Tuesday 14 June 2016

రామాయణము బాల కాండ -పదవ సర్గ

                                రామాయణము 

                                   బాల కాండ -పదవ సర్గ 

రాజు కోరికపై సుమంత్రుడు ఇలా చెప్పెను . "మహారాజా !రోమ పాదుని మంత్రులు రుశ్య శృంగుని రప్పించిన విధము చెబుతాను వినండి ". మంత్రులతో కూడిన రోమపాదుడు తో పురోహితుడు ఇలా అనెను . "మేము చెప్పిన ఈ ఉపాయము వలన ఏ అపాయము జరగదు . రుశ్యశృంగుడు వనమున నివసించువాడు అతడు తపస్సు నందు ,వేదాధ్యాయనము నందు నిమగ్నమై ఉంటాడు . అతడు స్త్రీల స్వరూపముల గురించి గాని ,ఇంద్రియ సుఖముల గురించి ఎరుగడు . మానవుల చిత్తముల ను ఆకర్షించునట్టి విషయముల ద్వారా ఆయనను ఇక్కడకు రప్పిద్దాము . చక్కగా అలంకరించుకున్న అందమైన గణికలకు  బహుమానాలు ఇచ్చి వారిని పంపుదాము . వారు అక్కడికి వెళ్లి వివిదోపాయములతో రుశ్యశృంగుని ఆకర్షించి తీసుకు వస్తారు . రోమపాదుడు పురోహితుని సూచనలను ఆమోదించెను . పిమ్మట పురోహితుడు ,మంత్రులు ఆ విధముగానే చేసిరి . వారి ఆదేశము ప్రకారము స్త్రీలు ఆ మహా వనమున ప్రవేశించారు . ఆ ఆశ్రమ సమీపమునకు చేరి ,వారు నిత్యమూ ఆశ్రమ వాసియు ,జితేంద్రియుడు,ఋషి పుత్రుడు  అయిన రుశ్యశృంగ మహర్షి దర్శనముకై ప్రయత్నము చేయుచున్నారు . 
పితృ సేవలోనే సదా సంతుష్టుడై వుండు రుశ్యశృంగుడు ఆశ్రమము దాటి బయటకు రాలేదు . ఆ తపస్వి పుట్టింది మొదలు స్త్రీని గాని ,పురుషుడిని గాని ,నగరములకు గాని గ్రామములకు సంభందించిన వస్తువులను కాని మఱి ఏ ప్రాణిని కాని చూసి ఎరుగడు . ఒక రోజు రుశ్యశృంగుడు ఏదో పని మీద ఆ గణికలు ఉన్న ప్రాంతానికి వచ్చి వారిని చూసేను . చిత్ర విచిత్రములైన వేషములను ధరించిన ఆ సుందరీమణులు మధుర స్వరములతో గానము చేయుచు రుషిపుత్రుని సమీపించి ఇలా పలికిరి . "ఓ బ్రాహ్మనోత్తమా నీవు ఎవరు ?ఎవరి కుమారుడివి ?ఇక్కడ ఎందుకు ఉంటున్నావు ?ఈ నిర్జనమైన ఘోర అరణ్యములో ఒంటరిగా సంచరించుటకు కారణము ఏమిటి ?మేము వినాలనుకుంటున్నాము . "ఆ  రుశ్యశృంగుడు ఇదివరలో ఎప్పుడూ అట్టి ఆకర్షణీయమైన రూపములు కల స్త్రీలను చూసి ఎరుగడు . కనుక వారిని చూసిన సంతోష ములో తన తండ్రి గురించి వారితో ఇలా చెప్పెను . 
