Saturday 18 June 2016

రామాయణము బాల కాండ -పదునాల్గవ సర్గము

                          రామాయణము 

                             బాల కాండ -పదునాల్గవ సర్గము 

వేద వేదములయందు ,వేదార్ధములయందు ఆరితేరిన ఋత్విజులు విద్యుక్తముగా యజ్ఞ విధులను ఆచరిస్తున్నారు . వేదోక్తముగా మీమాంస శాస్త్రమును కల్ప శాస్త్రమును అనుసరించి వారు యజ్ఞ కర్మలను నిర్వహిస్తున్నారు . ఇంకను ఉపదేశ శాస్త్రము కంటే అధికమైన ,అతిదేశ శాస్త్రము వలన లబ్యమైన సమస్త కర్మలను శాస్త్రోక్తముగా నిర్వహించిరి . ఇంద్రునకు విధ్యుక్తమైన హవిస్సులు సమర్పింప బడినవి . సోమలతను కల్వము నందుంచి దానికి నల్దిక్కులా బ్రహ్మ ,అద్వర్యువు ,హోత ,ఉద్గాత అను నలుగురు ఋత్విజులు చేరి మంత్రములను పటించుచు సొమరసమును సిద్దము చేసిరి . ఆ యజ్ఞ కార్యములలో ఏ హోమము విడిచిబెట్టబడలేదు . ఒక హోమమునకు మారుగా మరియొక హోమము చేయుట జరగలేదు . హోమ ప్రక్రియలో ఏ మాత్రము దోసగులు దోర్లలేదు . హోమాదికము అంతా మంత్రం పూర్వకముగా నిర్విఘ్నముగా సాగినది . 
ఆ హోమము జరిగిన దినములలో అక్కడ ఆకలి ,దప్పులతో భాద పడినవారు లేరు . అక్కడికి వచ్చిన ప్రతి బ్రాహ్మణుడు విధ్వాంసుడే . ప్రతి బ్రాహ్మణునికి శిష్యులు కాని ,అనుచరులు కాని ,వంద మందికి తక్కువ కాకుండా వుండిరి . ప్రతి దినమూ బ్రాహ్మణులు మొదలుకుని అన్ని వర్ణముల వారు తృప్తిగా భుజించు చుండిరి . ఇంకను తాపసులు ,సన్యాసులు అక్కడ ఆతిధ్యము స్వీకరించు చుండిరి . వృద్దులు ,రోగ గ్రస్తులు ,స్త్రీలు ,బాలబాలికలు రోజు అక్కడికి వచ్చి భుజించు చుండిరి . తాను అనుకున్నంత మంది అతిధులు రాలేదని దశరదుడు సంతృప్తి చెందకుండెను . "అందరికి భోజన పదార్ధము వడ్డించండి ,వడ్డించండి వస్త్ర దానము చేయండి "అని మంత్రులకు దశరదుడు ఆజ్ఞ ఇస్తుండగా అక్కడివారు అందరికి అన్న వస్త్రములను ఒసంగుచున్డిరి . పాక శాస్త్ర ప్రకారము ప్రతి దినమూ సిద్ద పరిచిన భక్ష్య ,భోజ్య ,లేహ్య ,చోష్యాదులతో కూడిన అన్నరాసులు పర్వతము లాగా అక్కడ కనపడుచున్నవి . ఆ మహారాజు యజ్ఞము చూచుటకై వివిధ ప్రదేశములనుండి స్త్రీ ,పురుషులు విచ్చేసిరి . వారందరికీ షడ్రసోపేతములైన భోజనములు ఏర్పాటు చేసిరి . 
చక్కగా వస్త్రాభరణములు ధరించిన పురుషులు బ్రాహ్మణులకు భక్ష్యాన్నపానాదులు వడ్డించిరి . ప్రకాశించిన మణి కుండలములను ధరించిన మరికొందరు అతిధి సేవలో వారికి సహాయపడు చుండిరి . వాక్చతురులు ,ప్రజ్ఞా శీలురు అయిన బ్రాహ్మణులు హోమ కార్యక్రమముల మద్య ఒకరినొకరు జయింప వలెననే ఉత్సాహముతో హేతుబద్దములైన అనేక వైదిక చర్చలు కావించుచుండిరి. ఆ యజ్ఞము నందు ప్రతి దినము సమర్ధులైన బ్రాహ్మణులు సవనత్రయాదిసర్వకర్మలను  వశిష్టాది మహర్షుల ప్రేరణ చే శాస్త్రోక్తముగా ఆచరించు చుండిరి . ఆ యజ్ఞము నందు యూప స్తంభములు నిలబెట్టవలసిన సమయము రాగా 6 మారేడు యూప స్తంభములు ,చండ్ర స్తంభములు 6 ,అట్లే 6 మోదుగ స్తంభములు ,పిదప విరిగి