Tuesday 26 May 2020

రామాయణము ఉత్తరకాండ - నలుబదిరెండవసర్గ

                                         రామాయణము 

                                           ఉత్తరకాండ - నలుబదిరెండవసర్గ 

ధర్మజ్ఞుడైన  రామచంద్ర ప్రభువు నిత్యము రాజధర్మ కార్యములను  ధర్మమార్గమున ఓనర్చుచుండెడివాడు . సీతాదేవికూడా దేవకార్యములను చేయుచూ అత్తలందరికీ  సంతోషకరంగా విశిష్టారీతిలో సేవలు చేసెడిది . ఆ విధముగా సీతారాములు ఇరువురు రాజార్హమైన వివిధ భోగములను అనుభవించుచూ  పదివేల సంవత్సరములు  గడిపిరి . పిమ్మట ఒకరోజు శ్రీ రాముడు సీతాదేవితో " వైదేహీ ! నీలో గర్భవతి  చిహ్నములు కనిపించుచున్నవి . నీకోరిక ఏమి అని అడిగెను . అప్పుడు సీతాదేవి చిరునవ్వులు నవ్వుతూ " రఘువీరా ! పవిత్రములైన తపోవనములను దర్శించుటకు ఋషీశ్వరులయొక్క  పాదములను  సేవించుటకు  వేడుకపడుచున్నాను . ఆ మునుల యొక్క తపోవనములయందు నివసింప దలుచుచున్నాను . ఇదే నా ప్రబలమైన కోరిక . అప్పుడు శ్రీ రాముడు " నీవు రేపే తపోవనములకు వెళ్లగలవు " అని సీతాదేవికి  మాట ఇచ్చెను . 

రామాయణము ఉత్తరకాండ నలుబదిరెండవసర్గ సమాప్తము . 

శశి,

ఎం.ఏ,ఎం.ఏ (తెలుగు), తెలుగు పండితులు . 









రామాయణము ఉత్తరకాండ - నలుబదిఒకటవసర్గ

                                         రామాయణము 

                                         ఉత్తరకాండ - నలుబదిఒకటవసర్గ 

ఒక నాడు శ్రీ రామునికి ఆకాశమునుండి  మదురవచనములు " శ్రీ రామచంద్రప్రభూ ! నాపేరు  పుష్పకము ఇదివరలో  నీ ఆజ్ఞను  అనుసరించి కుభేరుడిని సేవించుటకై ఆయనవద్దకు వెళ్లితిని . ఆయన నిన్నే సేవింపమని ఆజ్ఞాపించెను . అందులకె  నేను ఇచటికి వచ్చితిని " అని పలికెను .అప్పుడు శ్రీ రాముడు " విమానములలో శ్రేష్టమైన పుష్పకమా నీకు స్వాగతము . నీవు కుబేరుని అనుమతితో వచ్చితివి  కావున నేను నిన్ను సవీకరించుట  దోషముకాదు " అని పలికి ఆ పుష్పక విమానము పరిమళభరితమైన ధూపదీపములతో పూజించెను . పిమ్మట శ్రీ రాముడు ఆ పుష్పకవిమానముతో " పుష్పకమా నేను తలుచుకున్నవెంటనే  నీవు ఇక్కడికి విచ్చేయుము .  అప్పటివరకు నీవు నీకు నచ్చిన చోట ఉండవచ్చును . " అని పలికెను . 

రామాయణము ఉత్తరకాండ  నలుబదిఒకటవసర్గ సమాప్తము . 

శశి,

ఎం.ఏ ఎం.ఏ (తెలుగు ), తెలుగుపండితులు . 

రామాయణము ఉత్తరకాండ -నలుబదియవసర్గ

                                        రామాయణము 

                                            ఉత్తరకాండ -నలుబదియవసర్గ 

పిమ్మట శ్రీ రాముడు సుగ్రీవునికి  అనేక జాగ్రత్త చెప్పి పదేపదే ఆయన్ని అక్కునచేర్చుకొనుచూ సుగ్రీవుడు వెళ్లుటకు అనుమతి ఇచ్చెను . పిమ్మట శ్రీ రాముడు  విభీషణుడితో మధురముగా మాట్లాడుతూ  ఆయనకు కూడా తిరిగి  వెళ్ళుటకు అనుమతి ఇచ్చెను . పిమ్మట హనుమంతుడు శ్రీ రాముడితో " మహారాజా! నీయందు నాకు గల అనన్యభక్తి విస్వాసము ఏమాత్రము సడలికుండునట్లు నన్ను అనుగ్రహింపుము " అని పలికెను . అప్పుడు శ్రీ రాముడు " కపివరా ! నీవు కోరుకున్నట్లే  జరుగును . మారుతి నీవు నాకు అనేక ఉపకారములు చేసినావు . నా ప్రాణములను ధారపోసిన  వాటిలో ఏఒక్క  ఉపకారము తీరదు " అని పలికి వైడూర్యమణులతో మిరుమిట్లు గొలిపే హారమును  తన కంఠమునుండి తీసి హనుమంతుని మేడలో వేసెను . పిమ్మట వానరులందరూ శ్రీ రామునికి  శిరసా ప్రణమిల్లి  కంట తడిపెడుతూ తమతమ నివాసములకు మరలి వెళ్లేను . 

