Saturday 18 June 2016

రామాయణము బాల కాండ -పదమూడవ సర్గ

                           రామాయణము 

                            బాల కాండ -పదమూడవ సర్గ 

యజ్ఞాశ్వమును వదిలిన ఒక సంవత్సరము తర్వాత మరల వసంత ఋతువు ప్రారంభమయ్యెను . అంతవరకూ యజ్ఞమునకు ముందు నిర్వహింపవలసిన విధులన్నీ దశరదుడు పూర్తి చేసెను . పిదప కార్యదక్షుడైన ఆ మహారాజు సంతానార్ధము యజ్ఞము చేయుటకై యాగశాలలో ప్రవేశించెను . ఆ రాజు వశిష్ట మహర్షికి నమస్కారము చేసి ,విధివిధానముగా ఆయనకు పూజలు చేసెను . పిమ్మట ఆ విప్రోత్తమునితో సవినయనము గా ఇట్లు పలికెను . "ఓ మహర్షీ !మాకు సంతానమును ప్రసాదించునట్టి యజ్ఞమును విద్యుక్తముగా నిర్వహింపచేయండి . రాక్షసులచే విఘ్నములు కలుగకుండా ఎట్టి  లోపమూలేకుండా చూడండి . పూజ్యులైన మీరు మాకు ఆప్తమిత్రులు ,శ్రేయోభిలాషులు ,ఋషి సత్తములు ,అంతే కాదు పరమ గురువులు . కావున ఈ యజ్ఞ నిర్వహణ భారము అంతా మీదే . "
అంతట ఆ వశిష్ట మహాముని మహారాజుతో "అట్లే మీరు కోరిన రీతిగానే యజ్ఞ కార్యములన్నింటిని నిర్వహించెదను "అని చెప్పెను . అప్పుడు వశిష్టుడు యజ్ఞ కర్మలయందు రాజుచే నియక్తులైన బ్రాహ్మనోత్తములను వాస్తు శాస్తమునందు సమర్ధులైన వారిని దార్మికోత్తములైన పెద్దలను ,యజ్ఞ పరిసమాప్తి వరకు కార్య నిర్వహణలో నిమగ్నులైన ,ఇటుకలు మున్నగున్నవి సిద్దపరుచువారిని స్రుక్ సృవాది -ఉపకరణములు (యాగములో నేతిని వేయుటకు వుపయోగించునవి )చేయు వడ్రంగులను భావులను తవ్వువారిని ,లేఖకులను ,శిల్పులను ,చిత్రకారులను ,రసభావములను చక్కగా అభినయించు నటులను ,నర్తకులను ,సచ్చరిత్ర గల శాస్తాజ్ఞులను ,శాస్త్రములలోను అనుభవము నందు ఆరితేరిన వారిని పిలిపించి వారితో ఇట్లు అనెను ""మీరందరూ రాజాజ్ఞను శిరసావహించి యజ్ఞ కార్యములలో నిమగ్నులు అవ్వండి వేలకొలది ఇటుకలను వెంటనే తెప్పించండి . యజ్ఞము చూచుటకు వచ్చిన రాజులకు మిక్కిలి ఎత్తయిన విశాలమైన భవనములు నిర్మించండి . బ్రాహ్మణుల కై వందలకొలది చక్కని గృహములను ఏర్పరచండి . అవి గాలులకు ,వానలకు తట్టుకొనునట్లు ధృడముగా వుండాలి . అందు వివిధములైన భక్ష్యాన్నపానములను సమకూర్చండి . 
అట్లే పుర జనులకు ,జానపదులకు నివాస యోగ్యమైన గృహములను నిర్మించి ,అనేక విధములైన తినుబండారాలను ,సర్వ సౌఖ్యములను విస్తారముగా సమకూర్చవలెను . ఎ మాత్రమూ అనాదరమును చూపక మర్యాదగా వారికి భోజన సత్కారములు చేయవలెను . అన్ని వర్ణముల వారికి తగిన విధముగా ఆదర సత్కారములను చేయండి . కామ ,క్రొధములకు లోనై ఎవ్వరిని చిన్నబుచ్చరాదు . యజ్ఞమునకు సంబందించిన పనులలో నిరతులైన శిల్పులను తదితరులను వయస్సును ,అర్హతను పాటించుచు గౌరవించవలెను  . వారినందరినీ ధనముతో ,ముష్టాన్న భోజనములతో సంతృప్తి పరచండి . అన్ని కార్యములను చక్కగా ఆచరించండి . ఎ విషయము నందు ఎట్టి లోపము రారాదు . మరో మాట ఈ పనులన్నీ మీరందరూ నిండు మనస్సుతో ప్రేమతో ఆచరించండి ". 
