Wednesday 15 June 2016

రామాయణము బాల కాండ -పదునొకండ సర్గ

                       రామాయణము 

                       బాల కాండ -పదునొకండ సర్గ 

ఓ రాజేంద్ర !ఆ సనత్కుమార మహర్షి ఇంకా ఇలా చెప్పెను . అది మీకు మంచి చేయునది దానిని చెబుతాను విను . 
ఇక్ష్వాకు రాజ వంశమున దశరదుడు అను పేరు కల ఒక మహా పురుషుడు జన్మిస్తాడు . అతడు ధార్మికుడై సర్వ శుభ లక్షణములతో సత్య సంధుడిగా ప్రసిద్ది గాంచును . అంగ రాజైన ధర్మ రధునితో అతనికి మైత్రి ఏర్పడును . దశరదుడికి శాంత అను కూతురు కలదు . అంగ రాజైన ధర్మరధుని కుమారుడు చిత్రరధుడు రోమపాదుడిగా ప్రసిద్దికెక్కును .  ఆయనకు దశరదుడి  కూతురును పెంచుకొనుటకు ఇచ్చును . ఆ రోమపాదుడి వద్దకు సుప్రసిద్దుడైన దశరద మహారాజు వెళ్ళును . పిమ్మట అతడు "ఓ ధర్మాత్ముడా !నాకు పుత్రా సంతానము లేదు . నాకు సంతాన ప్రాప్తికి ,వంశాభివ్రుద్దికి శాంత భర్త అయిన రుశ్యశృంగుడు మీ అనుమతి అయినచో నా కొరకు యజ్ఞము చేయును . "అని రోమపాదుని తో పలికెను . దశరద మహారాజు మాటలు విని రోమపాదుడు మనసులో తర్కించుకుని రుశ్యశృంగుని ఆయనతో పంపెను . దశరదుడు మనస్తాపము తీరినవాడై ఆ బ్రాహ్మనోత్తముని వెంట పెట్టుకుని వచ్చి మనస్పూర్తిగా యజ్ఞము చేసెను . ఆయనకు అమిత పరాక్రమశాలులు అయిన నలుగురు కుమారులు కలుగును . వారు వంశ ప్రతిష్టను ఇనుమడింప చేయుదురు . అన్ని లోకములనందు ఖ్యాతి వహించుదురు "అని సనత్కుమార మహర్షి పూర్వ కాలమున కృత యుగమున ఈ కధను తెలిపెను . 
ఓ నరోత్తమా మహారాజా !పుత్రార్దివైన నీవు పురోహితుల ద్వారా కాక స్వయముగా పరివారములతో వెళ్లి పుజ్యార్హుడైన ఆ రుశ్యశృంగ మహర్షిని సాదరముగా తీసుకురండు . సుమంత్రుడి మాటలు విని వశిష్టుని అనుమతి తీసుకొని ,దశరద మహారాజు రాణులతో ,మంత్రులతో కూడి రుశ్యశృంగుడు ఉన్న రోమపాదుని నగరముకు బయలుదేరెను . వన దృశ్యములను ,నదీ తీరములను దర్శించుచు క్రమముగా ఆ రాజు మునిపుంగవుడు ఉన్న ప్రదేశముకు చేరెను . రోమపాదుని నగరముకు చేరిన దశరదుడు ద్విజోత్తముడు ,విభాండకుడి కుమారుడు అయిన రుశ్యశృంగుని ,రోమపాదుని సమీపముగా వుండగా చూసేను . అప్పుడు రోమపాదుడు దశరద మహారాజుతో తనకు గల మైత్రిని పురస్కరించుకుని సముచితముగా ఆయనకు విశేష పూజలు గావించెను . ధీశాలి అయిన రుశ్యశృంగునికి రోమపాదుడు తనకు ,దశరదుడికి గల మైత్రిని తెలుపగా ,అప్పుడు రుశ్యశృంగుడు దశరదుడికి నమస్కరించెను . ఇట్లు సత్కారములు పొందిన దశరద మహారాజు అక్కడ ఏడెనిమిది దినములు ఉండి రోమపాదుడి తో ఇలా అనెను . 

"ఓ మహారాజా !నీ కూతురు అయిన శాంతను ,అల్లుడు రుశ్యశృంగుని నా నగరమునకు పంపు అక్కడ ఒక మహా యజ్ఞము చేయ సంకల్పించాను" . అని దశరదమహారాజు కోరగా రోమపాదుడు అంగీకరించి రుశ్యశృంగునితో ఈయనతో కలసి అయోధ్యకు వెళ్ళు అని చెప్పెను . ఆయన సరే అని చెప్పి భార్య తో సహా అయోధ్యకు బయలుదేరెను . దశరదుడు రోమపాదుని వద్ద సెలవు తీసుకుని అయోధ్యకు బయలుదేరెను . వేగముగా వెళ్ళు దూతలుచే తమ ఆగమన వార్తను పుర జనులకు సందేశము పంపెను . "నగరమునందు అంతటా పూలదండలతో ,అరటి స్తంభములతో ,ఆలంకరిమ్పుము . కస్తూరి కల్లాపితో సుగంధ దూప పరిమలములతో వీధులను గుభాలింప చేయండి . పతాకములను ఎగురవేయండి . " అని సందేశము పంపెను . పౌరులు రాజుగారి శుభాగమన ఆర్త విని మిక్కిలి సంతోషించిరి . రాజుగారి సందేశము ప్రకారము పూర్తిగా నగరమును అలంకరించెను . పిమ్మట దశరదుడు శంఖ దుందుభుల ద్వనుల మద్య విప్రోత్తముడైన రుశ్యశృంగుని ముందు ఉంచుకుని ,బాగా అలంకరింప బడిన నగరములో ప్రవేశించెను . దశరదుడు ఆయనను తన అంతః పురమునకు తీసుకొచ్చి శాస్త్రోక్తముగా పూజించెను . ఆయన రాకతో క్రుతార్దుడైనట్లు తలచెను . భర్తతో కూడి అంతః పురానికి విచ్చేసిన శాంతను చూసి అంతః పుర కాంతలు ఎంతో సంతోష పడిరి . ఆమె, ఆమె భర్త అక్కడ కొంత కాలము వుండిరి . 




రామాయణము బాల కాండ ఏకాదశ సర్గ సమాప్తము 


                   శశి ,

ఎం . ఎ (తెలుగు ),తెలుగు పండితులు . 








No comments:

Post a Comment