రామాయణము ఉత్తరకాండ నలుబదియవసర్గ సమాప్తము . 

శశి,

ఎం.ఏ,ఎం.ఏ (తెలుగు), తెలుగుపండితులు . 









రామాయణము ఉత్తరకాండ -ముప్పదితొమ్మిదవసర్గ

                                    రామాయణము 

                                   ఉత్తరకాండ -ముప్పదితొమ్మిదవసర్గ  

శ్రీరాముని వీడ్కొని వెళ్లిన పిమ్మట ,రాజులందరూ రామునికి అనేకమైన అమూల్యమైన కానుకలు పంపిరి . భర్తలక్ష్మణులు ఆ కానుకలను స్వీకరించి అయోధ్యానగరమునకు తిరిగి వచ్చిరి . వారు ఆ బహుమతులన్నిటినీ శ్రీరాముడికి సమర్పించెను . శ్రీరాముడు వాటన్నిటిని సంతృప్తిగా గ్రహించి ,సుగ్రీవునికి ,వానరవీరులకు వాటిని సమర్పించెను . పిమ్మట శ్రీరాముడు అంగదుని తన వొడిలో కూర్చోండపెట్టుకుని ,సుగ్రీవునితో సుగ్రీవా! ఇక ఈ అంగదుకూడా  నీ కుమారుడే మారుతి నీకు ఆంతరంగికుడైన మంత్రి నీకువలె  వీరిరువురు నాకు కూడా పూజార్హులే " అని పలికి తన  మెడలోపల  అమూల్యమైన ఆభరణమును తీసి అంగదుడికి హనుమంతునికి తానే స్వయముగా  అలంకరించెను . పిమ్మట  శ్రీ రాముడు మిగిలిన వానర వీరులతో " కపివీరులారా ! మీరందరూ నాకు పరామమిత్రులు . ఆత్మీయులైన సోదరులు మీరందరు కష్టసమయములో నన్ను ఆదుకొంటిరి మీ వంటి ఆత్మీయులను పొందిన సుగ్రీవుడు ధన్యుడు . అనిపలికి  వారందరికీ కూడా బహుమతులు ఇచ్చి  గురవించెను . తదుపరి ఆ వానరులు ఆ రాజ్యములోకల మధువులను సేవించుచూ మహారాజుల స్థాయికి  అనుగుణమైన ఆహారపదార్ధములను , రుచికరమైన  ఫలమూలములను కడుపారా ఆరగించుచూ అచట నివసింపసాగిరి . ఇట్లువారు  ఒక సంవత్సరకాలం అక్కడే  గడిపిరి ఆ వనరులందరికి  అక్కడ  గడిపినకాలము  అంతా ఒక క్షణముగా తోచెను . 

రామాయణము ఉత్తరకాండ ముప్పదితొమ్మిదవసర్గ  సమాప్తము . 

శశి,

ఎం.ఏ,ఎం.ఏ(తెలుగు), తెలుగుపండితులు . 


















