Saturday 11 June 2016

రామాయణము బాల కాండ -ఆరవ సర్గ

                            రామాయణము 

                            బాల కాండ -ఆరవ సర్గ                        

దశరద మహా రాజు వేదార్ధములను బాగుగా ఎరిగినవాడు .            శూరులను ,పండితులను ఆదరించి తన ఆస్థాన మందే ఉంచుకునే వాడు  . భావి పరిణామములను ముందుగా గుర్తించువాడు . మిక్కిలి ప్రతాపశాలి . పుర జనులకు ,తన ఆస్థానములోని వారికి ప్రియమును కూర్చువాడు . ఇక్ష్వాకు వంశములో అతిరధుడు . విద్యుక్తముగా యజ్ఞములు చేయువాడు . ధర్మకార్యములందు నిరతుడు . ప్రజలందరినీ అదుపులో ఉంచగలడు  . రాజర్షి ,ముల్లోకాలలో సుప్రసిద్దుడు . చతురంగ బలములు కలవాడు . శతృవులను తుదముట్టించే వాడు . సుప్రసిద్దులైన మిత్రులు కలవాడు . నిషిద్ద విషయముల అందు మనసు పెట్టనివాడు . ధన ,కనక ,వస్తు ,వాహనములను ,తదితర నిధులను కలిగి యుండుట అందు ఇంద్రునితో ,కుభేరునితో సమానుడు . అట్టి దశరద మహారాజు లోక పరిరక్షణ అందు మహా తేజశ్శాలి అయిన వైవస్వత మనువు వలె తన కోసల రాజ్యమును పరిపాలించెను . 
శ్రేష్ఠ మైన ఆ అయోధ్యా నగరము నందలి జనులు సుఖ శాంతులతో సంతోషముగా జీవించు చుండిరి . వారు ధర్మాత్ములు ,అనేక శాస్త్రములను అధ్యయనము చేసినవారు . తాము కష్ట పడి సంపాదించిన ధనముతోనే తృప్తి పడేవారు . సత్యమును పలికెడి వారు . ఆ మహా నగరము నందలి గృహస్తులలో ఒక్కడు కూడా సంపన్నుడు కానివాడు కాని ,గోవులు అశ్వములు ,ధన ధాన్య సమ్రుద్దియు లేనివాడు గాని లేడు . వారందరూ తమ సంపదను ధర్మకార్యములకు ,ధర్మ బద్దముగా అర్ధ ,కామ ,పురుషార్ధములను సాధించుటకు వినియోగించేవారు . ఆ పురము నందలి జనులలో కామాతురుడు కాని ,లోభికాని ,క్రూరుడు కాని ,విద్యా హీనుడు కాని ,నాస్తికుడు కాని ఎంత వెతికినా దొరకడు . అయోధ్య నందలి స్త్రీ పురుషులు ధర్మ ప్రవర్తనచే శ్రేష్ఠులు . ఇంద్రియ నిగ్రహము కలవారు ,సత్స్వభావము కలవారు . సదాచార సంపన్నులు ,మహర్షులవలె నిర్మల  హృదయులు . ఆ అయోధ్యలో చెవులకు ఆభరణములు లేనువాడు లేడు ,శిరస్త్రానము తలపాగా మొదలగున్నవి లేనివాడు లేడు . తన సంపదలకు తగ్గట్టుగా భోగములు అనుభవింపనివాడు కాని లేడు . అభ్యంగన స్నానము చేయని వాడు లేడు . చందనము మొదలగు సుగంధ ద్రవ్యములను పూసుకోనివాడు కాని లేడు . నుదుట తిలకమును కాని కస్తూరిని కాని బొట్టుగా ధరింప నివాడు లేడు . 
ఆ అయోధ్యా నగరము నందు అగ్ని కార్యములు చేయని వాడు కాని ,సోమ యాగములు ఆచరించనివాడు కాని ,విద్యలను అరకొరగా నేర్చినవాడు కాని లేడు . దొంగలు కాని వర్ణసంకరులు కానీ లేనే లేరు . ఆ నగరము నందు బ్రాహ్మణులు మొదలగు చాతుర్వర్ణముల వారు దేవతలను ,అతిధులను పూజించే వారు . చేసిన మేలును మరువని వారు . ప్రీతితో దానములు చేసే వారు . బ్రాహ్మణులు పాండిత్యము నందు శాస్థ్రవాధముల అందు శూరులు ,మిగిలిన వర్ణములు తమతమ రంగములలో వీరులు శూరులు . క్షత్రియులు బ్రాహ్మణుల యెడ గౌరవము కలిగి రాజ్య పాలన చేయుచుండెడివారు . వైశ్యులు క్షత్రియుల ఆజ్ఞలను పాటించే వారు . శూద్రులు తమతమ ధర్మములను ఆచరించుచు పై మూడు వర్ణాల వారిని సేవించు చుండెడి వారు . కాంభోజ దేశపు జాతి గుర్రములతో ,బాహ్లిక దేశమునకు చెందిన ఉత్తమ ఆశ్వాలతో సింధు దేశమున జన్మించిన శ్రేష్టములైన గుఱ్ఱముల తో ఆ పురము విలసిల్లుచూ ఉండెను . వింధ్య పర్వతమున పుట్టిన మదపుటేనుగులు తో హిమవన్నగమున జన్మించిన మహా గజములతో దక్షిణ దిగ్గజమైన వామన జాతిలో ఉద్భవించినవి అగు భద్రగజములతోను ఆ పురము నిండి ఉండెను . ఆ నగరము వెలుపల కూడా రెండు యోజనముల మేర వ్యాపించి ఉండెను . సార్ధక నామదేయము కల ఆ అయోధ్య (ఇతరులు జయించుటకు సాద్యము కానిది )దశరద మహారాజు పాలించుచు ఉండెను . 
రాజ శిరోమణి ,మహా తేజశ్శాలి అయిన దశరద మహారాజు చంద్రుడి నక్షత్రములవలె శత్రువులను తేజో హీనులుగా చేయుచు పరిపాలించుచు ఉండెను . ఆ నగరము పేరుకు తగినట్లుగా దృఢమైన గడియలు కల కవాటముల తో ,చిత్రములైన గృహములతో ,శోభిల్లుచు ఉండెను . వేలకొలది పుర జనులు తో కళకళ లాడుచు శుభప్రదమైన ఆ పురి నిఇంద్ర సమానుడైన ఆ దశరద మహారాజు పరిపాలించుచు ఉండెను .


బాలకాండ ఆరవ సర్గ సమాప్తము 


                 శశి ,

ఎం . ఎ (తెలుగు ),తెలుగు పండితులు .  















       

No comments:

Post a Comment