Sunday 12 June 2016

రామాయణము బాల కాండ -ఎనిమిదవ సర్గ

                రామాయణము 

               బాల కాండ -ఎనిమిదవ సర్గ 

ఇంతటి ప్రతిభాశాలి ,ధర్మజ్ఞుడు ,మహాత్ముడు ,అయిన ఆ దశరదుడికి వంశోద్దారాకుడైన పుత్రుడు లేకుండుటచే అతడు సంతానము కొఱకై పరితపించుచు ఉండెను . ఈ విధముగా చింతించుచు ఉన్న ఆ మహారాజుకి "సంతాన ప్రాప్తికి అశ్వమేధ యాగము చేయుట యుక్తముకదా "!అని తోచెను . ప్రజ్ఞాశాలి ,ధార్మికుడు ,అయిన ఆ మహారాజు మిక్కిలి బుద్ది కుశలురు అయిన మంత్రులందరితో కుడా సమాలోచన చేసి యాగము చేయుటే తగును అని నిశ్చయమునకు వచ్చెను . అంతట దశరదుడు గురువులు అందరిని తీసుకు రమ్మని మంత్రులకు ఆదేశించెను . పిమ్మట సుమంత్రుడు తక్షణమే త్వరత్వర గా వెళ్లి వేద పారంగతులు అయిన సుయజ్ఞుని ,వామ దేవుని ,జాబాలిని ,కాశ్యపుని ,పురోహిత ముఖ్యుడు అయిన వశిష్టుని అట్లే ఇతర బ్రాహ్మనోత్తములను రాజ భవనమునకు తీసుకుని వచ్చెను . దార్మికోత్తముడు అయిన దశరద మహారాజు అచటికి విచ్చేసిన వశిష్టాది బ్రాహ్మనోత్తములు అందరినీ పూజించి ధర్మార్ధ సహితములు అయిన వచనములను మధురముగా ఇట్లు పలికెను "పుత్రులు లేనందున తపన పడుచున్న నాకు మనశ్శాంతి కరువైనది . అందుకు అశ్వమేధ యాగము చేయాలని నా సంకల్పము అందువలన విధి విదానముగా యజ్ఞ దీక్షను తీసుకోన దలచితిని . నేను కోరుకోనుచున్న ఈ అశ్వమేధ యాగము నిర్విఘ్నముగా  కొనసాగు వుపాయమును ఆలోచించండి ". 
వశిష్టుడు మొదలగు బ్రాహ్మనోత్తములు అందరూ రాజు గారి నోట వచ్చిన పలుకులకు బాగు బాగు అనుచూ మిక్కిలి సంతోషించిరి . వారందరూ పరమ ప్రీతులై దశరదునితో ఇట్లు అనిరి . "యజ్ఞమునకు అవసరమైన వస్తువులను అన్నింటినీ తెప్పించండి . యజ్ఞాశ్వమును విడవండి . ఓ రాజా పుత్రా సంతానము కొరకై మీకు కలిగిన ఈ ధర్మ సంకల్పము ఉత్తమమైనది . కావున మీరు ఆశించిన విధముగా పుత్రులను పొందగలరు ". దశరదుడు ఆ ద్విజోత్తముల అమృత వాక్కులను విని మిక్కిలి ప్రీతిచెందేను . పిమ్మట ఆ రాజు ఆనందాశ్రువులను రాలుస్తూ అమాత్యులతో ఇట్లు అనెను . "మా గురువులు ఆదేశించిన విధముగా యజ్ఞమునకు కావలిసిన వస్తువులను సమకూర్చండి . ఆధ్వర్యుడు మొదలగు ఋత్వికులు వెంట నడుచు చుండగా సమర్ధులైన యోదులచే రక్షింపబడు యజ్ఞాశ్వమును విడిచిపెట్టండి . సరయు నదికి ఉత్తర తీరమున యజ్ఞ భూమిని సిద్ధ పరచండి . విఘ్న నివారకములు అయిన శాంతి కార్యములను క్రమముగాశాస్త్రోక్తముగా  చేయండి . ఈ అశ్వమేధ మహా యజ్ఞమును ఆచరించుట లో కష్టములు కాని అపచారములు కాని సంభవించు అవకాశమే లేకుంటే సామాన్యులు అయిన రాజులు అందరూ ఈ యజ్ఞమును చేసేవారు . విద్వాంసులు అయిన బ్రహ్మ రాక్షసులు యజ్ఞ కార్యము నందలి దోషములను వెతుకుతారు . వారు యజ్ఞములను బంగపరుచుటకు ప్రయత్నిస్తారు . యజ్ఞము పాడయినచో కర్త వెంటనే నశిస్తాడు . నేను సంకల్పించిన ఈ అశ్వమేధ యాగము ఎట్టి  లోపములు లేకుండా యధావిధిగా పరిసమాప్తి అయ్యేలా చూడండి . మీరు కార్య నిర్వహణ దక్షులు కదా ". 
ఆ మంత్రులు అందరూ మహారాజు ఆజ్ఞలు విని ఆయనను పొగుడుతూ ప్రభువులు ఆదేశించినట్లే చేస్తాము అని చెప్పారు . ధర్మజ్ఞులు అయిన ఆ బ్రాహ్మణులు అందరూ రాజును ఆశీర్వదించి ఆయన ఆజ్ఞను తీసుకొని తమతమ నివాసములకు వెళ్ళిరి . బ్రాహ్మనోత్తములను పంపిన తర్వాతా మహారాజు "ఋత్విజులు ఆదేశించిన విధముగా యజ్ఞ ద్రవ్యములను సిద్దపరుచుడు "అని సచివులతో పలికెను . మహారాజు ఈ విధముగా పలికి అక్కడ ఉన్న మంత్రులను పంపివేసి సంతోషముతో తన మందిరమున ప్రవేశించెను . పిమ్మట ఆ మహారాజు తన ప్రియ పత్నులు అయిన కౌసల్యా మొదలగు వారి వద్దకు వెళ్లి "పుత్రా ప్రాప్తికై యజ్ఞమును చేయదలచితిని మీరు కూడా దీక్ష తీసుకోండి "అని పలికెను  . మిక్కిలి సంతోషకరములు అయిన ఆ పలుకులకు సుందరీమణులు అయిన ఆ రాణుల ముఖ పద్మములు మంచు తొలగిన పిమ్మట వికశించు కమలములు వలె ప్రకాశించెను . 

రామాయణము బాల కాండ ఎనిమిదవ సర్గ సమాప్తము 


         శశి ,

ఎం . ఎ (తెలుగు ),తెలుగు పండితులు . 










No comments:

Post a Comment