిరిపై నుండి ఎగురుతాను . "అని పలికెను . 
అప్పుడు హనుమంతుడు గబగబా నడుస్తూ ,మహేంద్రగిరిని ఎక్కసాగెను . అలా ఎక్కేటప్పుడు అక్కడి రాళ్లన్ని కదిలిపోసాగెను . ఆ గిరిపై కల సమస్త ప్రాణులు ఆ అలికిడికి భయముతో పారిపో సాగెను . 

రామాయణము కికిష్కిందకాండ సమాప్తము . 

           శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 
























1 comment: