Friday 17 June 2016

రామాయణము బాల కాండ -పన్నెండవ సర్గ

                          రామాయణము 

                      బాల కాండ -పన్నెండవ సర్గ 

రుశ్యశృంగుడు  అయోధ్యకు వచ్చిన  చాలా కాలము తర్వాత మనోహరమైన ఒక వసంత ఋతు ప్రారభంలో  దశరద మహారాజు అశ్వమేధ యాగము చేయ సంకల్పించెను . పిమ్మట దశరద మహారాజు దివ్య తేజశ్శాలి అయిన రుశ్యశృంగ మహామునికి పాదాభివందనము చేసి ,ఆయన అనుగ్రహము పొందెను . పుత్ర సంతాన ప్రాప్తికై యజ్ఞమునకు ప్రధాన రుత్విజుడిగా వుండుటకై ఆయనను అభ్యర్ధించెను . రుశ్యశృంగుడు అందుకు అంగీకరించి "యజ్ఞ ద్రవ్యములను సిద్దము చేయండి . యాగాశ్వాన్ని విడిచి పెట్టండి "అని రాజుతో చెప్పెను . అప్పుడు దశరదుడు మంత్రి ముఖ్యుడు అయిన సుమంత్రుని ఇట్లు  ఆదేశించెను . "సుమంత్రా! వేద పండితులను  ఋత్విజులును ఐన సుయజ్ఞుని ,వామదేవుని ,జాబాలిని ,కాశ్యపుని ,పురోహితుడైన వశిష్టుని అట్లే తదితర ద్విజోత్తములను శీగ్రముగా వెంట తీసుకు రా ". అనంతరము శీఘ్రగమనుడు  అయిన సుమంత్రుడు త్వర త్వరగా వెళ్లి వేదపారంగతులు అయిన బ్రాహ్మనోత్తములను అందరిని వెంట పెట్టుకుని వచ్చెను . ధర్మాత్ముడైన దశరద మహారాజు వారిని పూజించి ,ధర్మార్ధ సాధనకు ఉప యుక్తమగు మధుర వచనములు పలికెను . "పుత్రుల కొరకై తపనతో తహ తహలాడుచున్న నాకు మనః శాంతి కరువయినది . అందుకు అశ్వమేధ యాగమును చేయుటకు సంకల్పించితిని . ఈ యాగమును విధి విదానముగా చేయగోరుచున్నాను . రుశ్యశృంగుని ప్రభావముచే నా కోరికలు సిద్దించును . "
ఆ మాటలు విని ఆ బ్రాహ్మనోత్తములు అందరూ బాగు బాగు అని అభినందించి "అశ్వమేధ యాగము చేయవలెనని సత్సంకల్పము నీకు కలిగినందున అమిత పరాక్రమ శాలురు అయిన నలుగురు కొడుకులను పొందుతావు . "అని సాదరముగా పలికిరి . బ్రాహ్మణులు పలికిన ఈ మాటలు విని దశరదుడు మిక్కిలి సంతోషించి మంత్రులను ఉద్దేశించి "గురువుల ఆదేశానుసారము సామగ్రిని తెపించండి . నలుగురు ఋత్విజులు ముందు వెళుతూ వుండగా ,సమర్ధులైన 400 మంది యోధుల రక్షణలో యజ్ఞాశ్వమును విడిచిపెట్టండి . సరయు నదికి ఉత్తర తీరమున యజ్ఞ భూమిని సిద్దము చేయండి . క్రమము తప్పకుండా శాస్త్రోక్తముగా విఘ్న నివారకములు అయిన శాంతి కర్మలను జరిపించండి . నేను సంకల్పించిన ఈ అశ్వమేధ యాగము ఎట్టి లోపములు లేకుండా పరిసమాప్తి అగునట్లు చూడండి . కార్య నిర్వహణలో మీరు మిక్కిలి సమర్ధులు కదా  "అని పలికెను . 
ఆ మంత్రులు అందరూ మహారాజు యొక్క ఆజ్ఞలు విని "ప్రభువులు ఆశించినట్లే "అని ఆయనను ప్రశంసించుచు తదాజ్ఞలు నిర్వర్తించిరి . ఆ బ్రాహ్మనోత్తములు అందరూ దశరద మహారాజుని పొగిడారు . ఆయన ఆజ్ఞను తీసుకొని వారందరూ తమతమ నివాసాలకు వెళ్ళిరి . విప్రులందరూ వెళ్ళిన తర్వాత మిక్కిలి తేజశ్శాలి అయిన దశరదుడు మంత్రులందరినీ పంపివేసి ,తానుకూడా తన ప్రాసాదమునకు వెళ్ళెను . 

రామాయణము బాలకాండ పన్నెండవ సర్గ సమాప్తము . 


                      శశి ,

ఎం . ఎ (తెలుగు ),తెలుగు పండితులు . 

















 

No comments:

Post a Comment