"మా తండ్రి విభాండక మహర్షి . నేను ఆయన కుమారుడను . నా పేరు రుశ్యశృంగుడు ఈ వనమున నా తపో జీవనము సుప్రసిద్దము . ఓ సౌందర్య మూర్తులారా ఇక్కడికి దగ్గరలోనే మా ఆశ్రమము వుంది . మా ఆశ్రమమునకు మీరందరూ రండి ". ఆయన మాటలు విని వారందరికీ ఆశ్రమము చూడాలనే కోరిక కలిగెను . వారందరూ ఆయనతో కలసి ఆశ్రమమునకు వెళ్ళిరి . ఆశ్రమమునకు వచ్చిన వారందరికీ అతడు అర్ఘ్య పాద్యములను ,కంద మూల ఫలములను సమర్పించెను . ఆ స్త్రీలు వాటిని స్వీకరించి "ఓ ద్విజోత్తమా మేము ఇస్తున్న ఈ ఫలములను కుడా స్వీకరింపు . నీకు మేలు జరుగుతుంది "అని లడ్డూలు మొదలైన ఆహార పదార్ధములను ఇచ్చిరి . తేజో మూర్తి అయిన రుశ్యశృంగుడు వాటిని తిని వనములలో నివసిన్చువారు రుచి చూడని ఫలములు ఇవి" అని భావించెను . ఆ గణికలు విభాండక మహర్షి ఏ క్షణములో వచ్చునో అని బయపడి మేము ఒక వ్రతము ఆచరించాలి అని సాకు చెప్పి ఆశ్రమము నుండి వెళ్ళిపోయెను . వారందరూ వెళ్ళిపోగా రుశ్యశృంగుడు వ్యాకుల చిత్తుడై మిక్కిలి దుఖపడెను . మరునాడు మళ్లీ ఆ గణికలు ఉన్న ప్రదేశానికి వెళ్ళెను . తమ వద్దకు వస్తున్న ఆ విప్రుని చూసిన వెంటనే వారు సంతోషముతో పొంగిపోయారు . ఆయనను సమీపించి వారు అందరూ ఇలా పలికారు . 
ఓ మహాత్మా !మా ఆశ్రమానికి విచ్చేయండి . అక్కడ ఇక్కడ కంటే ఘనముగా సత్కారము జరుగును . "అని చెప్పిరి . వారి మాటలు విని అతడు వారి వెంట పోదలిచెను . ఆ వారంగనలు ఆయనను తన వెంట తీసుకుని అంగ దెశముకు వెళ్ళిరి . మహాత్ముడైన ఆ బ్రాహ్మణోత్తముడు ఆ రాజ్యమున కాలు మోపినంతనే వరుణుడు లోకమునకు ఆహ్లాదమును కూర్చుచు వర్షము కురిపించెను . అంతట రోమపాద మహారాజు తన రాజ్యమునకు వర్షమును తెచ్చిన మునికి ఎదురేగి భూమిపై సాగిలపడి వినమ్రతతో నమస్కారము చేసెను . ఆ రాజు భక్తి శ్రద్దలతో ఆ మునికి అర్ఘ్య పాద్యాదులను సమర్పించెను . పిమ్మట ఓ మునీశ్వరా !వారాంగనల ద్వారా మిమ్ము ఇక్కడికి రప్పించినందుకు ఆగ్రహపడకు మమ్ము అనుగ్రహించుము . అమీ రాజు రుశ్యశృంగుని వేడుకొనెను . మునితో కూడా అంతః పురమున ప్రవేశించిన పిదప ఆ రోమపాదుడు ప్రసన్నమనస్కుడై ,తన కూతురైన శాంతను ఆయనకు ఇచ్చి యధావిధిగా వివాహమొనర్చి ,ఆనందబరితుడయ్యేను . మహా తేజశ్శాలి అయిన ఆ రుశ్యశృంగుడు గౌరవాదులను అందుకోనుచు ,భార్య అయిన శాంతతో కూడి రాజాంతః పురమున సర్వ సుఖములతో నివసింప సాగెను . 

రామాయణము బాలకాండ పదవ సర్గ సమాప్తము . 

                 శశి ,

ఎం . ఎ (తెలుగు ),తెలుగు పండితులు . 












 

No comments:

Post a Comment