వారందరూ కలసి ముక్త కంటముతో వశిష్టుడి తో ఇట్లు పలికిరి "అట్లే మీ ఆజ్ఞలను ఎ లోపమూ వాటిల్లకుండా పాటిస్తాము" . పిమ్మట వశిష్ట మహర్షి సుమంత్రుని పిలిపించి ఇట్లు పలికెను "ఈ భూమండలమున కల ధార్మికులైన రాజులను ,పెద్ద సంఖ్యలో బ్రాహ్మణులను ,క్షత్రియులను వైశ్యులను ,శూద్రులను ఆహ్వానించుము . అన్ని దేశముల నుండియు జనులను సాదరముగా ఆహ్వానించుము . మిదిలాదిపతి అయిన జనక మహారాజు శూరుడు ,సత్యసంధనుడు ,సర్వ శాస్త్రముల నందు ,వేదాలలో నిష్ణాతుడు మహాపురుషుడు కావున ఆయనను స్వయముగా వెళ్లి ఆహ్వానించుము ,అట్లే సంతతము మధురభాషియు ,రాజుగారికి ఆప్త మిత్రుడు అయిన కాశీ రాజును స్వయముగా పిలువుము . పరమ ధార్మికుడు ,పెద్దవాడు రాజుగారికి మామ అయిన కేకేయ రాజును, ఆయన కుమారుడిని స్వయముగా ఆహ్వానించుము . అంగ దేశాధిపతి ,సత్పురుషుడు ,పూజ్యుడు ,గొప్ప కీర్తి ప్రతిష్టలు కలవాడు ,దశరదునికి మిత్రుడు అయిన రోమపాదుని స్వయముగా ఆహ్వానించుము . ప్రాచీనులైన సింధు ,సౌవీర ,సౌరాష్ట్ర దేశాదిపతులను ,దక్షిణ దేశముల ప్రభువులను అందరిని దూతల ద్వారా ఆహ్వానించుము . ఇంకను ఈ భూమండలమున దశరదునికి మిత్రులైన రాజులను అందరికి పరివారముతో భందువులతో కూడి వచ్చునట్లు వీలయినంత త్వరగా ఆహ్వానించుము "
బుద్ధిశాలి అయిన సుమంత్రుడు వశిష్ట మహర్షి ఆదేశము ప్రకారము పేర్కొనిన మహీపాలురందరినీ ఆయన సూచన మేరకు స్వయముగా తీసుకు వచ్చుటకై వెంటనే బయలుదేరెను . యజ్ఞమునకు సంబందించిన పనులు నిర్వహించే వారందరూ అప్పటి వరకు తాము చేసిన పనులన్నీ భుద్దిశాలి అయిన వశిష్టునికి నివేదించెను . అందుకు ఆ విప్రోత్తముడు సంతుష్టుడై వారందరితో ఇలా పలికెను "ఎవ్వరికైనా ఏదైనా ఇచ్చునపుడు అనాదరము చూపరాదు . పరిహాసము చేయరాదు . చులకన భావముతో చేసిన దానము వలన దాతకు హాని కలుగుతుంది . " అప్పుడు  కొన్ని దినముల తర్వాత రాజులందరూ శ్రేష్టములైన రత్నములను ,మణులను ముత్యములను ,పగడములను ,అమూల్యమైన వస్త్రాభారణములను ,చందనాది పరిమళ ద్రవ్యములను దశరద మహారాజుకి కానుకగా ఇవ్వడానికి తీసుకొచ్చారు . వశిష్టుడు రాజుల రాకకు సంతుష్టుడై దశరదునితో ఇలా అనెను "ఓ మహారాజా మీ ఆహ్వానము అనుసరించి ,రాజులందరూ విచ్చేసిరి . ఆ మహారాజులందరికీ తగిన రీతిలో అతిధి సత్కారములు జరిపితిని . నియుక్తులైన కార్యకర్తలు అందరూ యజ్ఞమునకు అవసరమైన వస్తువులను సమకూర్చిరి . తీసుకురాబడిన ఆ వస్తువులన్నీ తగిన ప్రదేశములలో ఉంచబడినవి . ఈ సమీపమునే ఉన్న ఈ శాలకు యజ్ఞము చేయుటకు విచ్చేయండి . సంకల్ప మాత్రమునే అతి శీఘ్రముగా నిర్మింపబడిన ఈ శాలను చూడండి . "
రుశ్యశృంగుడు ,వశిష్టుల ఆదేశము ప్రకారము మంగళకరమైన తిది ,వారము నక్షత్రములతో కూడిన సుముహూర్తమున దశరద మహారాజు శంఖ దుందుభి ,మృదంగాది ,మంగళ వాయిద్యములు మ్రోగుచుండగా వేద పండితుల స్వస్తి వచనములతో రాజ భవనము నుండి యజ్ఞ శాలకు బయలుదేరెను . అంతట వశిష్టుడు మొదలైన బ్రాహ్మనోత్తములందరును రుశ్యశృంగుని  ముందుంచుకుని ,యజ్ఞ వాటికకు చేరిరి . పిమ్మట దశరదుడు ,ఋత్విజులు మొదలైన వారందరూ శాస్త్రోక్తముగా యధాప్రకారము యజ్ఞ కర్మలను ఆచరించిరి . సకలైశ్వర్య సంపన్నుడైన దశరద మహారాజు ధర్మ పత్నులతో కూడి యజ్ఞ వాటికలో ప్రవేశించెను . పిమ్మట అతడు శాస్త ప్రకారము విధివిధానముగా  యజ్ఞ యజ్ఞ దీక్షను స్వీకరించెను . 


రామాయణము బాలకాండ  పదమూడవ సర్గ సమాప్తము . 


                       శశి ,

ఎం . ఎ (తెలుగు ),తెలుగు పండితులు . 











 

No comments:

Post a Comment