రామాయణము ఉత్తరకాండ -ముప్పదియెనిమిదవసర్గ

                                      రామాయణము 

                                       ఉత్తరకాండ -ముప్పదియెనిమిదవసర్గ 

మహాబాహువైన  రఘురాముడు ఇదేవిధముగా సభలో ఆసీనులై అందరిచే గౌరవింపబడుతూ పురజనులయొక్క జానపదులయొక్క,కార్యములను అన్నిటిని  పర్యవేక్షించుచూ  రాజ్యపాలన చేయుచుండెను . కొన్ని దినముల పిమ్మట తిరుగుప్రయామమునకు  సిద్దమైన  జనకమహారాజుతో శ్రీ రాముడు " మహారాజా ! అన్నివిధములుగా  నీవే మాకు పెద్దదిక్కు నీ సహాయ సహకారములతో అండదండలతో మేము ప్రశాంతముగా ఉంటిమి . మేము సమర్పించే రత్నాభరణాదికములు దయతో స్వీకరింపుము . నీ ప్రయాణమునందు భారతసత్ర్యజ్ఞులు వెంటవుంది తోడ్పడుదురు  " అని పలికెను . అప్పుడు జనకమహారాజు అందుకు సమ్మతించి శ్రీ రామునితో " అయోధ్యాపతీ! అపురూపమైన మీ దర్శనమునకు , వినయస్వభావములకును , నేను ఎంతో ముగ్దుడనైతిని . రాజా! నీవు మాకు బహూకరించే రత్నాధికములు అన్నింటిని హృదయపూర్వకముగా స్వీకరించెదను . ఆ సకల బహుమతులను మా అమ్మాయి సీతకు ఇచ్చివేయుచున్నాను ." అని పలికి అందరిని వీడ్కొని మిథిలకు  బయలుదేరెను . 
పిమ్మట శ్రీ రాముడు  ప్రయాణమునకు సిద్ధమైయున్న  భరతుని మేనమామ యగు యధాజిత్తు తో " రాజా! నరోత్తమా! నీవుమాకు ఆత్మీయబంధుడవు . మేము ప్రేమతో ఇచ్చే  సంపదలను , రత్నాభరణములను స్వీకరించుము . లక్ష్మణుడు  మీకు తోడుగా  వస్తాడు " అని పలుకగా యధాజిత్తు కూడా అట్లే అని " రఘునందనా! ఈ సంపదను , రత్నాభరములను మీ వద్దనే ఉంచుము " అని పలికి లక్ష్మణునితో కలిసి  పయనమయ్యెను . యధాజిత్తునకు వీడ్కోలు  పలికిన పిమ్మట శ్రీ రాముడు తనకుమిత్రుడైన  కాశీరాజఅయినటువంటి  ప్రతర్ధునిని అక్కున చేర్చుకొని " రాజా! నా రాజ్యాభిషేకం సమయమున నీవు భరతునితో కలిసి ఎంతో సహాయ సహకారములు అందించితివి ". అని పలికి కాశీరాజుకి వీడ్కోలు పలికాడు . పిమ్మట శ్రీ రాముడు తనకొరకై వచ్చిన మూడువందలమందిరాజులకుకూడా  వీడ్కోలు పలికెను . 

రామాయణము ఉత్తరకాండ ముప్పైఎనిమిదవసర్గ సమాప్తము . 

శశి,

ఎం.ఏ,ఎం.ఏ(తెలుగు)తెలుగుపండితులు . 









రామాయణము ఉత్తరకాండ -ముప్పదియేడవసర్గ

                                          రామాయణము 

                                           ఉత్తరకాండ -ముప్పదియేడవసర్గ 

ఆ రోజు రాత్రి గడిచిన పిమ్మట ప్రాతః కాలము అగుచుండగా శ్రీరామచంద్రప్రభువును మేలుకొలుపుటకై ,సేవాతత్పరులైన స్తుతిపాఠకులు రాజమందిరమునకు  విచ్చేసి ,మధురమైన కంఠములతో ,స్తుతిస్తూ మేలుకొలిపిరి . ఆ ప్రభువు తల్పమునుండి లేవగానే వేలకొలది సేవకులు వినయముతో అంజలిఘటించి నిలబడిరి . 
ఆ రఘువరుడు స్నానాదికములు ముగించుకుని ,అగ్నికార్యములను పూర్తిచేసుకుని దేవపూజాగృహమున ప్రవేశించెను . అక్కడ యధావిధిగా దేవతలను ఆరాధించి ,పితృదేవతలకు తర్పణములు విడిచి ,బ్రాహ్మణులను పూజించేను . పిమ్మట శ్రీరాముడు సభలోకి ప్రవేశించి సింహాసనమును అధిష్టించెను . విశిష్టాది మహాఋషులు ,జానపదములపాలకులు ,సామంతరాజులు ఇంకా ఇతర ప్రముఖులతో ఆ సభాభవనములోని ఆసనములు నిండి ఉండెను . ఆసమయములో శ్రీరాముని వైభవము ఇంద్రుని మించి ఉండెను . . పురాణజ్ఞులైన మహాత్ములు సభలో ఆసీనులైనవారికి ,ధర్మసమ్మతములైన మధురగాధలను తెలుపుచుండిరి . 

రామాయణము ఉత్తరకాండ ముప్పదియేడవసర్గ సమాప్తము . 

