Monday 20 June 2016

రామాయణము బాల కాండ -పదునారవ సర్గ

                                 రామాయణము 

                                  బాల కాండ -పదునారవ సర్గ 

బ్రహ్మాది దేవతలు ఇట్లు ప్రార్ధింపగా దేవాదిదేవుడైన శ్రీ మన్నారాయణుడు తాను సర్వజ్ఞుడు అయిననూ వారితో మధురముగా ఇలా వచించెను . "ఓ దేవతలారా !దుర్మార్గుడైన ఆ రావణుని చంపుటకు ఉపాయము తెలపండి . దానిని అనుసరించి ,ఆ ఋషి కంటకుని హతమార్చేదను . శ్రీ మహావిష్ణువు వచనములకు అందరూ ఇలా సమాదానమిచ్చిరి . "ఓ శత్రు సంహారకా !  నీవు మానవుడిగా అవతరించి ,యుద్దమున ఆ రావణుని రూపుమాపుము . పూర్వము అతడు దీర్గ కాలము తపస్సు చేసెను . దేవతలలో పెద్దవాడు ,సృష్టి కర్త అయిన బ్రహ్మ వాని తపస్సుకు సంతుష్ఠుడు అయ్యెను . సంతుష్ఠుడు అయి ఉన్న బ్రహ్మ నుండి ఆ రాక్షసుడు మానవుల నుండి తప్ప ఎ ఇతర ప్రాణి నుండి తనకు చావు లేకుండా వరమును పొందాడు . మానవుల పట్ల అతనికి గల చులకన భావమే ఇందుకు కారణము . ఈ విధముగా పితామహుడి వర గర్వము వలన గర్వితుడై ,ఆ రాక్షసుడు ముల్లోకములను పీడించు చున్నాడు . స్త్రీలను కూడా కించపరుచుచున్నాడు . కావున ఓ అరిసూదనా !మానవుల వలెనే అతడు మరనిన్చగలడు . "
సమస్త ప్రాణులకు ఆధారభూతుడైన శ్రీ మహావిష్ణువు దేవతల మాటలను విని ,దశరద మహారాజు కి పుత్రుడిగా జన్మించుటకు నిశ్చయించుకొనెను . అదే సమయమున మహా పరాక్రమంతుడు ,శత్రు సంహారకుడు అయిన దశరదుడు పుత్రులు లేక తపన పడుచూ 'పుత్రకామేష్టి 'యాగమును ఆచరించెను . మానవుడిగా అవతరించుటకు నిశ్చయించుకున్న మహా విష్ణువు దేవతల ,మహర్షుల పూజలు అందుకుని బ్రహ్మ దేవుడి వద్ద వీడ్కోలు తీసుకొని అంతర్ధానమయ్యెను . దశరదుడి యొక్క యజ్ఞ కుండము నుండి సాటిలేని తేజస్సుతో ఓ మహా పురుషుడు ప్రత్యక్షమయ్యెను . అతడు మహా బలపరాక్రమ సంపన్నుడు ,కృష్ణ వర్ణముతో విరాజిల్లుతూ ఉండెను . అతడు ఎరుపు రంగు వస్త్రములను ధరించి వున్నాడు . అతని కంటస్వరము దుందుభి వలె గంభీరముగా ఉండెను . అతని శరీరముపై గల రోమములు ,మీసములు ,కేశాలు సింహపు జూలు వలె మృదువుగా ఉండెను . అతడు శుభ లక్షణ సంపన్నుడు ,దివ్యాభరణ భూషితుడు ,గిరి శిఖరము వలె ఉన్నతమైన వాడు . మదించిన పెద్ద పులి వలె భయంకరుడు . సూర్య తేజస్సుతో ప్రకాశించువాడు. అట్టి దివ్య పురుషుడు ఒక బంగారు పాత్రను స్వయముగా ప్రియ పత్ని వలె ప్రేమతో రెండు చేతులతో పట్టుకుని ఉండెను . వెండి మూతగల ఆ బంగారు పాత్ర దివ్యమైన పాయసముతో నిండి యుండెను . 
