Monday 13 June 2016

రామాయణము బాల కాండ -తొమ్మిదవ సర్గ

                                రామాయణము 

                                       బాల కాండ -తొమ్మిదవ సర్గ 

మంత్రి ,రధసారధి అయిన సుమంత్రుడు మహారాజు రాణులతో పలికిన మాటలు విని దశరదుడి తో ఏకాంతమున ఇలా చెప్పెను . "పుత్ర ప్రాప్తికై వశిష్టాది మహర్షులు మీకు ఉపదేశించిన అశ్వమేధ యాగ విషయమును నేను ఇది వరకు ఇతిహాస రూపములో విన్నాను . ఓ రాజా భవిష్యత్ సంఘటనలు దర్శింపగల సనత్కుమార మహర్షి మీకు పుత్ర ప్రాప్తిని గురించి ఋషుల సమక్షమున ఈ కధను తెలిపాడు . కశ్వప మహర్షి పుత్రుడు విభాండకుడు అతనికి రుశ్యశృంగుడు అను కుమారుడు కలిగి ఖ్యాతికెక్కేను . ఆ రుశ్యశృంగ మహర్షి నిరంతరము తండ్రి అయిన విభాండకుని అనుసరించి ,వనములలోనే సంచరించుట వలన ఆయనకు ఆ వనములు ,అచటి కి వచ్చి వెళ్ళు ఋషులు తప్ప మఱియొక ప్రపంచమే తెలియదు . ఓ రాజా !ధర్మ శాస్తజ్ఞులు చే తెలుపబడి ,లోక ప్రసిద్దమైన బ్రహ్మచర్యము రెండు విధములు రుశ్యశృంగుడు ఈ రెండు విధములైన బ్రహ్మచర్యమును అనుసరించగలడు . అగ్ని కార్యములను ఒనర్చుచు ప్రసిద్దుడైన తండ్రిని ,గురువులను సేవించుచు మొదటి బ్రహ్మచర్యము పాటించుచు కొంత కాలము గడిపెను . 
ఈ కాలము నందు పరాక్రమమ వంతుడు ,మహా బలశాలి అయిన రోమపాదుడు అంగ రాజ్యమునకు ప్రభువు . ఆ రాజు ఒకప్పుడు  ధర్మమును తప్పినందువల్ల ఆ రాజ్యమంతట చాలా కాలము అనావృష్టి ఏర్పడెను . తీవ్రమైన ఆ క్షామ పరిస్థితులకు రాజు మిక్కిలి భాద పడుతూ వేద శాస్త్ర పండితులైన బ్రాహ్మణులను పిలిచి ఇట్లు పలికెను . "మీరందరూ సమస్త ధర్మములు తెలిసినవారు . లోక వృత్తాంతము తెలిసినవారు . ఈ అనావృష్టికి కారణమైన నా పాపములు తొలగుటకై తగిన ప్రాయశ్చిత్తములను ,వాటి నియమములను దయతో తెలపండి "వేద పండితులు అయిన బ్రాహ్మణులు ఆ బ్రాహ్మణులు ఇలా చెప్పెను . "ఓ రాజా విభండక సుతుడు అయిన రుశ్యశృంగ మహర్షి ఏ విదముగా అయినా ఇక్కడికి రప్పించండి . రుశ్యశృంగుని పిలిపించి బాగుగా సత్కరించి మీ కుమార్త అయిన శాంత ను ఇచ్చి వివాహము చేయండి "అప్పుడు రాజు బ్రహ్మచర్య వరత నిష్ఠ లో ఉన్న ఆ మహర్షిని ఇక్కడకు రప్పించుట ఎలా ?అని ఆలోచనలో పడెను . అప్పుడు రాజు మంత్రులతో ఆలోచించి రుశ్యశృంగుని తీసుకు వచ్చుటకు బ్రాహ్మణులను పంపుటే సరి అని భావించి పురోహితుని,మంత్రులను సత్కరించి పంపుటకు నిశ్చయించుకొనెను . 
వారు రాజు మాటలకు కలవరపడి ,వినమ్రులై "రాజా విభాండక మహర్షి అంటే మాకు భయము కావున మేము అక్కడికి వెళ్ళలేము కాని రుశ్యశృంగుని రప్పించు ఉపాయము చెప్పెదము "అని రాజుకు నచ్చచేప్పెను . వారు ఆయనను తీసుకురావడానికి రాజుతో వుపాయమును  చెప్పెను . అప్పుడు అంగ రాజైన రోమపాదుడు గణికల (వేశ్యల )ద్వారా రుశ్యశృంగుని రప్పించెను . ఆయన రాకతో వర్షములు కురిసి అనావృష్టి తొలగెను . అనంతరము రాజు తన కుమార్తె అయిన శాంతను ఇచ్చి వివాహము జరిపించెను . రుశ్యశృంగుడు మీకు కుడా అల్లుడే ఆ పుణ్యాత్ముని రాకతో మీకు పుత్రులు కలుగుతారు . సనత్కుమారుడు మీకు తెలిపిన వృత్తాంతము అంతా మీకు గుర్తుచేసితిని . "దానికి దశరదుడు సంతోషించి "రోమపాదుడు రుశ్యశృంగుని అంగ దేశమునకు రప్పించిన విధము వివరింపుము . "అని సుమంత్రుడు తో  పలికెను . 

రామాయణము బాల కాండ తొమ్మిదవ సర్గ సమాప్తము 



                         శశి ,

ఎం . ఎ (తెలుగు ),తెలుగు పండితులు . 














No comments:

Post a Comment