Tuesday 21 June 2016

రామాయణము బాల కాండ -పదునేడవ సర్గము

                        రామాయణము 

                      బాల కాండ -పదునేడవ సర్గము 

మహానుభావుడైన దశరధుని పుత్రుడుగా అవతరించుటకు శ్రీ మహా విష్ణువు సంకల్పించుకున్న పిమ్మట భవిష్యత్ పరిణామాలను ఎరిగిన బ్రహ్మ దేవుడు దేవతలందరితో ఇలా పలికెను . "ఓ దేవతలారా !సత్య సంధనుడు ,మహా వీరుడు ,మన అందరికి హితాభిలాషి అయిన  విష్ణువుకు  కామ రూపులు ,బలశాలురు అయినా సహాయకులను సృజించండి . అద్భుతమైన శక్తి కలవారు ,మహా వీరులు ,వాయువు వలె మిక్కిలి వేగము కలవారు ,యుక్తిశాలురు ,,ప్రజ్ఞావంతులు ,పరాక్రమమున విష్ణువుతో సమానులు ,సామదానభేదదండోపాయములు ఎరిగిన వారు ,సమస్త మైన అస్త్ర శస్త్రములను ప్రయోగించుటలో నిపుణులు ,అమృత పానము చేసిన వారి వలె మరణం లేని వారు ,మీ వలె పరాక్రమ వంతులుఅగు పుత్రులను అప్సరసలు ,ముఖ్య గంధర్వ స్త్రీలు ,యక్ష వనితలు ,నాగ కన్యలు ,ఋక్ష ,విద్యాధర యువతులు ,కిన్నెర మహిళలు వానర స్త్రీలు మున్నగు వారి అందు వానర రూపములో సృజింపుడు . పూర్వమే జాంబవంతుడు". 
బ్రహ్మ దేవుడు ఇలా పలుకగా ఆయన ఆజ్ఞ మేరకు దేవతలు వానరుల రూపములో కొడుకులను కన్నారు . మహాత్ములైన ఋషులు ,సిద్దులు ,విద్యాధరులు ,నాగులు ,చారణులు ,వానర ,భల్లూక వీరులను పుత్రులుగా బడసితిరి . ఇంద్రుడు మహేంద్ర పర్వతము వలె మిక్కిలి దృఢమైన దేహము కలవాడు ,వానర శ్రేష్ఠుడు అయిన వాలికి జన్మ నిచ్చెను . తపింప చేయు వారిలో శ్రేష్ఠుడు అయిన సూర్య భగవానుడు సుగ్రీవునికి జన్మనిచ్చెను . వానరులందరిలో ముఖ్యుడు ,ప్రజ్ఞా శాలి ,మిక్కిలి ఉత్తముడు అయినా తారుడు అను వానరుడు బృహస్పతి వలన కలిగెను . శ్రీమంతుడు అయిన 'గంధమాధనుడు 'అణు వానరుడు కుభేరుడి వలన జన్మించెను . విశ్వకర్మ వలన 'నలుడు 'అణు వానరోత్తముడు జన్మించెను . అతడు సర్వ కార్యములను నిర్వహించుటలో దక్షుడు . ఉత్తమ లక్షణాలు కల 'నీలుడు 'అణు వానరుడు అగ్ని దేవుడి వలన జన్మించెను . అతడు అగ్ని వలె భాసిల్లువాడు ,వానరులందరిలోను మిక్కిలి తేజస్వి ,కీర్తి ప్రతిష్టలు కలవాడు . ప్రశస్తమైన రూపము కల మైందుడు ,ద్వివిదుడు అను  వానరులు సౌందర్య సంపన్నులైన అశ్వినీ దేవతల మానస పుత్రులు . పర్జన్యుడు (వర్షాది దేవత )మహా బలశాలి అయిన శరభునకు జన్మమిచ్చెను . సర్వ శుభ లక్షణ సంపన్నుడు,వానర ప్రముఖుడు  అయిన హనుమంతుడు వాయుదేవుని కుమారుడు . అతడు వజ్రము వలె అభేద్యమైన శరీరము కలవాడు . గరుత్మంతుడి వలె వేగ గమనుడు . మిక్కిలి బలవంతఁడు . 
ఈ విధముగా వేలకొలది వానరులు ,భల్లూక జాతివారు ,గోపుచ్చ (కొండముచ్చు )జాతివారు వివిధ దేవతల సంతానము ఈ జన్మించిరి . వారు రావణ సంహారము నందు ఆసక్తి కలవారు .సాటిలేని బల పరాక్రమాలు కలవారు . మహావీరులు ,కామ రూపులు ,మేరు మంధర పర్వతము వలె దృఢమైన విశాల శరీరము కల వారు . ఈ వానరాది ప్రముఖులు అందరూ తమకు జన్మలిచ్చిన దేవతల యొక్క విలక్షణమైన రూపములను ,వేషములను ,పరాక్రమములను కలిగివుండిరి . వారందరూ మహాకాయులు ,వనసంచారులు ,వన ఫలములను ,కందమూలములను భుజించువారు . కామరూపులు ,మహాత్ములు ,సేనానాయకులు అయిన ఇట్టి వానరుల సంఖ్య కోట్లకు చేరెను . ఆ వానరులలో ప్రముఖులైన వారు వానర ప్రధాన సేనలకు నాయక శ్రేష్టులైరి . వారు కూడా వానర వీరులను సృజించిరి . వేలకొలది వానరులు 'ఋక్షవంతము 'అను పర్వత సానువు నందు నివసింపసాగిరి . మరికొంత మంది నానా విధములగు కొండలను ,అడవులను ఆశ్రయించిరి . సూర్యుని అంశతో పుట్టిన సుగ్రీవుడు ,ఇంద్రుని అంశతో పుట్టిన వాలి ఇరువురు సోదరులు (ఋక్షరజుని కుమారులు )వానర వీరులందరూ ఈ ఇరువురు సోదరులను, నలుని ,నీలుని  ,హనుమంతుని మరియు ఇతర వానర ప్రముఖులను ఆశ్రయించి ఉండిరి . దృఢమైన బాహువులు కలవాడు ,అమిత పరాక్రమశాలి అయిన వాలి ఆ భల్లూకములకు ,కొండముచ్చులకు ,వానరులకు ప్రభువై తన భుజ బలముచే వారిని పరిపాలించు చుండెను . ఆ వానరులు పర్వతములతో ,అడవులతో ,సముద్రములతో కూడిన భూమండలమంతయు వ్యాపించి ఉండిరి . ఆ వానర సేనా నాయకులు శ్రీరామునకు సహాయ పడుటకు ఈ భూమండలము నందు అంతటా వ్యాపించి ఉండెను . 

రామాయణము  బాలకాండ పదునేడవ సర్గ సమాప్తము . 



                         శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 



















No comments:

Post a Comment