చెట్టు స్తంభము ఒకటి ,దేవదారు వృక్ష స్తంభములు రెండు నిలబెట్ట బడినవి . ప్రతి రెండు స్తంభముల మద్య బారడేసి దూరము ఉండెను . ఈ యూప స్తంభములు అన్నీ యజ్ఞ శాస్త్రజ్ఞులచే యజ్ఞ శోభలను ఇనుమడింప చేయటానికి బంగారు తొడుగులతో అలంకరింప బడినవి . నిలపబడిన యూప స్తంభములు మొత్తం 21. ప్రతి యూప స్తంభము 21 మూరల పొడుగున రూపొందించ బడినవి . ప్రతి స్తంభమునకు వేరు వేరుగా వస్త్రములతో అలంకరించిరి . ఈ యూప స్తంభములు అన్నీ హెచ్చుతగ్గులు లేకుండా చక్కగా ,దృడంగా చిల్లులు మొదలగు లోపములు లేకుండా ఎనిమిదేసి అంచులతో నునుపుగా చూడముచ్చటగా శిల్పులు సిద్దపరిచిరి . అవి శాశ్రోక్తముగా కప్పబడెను . పూలచే ,గంధములచే అలంకరింప బడెను ఆకాశమున సప్త ఋషుల వలె అవి దేదీప్యమానముగా విరాజిల్లుచుండెను . 
ఇటుకలు శాస్త్ర ప్రమాణము లో సిద్దపరచ బడినవి . యజ్ఞ వేదికల నిర్మాణముల యందు దక్షులైన బ్రాహ్మణులచే అగ్ని వేదికలు నిర్మింప బడినవి . ఇవి రెండు రెక్కలు ,తోకను చాచి తూర్పు ముఖముగా కిందకి చూచుచున్న గరుత్మంతుని ఆకృతిలో ఉండెను . బంగారు ఇటుకలతో నిర్మింప బడుట వలన అది గరుడుని సువర్ణ మయమైన రెక్కల వలె శోభిల్లుచు ఉండెను . సాధారనముగా హోమ వేదిక 6 వరసలు కలిగి ఉండును . కాని అశ్వమేధ యాగములో ఇది మూడు రెట్లు అనగా 18 వరసలు కలిగి ఉండును . అక్కడ శాస్త్ర ప్రకారముగా పశువులు ,పాములు ,పక్షులు ఆయా దేవతలను ఉద్దేశించి యూప స్తంభములకు కట్టి వేయబడెను . ఆ స్తంభములకు 300 పశువులు కట్టివేయబడినవి . దశరదుని ఉత్తమాశ్వము కూడా స్తంభమునకు కట్టబడినది . 
కౌశల్య ,సుమిత్ర ,కైకేయి అను దశరదుని భార్యలు ముగ్గురు ఆ యజ్ఞాశ్వమునకు పూర్తిగా పరిచర్యలు చేసి దానికి సవ్యాపసవ్యములు గా ప్రదక్షణ ఒనర్చి ,సంతోషముతో దానిపై బంగారు సూదులతో మూడు గుర్తులు పెట్టిరి . పట్టమహిషి అయిన కౌశల్యా దేవి ధర్మసిద్ది కొరకు స్తిరమైన చిత్తముతో అశ్వ సమీపమున ఒక రాత్రి నివసించెను . దశరద మహారాజు శాస్త్ర విధిని అనుసరించి దక్షిణగా పట్టమహిషిని బ్రహ్మ అను రుత్విజునకు ,వావాతను హోతకునకు పరివృత్తిని వుద్గాతకు పాలాకలిని అధర్వునకు ఇచ్చెను . పిమ్మట ఆ నలుగురు ఋత్విజులు వారిని పతుల వలె చేతులతో తాకిరి . అనంతరము రాజు ఆ రుత్విజులకు ప్రత్యామ్నాయ ద్రవ్యములను ఇచ్చి ,పట్టమహిషి మొదలగు నలుగురిని తిరిగి గ్రహించెను . జితేంద్రియుడు ,ప్రయోగ నిపుణుడు అయిన రుత్విజుడు అశ్వకందమును (పెన్నేరు గడ్డను )గైకొని శాస్త్ర ప్రకారము దానిని వండెను . దశరదుడు హోమ సమయమున శాస్త్రోచితముగా తన పాపములను తొలగించు కొనుటకై దాని పొగను వాసన చూసేను . 