                     శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

రామాయణము ఉత్తరకాండ -ముప్పదిఆరవసర్గ

                                        రామాయణము 

                                         ఉత్తరకాండ -ముప్పదిఆరవసర్గ 

దేవతలను చూసిన వాయుదేవుడు  తన కుమారునితో సహా బ్రహ్మదేవునికి ప్రదక్షిణ నమస్కారము చేసి ఆయన పాదములపై వాలెను . బ్రహ్మదేవుడు  వాయుదేవుడను లేవనెత్తి , హనుమను తనచేతులతో  నిమిరేను . బ్రహ్మదేవుని  స్పర్శతగిలినంతనే  శిశువుతేరుకోని హాయిగా ఉండెను .  అదిచూసినవాయుదేవుడు తాను నిరోదించిన ప్రాణవాయువును ప్రసరింపచేసెను . అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలతో " ఈ శిశువు మున్ముందు చేయవలసిన ఘనకార్యములు పెక్కుకలవు కనుక  వాయుదేవుని తృప్తికై మీరందరు ఈ బాలునికి వరములు ఇవ్వుము " అని ఆజ్ఞాపించెను  . అప్పుడు దేవేంద్రుడు  సంతోషముతో బంగారు పద్మములు కల హారమును  బాలకుని మెడలో అలంకరించి ' ఇక మీదట నా వజ్రాయుధము వలన  ఇతనికి ఏ హాని కలుగదు . ఇకపై ఇతడు హనుమంతునిగా  ఖ్యాతివహించును ' . అని వరమిచ్చెను .
పిమ్మట సూర్యభగవానుడు " నా తేజస్సులోని నూరోవభాగమును ఇతడికి ప్రసాదించుచున్నాను . ఇతడు శాస్త్రములను అభ్యసింపదగిన వయస్సు కలవాడయినపుడు నేను ఇతనికి సకల శాస్త్రజ్ఞానమును  కలిగిస్తాను . శాస్త్రజ్ఞానములో ఇతడికి సరితూగగలవాడు ఎవ్వరు ఉండరు . " అని వరమిచ్చెను . పిమ్మట వరుణదేవుడు తన పాశమువలన కానీ జలమువలన కానీ మృత్యుభయము లేకుండునట్లు వారము ప్రసాదించెను . తదుపరి యముడు తన దండము వలన మృత్యువుకలగదని ,, ఈ బాలకుడు  ఎల్లప్పుడూ  ఆరోగ్య భాగ్యములతో ఉంటాడని  వరమిచ్చెను . అనంతరము కుభేరుడు తన గదవలన బాలాకునికి ఆపద కలుగదని పలికెను .  పిమ్మట సంఖరుడు ' నావలన కానీ నా శూల  , పాశుపతాస్త్ర ఆయుధములవలన కానీ ఇతడు వధ్యుడు కాడు " అని గొప్ప వరమును ఇచ్చెను . పిమ్మట బ్రహ్మదేవుడు తన బ్రహ్మాస్త్రముసైతము  ఇతడికి హానికలిగించలేదని ఇతడు దీర్గాయువు పండుతాడని  ఆశీర్వదించెను . పిమ్మట విశ్వకర్మ నేను నిర్మించిన దివ్యాస్త్రములలో ఏవియూ ఇతడిని వధించలేవు . ఇతడు చిరంజీవి అవుతాడు . " అని కావరము ప్రసాదించెను . 
అప్పుడు సంతుష్టుడైన బ్రహ్మదేవుడు  వాయుదేవునితో " మహాబల  నీకుమారుడైన  మారుతి శత్రువులను  గడగడా లాడించగలడు . ఇతడు తాను కోరుకున్న రూపమును పొందగలడు . ఇతడు తనఇష్టాను రీతిలో సంచరించగలడు . ఇతడు  చిర స్థిరకీర్తితో  వర్ధిల్లును ఇతఁడు చేసే సాహస కార్యములన్నియూ  రావణునివద్దకు కారణములు అగును . ఇతడు లోకములకు  సంతోషము కలిగించును . " అని పలికెను . పిమ్మట దేవతలందరు తమ తమ  స్థానములకు వెళ్లి పోయిరి . పిమ్మట ఆ వాయుదేవుడు కూడా హనుమను తీసుకుని అంజనీ దేవి వద్దకు వెళ్లి మారుతికి దేవతలు అనుగ్రహించిన  వరములు గురించి వివరించి వెళ్లిపోయెను . 