ఆ దివ్య పురుషుడు దశరద మహారాజుతో "ఓ రాజా నేను బ్రహ్మ దేవుడు పంపగా ఇక్కడికి వచ్చాను . "అని చెప్పెను . అప్పుడు మహారాజు అంజలి ఘటించి "ఓ మహాత్మా నీకు స్వాగతము . నా కర్తవ్యము తెలుపండి "అని పలికెను . అప్పుడు ఆ దివ్య పురుషుడు దశరదునితో ఇలా చెప్పెను . "ఓ రాజా !అశ్వమేధ యాగము ,పుత్రకామేష్టి అను వాటి ద్వారా నీవు దేవతలను సంతుష్టులను గావించితివి . వారి అనుగ్రహముతో ఇది లభించింది . ఓ నరేంద్రా !ఇది దివ్యమైన పాయసము సంపత్కరము ,ఆరోగ్యమును వృద్ది చేస్తుంది . అంతే కాదు ఇది సంతానమును కూడా ప్రసాదించును . దీనిని స్వీకరింపుము . ఈ పాయసమును నీ ప్రియ పత్నులకిచ్చి భుజించమని చెప్పు . దీనిని సేవించుట వలన యజ్ఞ ఫలముగా నీ భార్యలకు పుత్ర సంతానము కలుగును . "అనంతరము రాజు అట్లే అని పలికి ,పరమ ప్రీతుడై దివ్య పాయసముతో నిండి ,దేవదత్తమైన ఆ బంగారు పాత్రను వినమ్రుడై గ్రహించెను . ఆ దివ్య  పురుషుడికి ప్రదక్షణ చేసెను . పాయస ప్రధాన కార్యక్రమమును ముగించుకుని ,అద్భుతాకారముతో ,దివ్య తేజస్సుతో విరాజిల్లుతున్న ఆ మహాపురుషుడు వెంటనే అంతర్ధానమయ్యెను . 
దశరద మహారాజు దేవతలు అనుగ్రహించిన ఆ దివ్య పాయసమును పొంది నిర్ధనుడు ఒక నిధిని పొందినట్లు మహానందభరితుడయ్యేను. సంతాన దాయకమైన దివ్య పాయసము లభించుట వలన అంతః పుర స్త్రీలందరూ మిక్కిలి సంతోషముతో ప్రసన్న ముఖ కాంతులతో శరత్కాలమందు ఆహ్లాదకరమైన చంద్ర కిరణములతో ప్రకాశించు ఆకాశము వలె తెజరిల్లిరి . దశరదుడు అంతః పురమున ప్రవేశించి కౌశల్య మొదలగు రాణులతో "మనకు పుత్రులను ప్రసాదించు ఈ పాయసమును స్వీకరించండి "అని పలికెను . ఆ మహారాజు కౌశల్యా దేవికి అమృత తుల్యమగు ఆ పాయసములొ సగ భాగము ఇచ్చెను . మిగిలిన సగ భాగములో సగ భాగము సుమిత్రా దేవికి ఇచ్చెను . మిగిలిన పావు భాగములో సగ భాగము కైకేయికి ఇచ్చెను . మిగిలిన భాగమును మరల సుమిత్రకు ఇచ్చెను .   ఆ ముగ్గురు రాణులు దశరదుని నుండి పాయసమును స్వీకరించి అది తమకు లభించిన మహా భాగ్యముగా భావించిరి . పిమ్మట ఆ రాణులు ముగ్గురు తమకు లభించిన పాయసమును ఎవరి భాగము వారు భుజించి అగ్ని వలె తేజోమూర్తులై విరాజిల్లిరి . కొద్దికాలములోనే వారు ముగ్గురు గర్భవతులు అయ్యిరి . దశరదుడు తన భార్యలను చూసి మిక్కిలి సంతోషించెను . 

రామాయణము బాలకాండ పదునారవ సర్గ సమాప్తము . 


                            శశి ,

ఎం .ఎ (తెలుగు ),తెలుగు పండితులు . 


















No comments:

Post a Comment