Sunday 12 June 2016

రామాయణము బాల కాండము -ఏడవ సర్గ

                         రామాయణము 

                           బాల కాండము -ఏడవ సర్గ 

ఇక్ష్వాకు వంశజుడు ,మిక్కిలి ప్రతిభా వంతుడు అయిన ఆ దశరధ మహారాజు యొక్క అమాత్యులు (మంత్రులు )కార్య విచారణ లో దక్షులు . ఇతరుల అభిప్రాయములను గుర్తించడం లో సమర్ధులు . ఎల్లప్పుడూ రాజుకు మంచిని చేయుట అందే నిరతులు ,సద్గుణ సంపన్నులు . వీరుడు గొప్ప కీర్తి ప్రతిష్టలు కలవాడు అయిన దశరద మహా రాజు ఆస్థానము నందు 8 మంది మంత్రులు కలరు . దృష్టి ,జయంతుడు ,విజయుడు ,సిద్దార్ధుడు ,అర్ధసాధకుడు ,అశోకుడు ,మంత్ర పాలుడు ,సుమంత్రుడు అను వారు ఆ ఎనిమిది మంది మంత్రులు . వశిష్టుడు ,వామదేవుడు అను మహర్షులు ఇద్దరూ ఆ ఆస్థానము  నందు ప్రధాన పురోహితులుగా వుండిరి . ఇంకను జాబాలి మొదలగు పురోహితులు ,మంత్రులు వుండిరి . వారు న్యాయ శాస్త్రము ,దండ నీతి మొదలగు రాజ విద్యలలో నిపుణులు . ఆకృత్యములకు పాల్పడనివారు . నీతి కుశులురు . రాజకార్యముల అందు ఏమరుపాటు లేనివారు . త్రికరణ శుద్దికలవారు . తేజో మూర్తులు . క్షమా గుణము కలవారు . కీర్తి ప్రతిష్టలు కలవారు . చిరునవ్వుతో ముందుగా మాట్లాడువారు . కోపములవలన కాని ,కోరికల వలన కాని ,స్వార్ధ చింతన వలన కాని అసత్యమునకు వడిగట్టని వారు . స్వ రాష్త్రముల  అందు కాని పర రాష్ట్రముల అందు కాని జరిగిన జరుగుచున్న జరగబోవు విషయములు అన్నియు ఆ మంత్రులకు చారుల ద్వారా తెలుసుకుంటూనే వుంటారు . ఆ మంత్రులు సమస్త వ్యవహారముల అందు సమర్ధులు . మిత్రుల పట్ల తమ ప్రవర్తనకు సంబంధించి రాజ పరీక్షలలో నెగ్గినవారు . అపరాధము చేసిన వారు తమ సుతులు అయినప్పటికీ నిష్పక్షపాతముగా దండిన్చేవారు . వారు కోశాగారమున నింపుటకై ధనమును సమకూర్చుట ఎందును యోగ్యతలను బట్టీ వేతనములను ఇస్తూ చతురంగ బలములను సంరక్షించుట అందు జాగరూకులై ఉందురు . ఇంకను వారు శత్రువులును ఎదుర్కొనగల వీరులు సర్వదా శత్రువులును జయించుటకు వుత్సాహపడుచున్డువారు . అయినను శత్రువు నిరపరాధిఅయినచొ అతనిని దండించే వారు కాదు . రాజ నీతిని అనుసరించి శాసనములను ఆచరణ లో ఉంచేవారు . అందు వలన స్వదేశ వాసులైన సాధువులను రక్షించు వారు . 
దశరద మహారాజు గూడచారుల ద్వారా స్వదేశ ,పరదేశ పరిస్థితులను గమనించుచు అధర్మమునకు తావు లేకుండా ధర్మ యుక్తముగా ప్రజలను రంజింప చేయుచు దేశమును పాలించుచు ఉండెను . మహా దాతగా సత్యసందుడుగా ముల్ల్లోకాలలో ఖ్యాతికెక్కిన వాడై ఆ మహారాజు ఈ పృదివిని పరిపాలించుచు ఉండెను . దశరదునకు పెక్కు మంది రాజులు మిత్రులుగా వుండిరి . సామంత రాజులందరూ ఆయనకు పాదాక్రాంతులై వుండిరి . అతడు తన ప్రతాపముచే క్షుద్రులు అయిన శత్రువుల అందరిని రూపుమాపెను . శత్రువులలో ఆయన కంటే అధికుడు కాని ,ఆయనతో సమానుడు కాని ఎవ్వడూ లేడు . ఇంద్రుడు దేవలోకమువలె ఆ దశరదుదు భూలోకమును పరిపాలించుచు ఉండెను . రాజునకు హితము గుర్చుటకై తగిన విధములుగా మంత్రాలోచనలు చేయుటకు నియమింప బడినవారు . ప్రభు భక్తి పరాయణులు ,భుద్ది కుశులురు ,కార్య దక్షులు అయినట్టి మంత్రులతో కూడిన దశరద మహారాజు తేజోమయములు అయిన కిరణములతో ఒప్పుచున్న ఉదయ భానుని వలె ప్రకాశించుచు ఉండెను . 

రామాయణము  బాలకాండ ఏడవ సర్గ  సమాప్తము . 


                 శశి ,

ఎం . ఎ (తెలుగు ),తెలుగు పండితులు . 










No comments:

Post a Comment