బలసామర్ధ్యములు పెరిగిన హనుమ తమ రాజ్యములోని ఋషీశ్వరుల ఆశ్రమములో ఉపద్రవమును సృష్టించసాగెను . యజ్ఞవేదికల యందలి సాధనములను భగ్నముచేయుచుండెను . అగ్నిహోత్రమును  ఆర్పివేయుచుండెను . వారి యొక్క వల్కలములను , అజినములను  చింపివేయుచుండెను . తన తల్లితండ్రులు  ఎంతగా నివారించుచుంటినప్పటికీ  మారుతి తన  చిలిపి చేష్టలను మానివేయుటలేదు . ఇతడి అల్లరిని తట్టుకోలేక భృగు అంగీరస వంశజులైన మహర్షులు మారుతి బలములను మరిచిపోవునట్లు  శపించెను . ఇతరులు ఎవ్వరైనను అతని బలపరాక్రమములను పేరుప్రతిష్టలను ప్రస్తావించినచో అతనికి తన బలములు జ్ఞప్తికి వచ్చును ఆ విధముగా  మారుతి తన శక్తీ సామర్ధ్యములను  మరచిపోయినాడు . ఆ కారణము చేతనే ఇతడు వాలి సుగ్రీవులమధ్య  వైరము ఏర్పడినపుడు  వాలిని మట్టుపెట్టలేకపోయెను . సుగ్రీవుడికి మారుతికి గల వరభలములు తెలియదు . హనుమంతుడు సూర్యునికి అభిముఖముగా ఉండి సమయోచితముగా ప్రశ్నించుచూ వ్యాకరణ  శాస్త్రమును  నేర్చుకొండెడివారు . ఇతడా శాస్త్రమును పాతించుచూ  దారణచేయుచూ ఉదయాద్రినుండి అస్త్రాద్రివరకు సూర్యభగవానుడిని అనుసరించుచుండెడివాడు . సంగీత , ఇతరశాస్త్రములయందు ఇతడు విసారధుడు అట్లే ఛందస్సాస్త్రమునందు పారాయణుడు . సమస్త  విద్యలయందు ,తపోవిధానముల యందు ఇతడు దేవతలకు గురువైన బృహస్పతివంటివాడు . నవవ్యాకరణ సిద్ధాంతములను పుక్కిట పట్టినవాడు. రామా! నీ అనుగ్రహము వలన  రాబోవు కల్పము నందు ఇతడు బ్రహ్మకాగలడు" . అగసస్త్యుడి  పలుకులు విని  రామలక్ష్మణులు వానరులు రాక్షసులు మిక్కిలి ఆశ్చర్యపడిరి . పిమ్మట అగస్త్యుడు మొదలైన మహర్షులందరు " నిన్ను చూచుట  నీతో సంభాషించుట  మా అదృష్టము . ఇక మేము వెళ్లివచ్చేదను . " అని పలికెను . అప్పుడు శ్రీ రాముడు " మహర్షి మిమ్ము దర్శించుటచే మేము కృతార్థులమైనాము . నేను యజ్ఞములను చేయదల్చితిని . మహా తపశ్శక్తి  సంపన్నులైన మీరు  సదా మాయజ్ఞములను  పర్యవేక్షించుచూ మమ్మల్ని అనుగ్రహించవలెను . నేను ఆచరింపనున్న  యజ్ఞములకు ఎల్లప్పుడూ ప్రారంభసమ్యమునందే  మీరందరు విచేయవలసినదిగా నా ప్రార్ధన " అని పలుకగా మహర్షులందరూ సంతోషముతో  తధాస్తు అనిపలికి శ్రీ రాముని వీడ్కని తమ స్థానములకు వెళ్లిరి . 
రామాయణము ఉత్తరకాండ ముప్పదిఆరవసర్గ సమాప్తము . 