బ్రాహ్మనోత్తములైన 16 మంది ఋత్విజులు ఆ అశ్వమేధ యాగమునకు సమకూర్చబడిన హవ్య ద్రవ్యములను మంత్రములను పటించుచు అగ్నిలో వేల్చిరి . వేద భాగములైన బ్రాహ్మనుమలలోని ,కల్ప సూత్రములను అనుసరించి అశ్వమేధ యజ్ఞము మూడు రోజులలో చేయవలసి వుంది . మొదటి రోజు చేయబడు కార్యక్రమము "చతుష్తోమము "అన  బడును . రోండవ రోజు చేయబడు కార్యక్రమమును "ఉక్త్యము "అనీ, మూడవ రోజు చేయబడు కార్యక్రమమును "అతిరాత్రము "అని పేర్కొనిరి . ఇంకను ఈ ఆశ్వమేధమున శాస్త్రోక్తములైన పెక్కు ఇతర క్రతువులను కూడా దశరదుడు జరిపించెను . శాస్త్రోక్తముగా జ్యోతిష్టోమము ,ఆయుర్యాగము ,అతి రాత్రములు రెండు ,అభిజిత్తు ,విశ్వజిత్తు ,ఆప్తోర్యామము అను ఆరు విధములగు క్రతువులను ఆచరించెను .
దశరద మహారాజు తన వంశాభివ్రుద్దికై 'హోత 'అను ఋత్విజునకు తూర్పు దిశన ఉన్న భూమిని ,'ఆధ్వర్యువు 'అను రుత్విజునకు పడమరన ఉన్న భూమిని ,బ్రహ్మ స్తానమున ఉన్న రుత్విజునకు దక్షినమునున్న భూమిని 'ఉద్గాత 'అను రుత్విజునకు ఉత్తర దిశనున్న భూమిని దక్షిణగా ఇచ్చెను . అంతట ఋత్వుజులు అందరూ యజ్ఞము ద్వారా పవిత్రుడు అయిన రాజుగారితో "ఈ సమస్త భూ మండలమును పరిరక్షించుటకు నీవే సమర్దుడవు . మాకు భూమితో పనిలేదు . దానిని పండించుటలో కాని ,రక్షించుటలో కాని మేము ఆశక్తులము . నిత్యమూ ,నిరంతరమూ మేము వేద శాస్త్రములను అధ్యయనము చేయుట అందే నిరతులము. ఓ రాజా ఈ దాన భూములకు మారుగా కొంత ధనమును మీరే ఇప్పించండి . ఓ మహారాజా !శ్రేష్టములైన మణులు కానీ బంగారమును కానీ గోవులను కానీ లేక సిద్దముగా ఉన్న ఎ వస్తువులు అయినా మాకు ఇవ్వండి . భూమి వలన మాకు ప్రయోజనమేమి ?"అని పలికిరి . 
వేద వేత్తలైన  బ్రాహ్మణులు ఇలా పలుకగా మహారాజు వారికి పది లక్షల గోవులను ,పది కోట్ల బంగారు నాణెములను ,మరియు దక్షిణలకు బదులుగా నలుబై కోట్ల వెండి నాణెములను ఇచ్చెను . ఆ రుత్విజులందరూ కలసి తమకు దక్షిణగా లభించిన సంపదలను దీశాలురైన వశిష్టునకును ,రుశ్య శ్రుంగ మహర్షికి సమర్పించారు . ఆ ఇరువురు ఆ దక్షిణలను ఋత్విజులకు యధోచితముగా పంచి ఇచ్చిరి . అప్పుడా బ్రాహ్మనోత్తములు అందరూ ప్రసన్న చిత్తులై "మేము చాలా సంతృప్తి చెందాము "అని వచించారు . అనంతరము దశరదుడు యాగము చూచుటకై వచ్చిన బ్రాహ్మణులకు మేలైన కోటి బంగారు నాణెములను శ్రద్దాదరములతో సమర్పించెను . ఈ  విధముగా కోశాగారము నందలి ధనమంతా పూర్తిగా దానము చేసిన తర్వాత నిర్ధనుడైన ఒక బ్రాహ్మణుడు అచటికి వచ్చెను . దశరదుడు ఆయనకు తన ముంజేతి కంకణము దానము చేసెను . భూమిపై సాగిలపడి తమకు నమస్కరించుచున్న దశరదుడిని బ్రాహ్మనోత్తములు సంప్రదాయ బద్దముగా వేద మంత్రములతో ఆశీర్వదించిరి . 
పుత్ర ప్రాప్తికి ప్రతిభందకములైన పాపములను తొలగించునది ,పుత్ర లాభము ద్వారా స్వర్గమును ప్రాప్తింప చేయునది, సామాన్యులైన రాజులు చేయుటకు అసాధ్యమయినది  అయిన ఉత్తమోత్తమమైన అశ్వమేధ యజ్ఞమును  ఆచరించి దశరదుడు మిక్కిలి సంతుష్ఠుడు అయ్యెను . పుత్ర ప్రాప్తికై క్రతు నిర్వహణకు రుశ్యశ్రున్గుని దశరదుడు మళ్ళీ అభ్యర్ధించెను . 


రామాయణము  బాలకాండ పదునాల్గవ సర్గ సమాప్తము . 



                           శశి ,

ఎం ఎ (తెలుగు ),తెలుగు పండితులు . 














No comments:

Post a Comment