Wednesday 22 June 2016

రామాయణము బాలకాండ -పదునెనిమిదవ సర్గ

                           రామాయణము 

                                     బాలకాండ -పదునెనిమిదవ సర్గ 

మహాత్ముడైన దశరథ మహారాజు ప్రారంభించిన అశ్వమేధ ,పుత్ర కామేష్టి క్రతువులు ముగిసినవి . దేవతలు అందరూ తమ తమ హావిర్భాగములు స్వీకరించి స్వస్థానములకు చేరిరి . యజ్ఞ దీక్షా నియమములు పూర్తి కాగానే సేవకులు ,సైనికులు ,వాహనములు వెంట రాగా రాణులతో కూడి పురమున ప్రవేశించెను . యజ్ఞమునకు విచ్చేసిన దేశాధిపతులందరినీ దశరధుడు వారి వారి యోగ్యతలనుసరించి సన్మానించెను . వారు కూడా మిక్కిలి సంతోషించి ,వశిష్ట మహర్షికి నమస్కరించి ,తమతమ దేశములకు బయలుదేరిరి . అయోధ్య నుండి తమ నగరములకు వెళ్లుచున్న శ్రీమంతులైన ఆ రాజు యొక్క సైనికులు దశరధుడు ఇచ్చిన వస్త్రాభరణములు కు సంతోషపడ్డారు . రాజులందరూ వెళ్లిన పిమ్మట శుభలక్షణ సంపన్నుడైన దశరధుడు వశిష్టాది మహర్షులు ముందుకు సాగి పోవుచుండగా పురమున ప్రవేశించెను . నగర ప్రవేశానంతరం దశరధుడు ఋశ్యశృంగుని సాదరముగా పూజించెను . పిమ్మట ఆ మహర్షి తన భార్య అయిన శాంత తో కూడి ప్రయాణమయ్యెను . ధీశాలియైన రోమపాదుడు ఆయనను సపరివారంగా అనుసరించెను .  వారినందరిని దశరధుడు కొంత దూరము అనుసరించి వీడ్కోలు పలికెను . 
దశరథ మహారాజు వచ్చిన వారందరిని వీడ్కొలిపి ,మిక్కిలి ఆనందించెను . తర్వాత పుత్ర ప్రాప్తి కొరకు ఆలోచించుచు హాయిగా నివసింప సాగెను . యజ్ఞము ముగిసిన పిమ్మట ఒక సంవత్సరము గడిచెను . 12 వ మాసము చైత్ర సుద్ద నవమి నాడు పునర్వసు నాల్గవ పాదమున కర్కాటక లగ్నమున కౌశల్యా దేవికి శ్రీ రామచంద్ర ప్రభువు పుట్టెను . ఆ సమయమున సూర్యుడు ,అంగారకుడు ,గురుడు ,శుక్రుడు ,శని అణు 5 గ్రహములు తమ ఉచ్చ స్థానము నందు అనగా క్రమముగా మేష ,మకర ,కర్కాటక ,మీనా ,తుల రాసుల యందు ఉండిరి . జగన్నాధుడు ,అన్ని లోకముల వారిచే నమస్కరింపబడు వాడు ,సర్వ శుభలక్షణ సంపన్నుడు ,మహా భాగ్య శాలి ,విష్ణవంశ సంపన్నుడు ,ఇక్ష్వాకు వంశ సంభూతుడు అయినా శ్రీరాముని పుత్రుడిగా కన్న కౌశల్య ఎంతో ధన్యురాలు . కౌశల్యా దేవి తన తపః ఫలితముగా ,చేతియందు వజ్ర రేఖలు కలవాడు మహా తేజశ్శాలి అయిన శ్రీ రాముడిని పుత్రునిగా పొందెను . 
విష్ణువు యొక్క చతుర్దఅంశయైన వాడు అగు భరతుడు కైకేయి యందు జన్మించెను . భరత జననాంతరము వీరులను ,వివిధములైన అస్త్ర ప్రయోగములందు నిపుణులు వైష్ణవంశ ఒప్పెడు వారు అయిన  లక్ష్మణుడు ,శత్రుఘ్నుడు అను కవలలు సుమిత్రాదేవి కనెను . భరతుడు పుష్యమీ నక్షత్ర యుక్త మీన లగ్నము నందు చైత్ర శుద్ధ దశమి నాడు జన్మించెను . అతడు గురువు యొక్క క్షేత్రమైన మీన లగ్నము నందు జన్మించుట వలన ప్రసన్నమైన బుద్ది కలవాడయ్యెను . లక్ష్మణ శత్రుఘ్నులు ఆశ్లేషా నక్షత్ర యుక్త జన్మించిరి . ఐదు గ్రహములు ఉచ్చ రాశులలో ఉన్నపుడు ఈ నలుగురి జననములు సంభవించెను . దశరధుని కలిగిన కుమారులు నలుగురు అన్ని విధముల ఆయనకు తగినవారు . వారిలో ప్రతి ఒక్కరు వేర్వేరుగా విశిష్ట గుణములను కలిగినవారు . రామాదుల జనన కాలములో గంధర్వులు మధురముగా గానము చేసిరి . అప్సరసలు కనుల పండుగగా నాట్యము చేశారు . దేవ దుందుభులు మోగాయి . ఆకాశము నుండి పుష్ప వర్షము కురిసింది . 
  



                                       శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 













No comments:

Post a Comment