శశి,

ఎం.ఏ,ఎం.ఏ(తెలుగు), తెలుగుపండితులు . 

















  

Monday 25 May 2020

రామాయణము ఉత్తరకాండ -ముప్పదిఐదవసర్గ

                                    రామాయణము 

                                      ఉత్తరకాండ -ముప్పదిఐదవసర్గ 

అప్పుడు శ్రీరామ  చంద్రుడు సవినయముగా  అంజలిఘటించి అగస్త్యమునితో " మహర్షీ ! వాలి , రావణులయొక్క  బలపరాక్రమములు అత్యద్భుతమైనవి అందుసందేహములేదు . కానీ హనుమంతుని  శక్తిసామర్ధ్యములముందు  వీరిరువురు  తీసికట్టే అని నాకు  తోచుచున్నది . శౌర్యము ,దక్షత ,బలము ,ధైర్యము ,తెలివితేటలూ ,నేర్పుగా కార్యము సాధించుట ,పరాక్రమము ,శక్తి ఇవి అన్నియు హనుమలో గూడుకట్టుకుని వున్నవి . సముద్రమును దాటుట ,సీతాన్వేషణ ,అశోకవనధ్వంసము ,రావణుని సేనాపతులని ,మంత్రి కుమారులని ,ఎనుబదివేల కింకరులను ,అక్షకుమారుని నేలపాలు కావించుట ,లంకను భస్మము చేయుట ఈ కార్యములన్నియూ అనితరసాధ్యములు . ఇతడి వలనే లక్ష్మణుడు నాకు దక్కినాడు . ఇతడి వలెనే నేను సీతను రక్షించుకోగలిగాను . మరి ఇంతటి శక్తి సామర్ధ్యములు కలిగిన మారుతి వాలిసుగ్రీవులకు విరోధము కలిగినపుడు మారుతి ఎందుకు వాలిని మట్టుపెట్టి ,సుగ్రీవునికి సహాయము చేయలేదు ?దయచేసి నాకు తెలపండి "అని పలికెను . 
అగస్త్యమహర్షి రామునితో " రఘువరా ! హనుమంతుని విషయములో  నీవు పలికిన మాటలన్నీ  యదార్థములే . వేగములో , బుద్ధికౌసల్యములో ఇతనితో సరితూగగలవాడు  మరియెవ్వరు లేరు .  రామా! పూర్వము ఈ వాయుసుతునకు  మహర్షులు శశాపమిచ్చిరి . ఆ శాప ఫలితముగానే  ఇతఁడు తన బలమును ఎరుగడు . రామా సుమేరు గిరికి ప్రభువైన కేసరి ఆయన భార్య  అంజనా దేవి హనుమతల్లితండ్రులు ఈ హనుమంతుడు వాయుదేవుడి  వర ప్రభావమున  జన్మించాడు . ఇతడు  వారిగింజ ముల్లువలె పింగళివర్ణము కలవాడు . ఇతడి చిన్న తనములో ఒకసారి  అంజనాదేవి ఫలములకై అడవులకు వెళ్లెను . ఇతడు ఆకలిబాధ తట్టుకోనలేక ఉదయించుచున్న సుర్యుడిని పండుగా భావించి భాను మండలమువైపు ఎగిరెను . శిశువుగా ఉన్న హనుమ  ఇట్లుఎగురుచుండగా  చూసిన దేవదానవులు యక్షులు మిక్కిలి ఆశ్చర్యపడిరి కొన్ని వేలయోజనముల దూరము  పయనించి సూర్యుడిని చేరెను . సర్వము తెలిసిన  సూర్యభగవానుడు అతడికి తాపము కలిగించలేదు . ఆ సమయములోనే రాహువుకూడా సూర్యుణ్ణి పట్టుకొనుటకై అక్కడికి వచ్చి మారుతి స్పర్శకు భయపడి పారిపోయెను . 
వెంటనే రాహువు ఇంద్రుడిని చేరి " ఇంద్రా ! నీవు నాకు ఇచ్చిన వరము ప్రకారము ఈరోజు  గ్రహణము కావున నేను సూర్యుడిని మింగుటకు వెళ్ళాను . కానీ అప్పటికే అక్కడ మరియొక రాహువు ఉన్నాడు " అని పలికెను . ఆ మాటలు విన్న దేవేంద్రుడు తత్తరపడెను . సింహాసనము నుండి దిగ్గున లేచి ఐరావతము ఎక్కి సర్యుడినిచేరి  అక్కడ హనుమను చేసెను . అప్పుడు హనుమ ఇంద్రుడి వెనకే వచ్చిన రాహువును చూసి అతడిని పెద్దపండుగా  భావించి  రాహువువైపుగా రాసాగేను . అదిచూసి రాహువు భయముతో ' ఇంద్రా!  ఇంద్రా!' అని పెద్దగా అరవసాగెను . అప్పుడు మారుతిని ఇంద్రుడు తన వజ్రాయుధముతో కొట్టెను . ఆ దెబ్బకు అతడు ఒక పర్వతముపై పడిపోయెను . అతని ఎడమ దవడ  దెబ్బతినెను . అది తెలిసిన వాయుదేవుడు ఇంద్రుడి యెడ మిక్కిలి కుపితుడాయెను . సకల ప్రాణులలో అంతర్గతుడైయున్న  వాయుదేవుడు తన చలనమును ఉపసంహరించుకుని హనుమను తీసుకొని ఒక గృహలోకి ప్రవేశించెను . 
వాయు ప్రకోపము వలన  స్వాస ఆడక సకల ప్రాణులు కొయ్యబారిపోయెను . అప్పుడు గంధర్వులు దేవతలు , అసురులు , మానవులు బ్రహ్మదేవుని వద్దకు పరుగులు తీసి జరిగిన విషయమును  మొరపెట్టుకొనిరి . అప్పుడు బ్రహ్మదేవుడు వారితో " నాయనలారా ! ఇంద్రుడు వాయుసుతుడైన  హనుమను తన వజ్రాయుధముతో  కొట్టెను . అందులకే  వాయుదేవుడు కోపించినాడు . మనమందరము వాయుదేవునివద్దకు వెళ్లి ఆయనని ప్రసన్నము చేసుకొనుటయే మన ముఖ్యకర్తవ్యము. లేనిచో  మనకు  వినాశనం తప్పదు " అని పలికెను . పిమ్మట దేవతలందరు  కలిసి వాయుదేవుడు ఉన్న ప్రదేశమునకు వెళ్లిరి . 

రామాయణము ఉత్తరకాండ ముప్పదిఐదవసర్గ  సమాప్తము . 

శశి,

ఎం.ఏ,ఎం.ఏ (తెలుగు ), తెలుగుపండితులు . 














రామాయణము ఉత్తరకాండ - ముప్పదినాలుగవసర్గ

                                      రామాయణము 

                                      ఉత్తరకాండ - ముప్పదినాలుగవసర్గ 

రావణుడు లోకముల బలశాలి ఐన మనుష్యుడు గురించిగాని , రాక్షసుడి గురించిగాని తెలిసిన వెంటనే అతడు మీదకు యుద్ధముకు వెళ్లసాగెను . అలా  రావణుడు ఒకసారి వాలి పాలనలో ఉన్న కిష్కిందా నగరమునకు యుద్ధమునకు వెళ్లెను . అప్పుడు తారుడు సుషేణుడు యువరాజైన సుగ్రీవుడు రావణుడితో " రాక్షసరాజా ! మా ప్రభువైన వాలి కిష్కిందానగరములో లేడు . మా వాలి నాలుగు సముద్రజలములతో సంధ్యోపాసనచేసి శీఘ్రముగానే ఇక్కడికి వస్తాడు . అప్పటి వరుకు ఇక్కడే వేచిఉండుము . రాక్షసరాజా ! ఇక్కడ గుట్టలుగా  పడిఉన్న  ఎముకల  గూడులను చూడుము . నీవలె యుద్దానికై వచ్చిన  పలువురు మహావీరులు  వీలిబలపరాక్రమములప్రభావమునకు మృతులైరి . ఈ  అస్థిపంజరములన్నియూ వారివే -అతనితో యుద్ధమునకు తలపడినచో నీకును ఇట్టి గతియే పట్టును . మృత్యు ముఖమును చేరుటకు నీకు తొందరగా ఉన్నచో దక్షిణసముద్రము కడకు వెళ్లుము . వాలి నీకు అక్కడ దర్శనమిచ్చును . "అని పలికెను . 
వానరవీరులు ఎంతగా హెచ్చరించుచున్నప్పటికీ ,రావణుడు వినిపించుకొనక పుష్పకముపై ఎక్కి దక్షిణసముద్రమునకు చేరెను . అక్కడ రావణుడికి వాలి కనిపించెను . రావణుడు వాలిని వెనకనుండి పట్టుకొనుటకై చప్పుడు చేయకుండా వాలివైపుగా నడవసాగెను . వాలి తన  యొక్క శక్తివలన రావణుడు వచ్చుట గమనించి వెనకకు తిరగకుండానే ,తన చంకలో ఇరికించుకుని ఆకాశములో ఎగిరెను . రావణుడి అమాత్యులు 'మా ప్రభువును విడువుము ,విడువుము 'అని అరుస్తూ వాలిని వెంబడించిరి . వాలి రావణుడిని చంకలో ఉంచుకునే అన్ని సముద్రములలో సంధ్యావందనము పూర్తిచేసెను . పిమ్మట వాలి కిష్కిందా నగరమునకు చేరి ,అక్కడ రావణుడిని వదిలెను . 
వాలి బలపరాక్రమములకు ఆశ్చర్యచకితుడైన రావణుడు వాలితో "వానరప్రభూ !నేను రాక్షసరాజుని . నాపేరు రావణుడు . నేను నీతో యుద్ధము చేయుటకై ఇచటికి వచ్చితిని . ఓ కపీశ్వరా !నీ బలపరాక్రమములు ఎంతటివో తెలిసినది . నేను నీతో అగ్ని సాక్షిగా చిరకాలమైత్రిని కోరుచున్నాను . "అని పలుకగా వాలికూడా అంగీకరించి రావణుడిని కౌగిలించుకునేను . పిమ్మట రావణుడు వాలి ఆతిధ్యములో ఒక మాసము కిష్కిందా నగరములో ఉండెను . 

రామాయణము ఉత్తరకాండ ముప్పదినాలుగవసర్గ సమాప్తము . 

                      శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

రామాయణము ఉత్తరకాండ - ముప్పదిమూడవసర్గ

                                         రామాయణము 

                                        ఉత్తరకాండ - ముప్పదిమూడవసర్గ 

దేవతలవలన పులస్త్యునికి రావణుడు బంధింపబడిన విషయము తెలిసింది . ఆ మహాముని మిక్కిలి  ధైర్యశాలే అయినాను పౌత్రునికి వచ్చిపడిన దుఃఖ స్థితి అతని హృదయమును  చలింపచేసింది . వెంటనే  కార్తవీర్యార్జునిడిని కలుసుకొని అతడు మాహిష్మతి పురమునకు బయలుదేరెను . ఆ మహర్షి యొక్క  దివ్యతేజస్సును ఆ మాహిష్మతి పురప్రజలు  చూడలేకపోయిరి . వారికి అతడు అద్భుతమైన తేజస్సుతో  కాలినడకన  వచ్చుచున్న సూర్యుడిరీతిగా కనపడెను . ఆ పౌరులు ఎట్టకేలకు ఆ మహాత్మున్ని పులస్త్యమహర్షిగా గుర్తింపలేదని వెంటనే  వారు తమ ప్రభువైన కార్తవీర్యార్జుని వద్దకు వెళ్లి ఆయనకు ఆ ముని రాకను తెలిపిరి . 
వెంటనే కార్తవీర్యార్జునుడు పులస్త్య మహర్షికి ఎదురుగావెళ్లి ఆయనకు వందనము చేసి పిదప అర్ఘ్య పాద్యములను , మధుపర్కమును ,గోవులను సమర్పించెను . పిమ్మట ఆ ప్రభువు సంతోషముతో నిండిన గద్గద స్వరముతో " మహాత్మా నా అదృష్టము వలన నీ దర్శన భాగ్యము కలిగింది . నా జన్మ చరితార్ధమైనది. తపస్సు సఫలమైనది . బ్రహ్మర్షీ ! ఈ రాజ్యము నీది . నేను మా  భార్యాపిల్లలు అందరమూ నీవారము . నేను ఇప్పుడు ఏమిచేయగలనో ఆజ్ఞ్యాపించుము " అని పలికెను . 
ఆ మాటలువిని సంతోషించిన పులస్త్యుడు ముందుగా కార్తవీర్యార్జునుడి ,అతని బంధుజనముల యొక్క , అతని రాజ్యము యొక్క యోగక్షేమములు అడిగెను . పిమ్మట ఆయన  " నరేంద్ర నీ బలపరాక్రమములు అపూర్వములు నా మనవుడైన రావణుడికి భయపడి సముద్రము , వాయువుకూడా కదలికలు మాని అతనిని సేవించుచున్నారు . అతడునీచే యుద్ధమున పరాజితుడై బంధిపబడి ఉన్నాడు . నా మాటలపై  గౌరవము ఉంచి బాలుడైన రావణుడిని వదిలిపెట్టుము . " అని పలికెను . వెంటనే కార్తవీర్యార్జునుడు మారుపలుకక రావణుడిని  బంధవిముక్తుడిని చేసి దివ్యమైన పూలహారముతోను , వస్త్రాభరణములతోను సత్కరించి రావణుడిని  అక్కున చేర్చుకొనెను . పిమ్మట కార్తవీర్యార్జునుడు రావణుడు వెళ్ళుటకు అనుమతిని ఇచ్చెను . రావణుడు కార్తవీర్యార్జునుడి చేతిలో ఓడిపోయినందుకు గాను  సిగ్గుతో తలవంచుకొనెను . ఆ విధముగా  కార్తవీర్యార్జునితో మైత్రిని పొందిన రావణుడు  యథావిధముగా తన దుశ్చర్యములను కొనసాగించెను . 

రామాయణము ఉత్తరకాండ ముప్పదిమూడవసర్గ సమాప్తము . 

శశి,

ఎం.ఏ,ఎం.ఏ (తెలుగు),తెలుగుపండితులు . 




















 

Tuesday 19 May 2020

రామాయణము ఉత్తరకాండ -ముప్పదిరెండవసర్గ

                                          రామాయణము 

                                             ఉత్తరకాండ -ముప్పదిరెండవసర్గ 

మిక్కిలి  భయంకరుడైన  రావణుడు నర్మదా నదీ  తీరమునందలే  ఇసుక తిన్నలపై  శివలింగార్చన  చేయుచున్న సమయములో నర్మదా  నదీ  జలములు  సముద్రజలములవలె కెరటములతో ఉప్పొంగి  రావణుడి పూజకు తెచ్చిన  పూలన్నిటినీ  నాదీ గర్భములో కలిపేసినవి . అది చూసిన రావణుడు  ఇలా జరుగుటకు గల తెలుసుకొని రమ్మని  శుఖసారణులను  పంపెను . వారు  తిరిగి వచ్చి  రావణుడితో  " మహారాజా ! ఇచటికి  సమీపానే ఒక మహాపురుషుడు  జలక్రీడలు  ఆడుచున్నాడు . అతడు  మద్దిచెట్టువలె మహాకాయుడు , అతడు  ఒక ఆనకట్ట  వలే 
నదీ ప్రవాహమును అడ్డుకునెను ". అని  పలికెను . 
వెంటనే  రావణుడు కార్తవీర్యార్జునుడు  అని పలుకుతూ  ఆ మహా రాజు  ఉన్న దిశగా వెళ్లసాగెను . రావణుని  మంత్రులు  కార్తవీర్యార్జుని  మంత్రులను  యుద్దములో  హతమార్చి  భక్షించివేసిరి . ఇంతలో ద్వార పాలకులు  ఆ విషయమును  కార్తవీర్యార్జునికి  తెలిపిరి . వెంటనే కార్తవీర్యార్జునుడు  ఆ నదీ  జలములనుండి  బయటకు వచ్చి  గధను  పైకెత్తి  గిరగిరా తిప్పుతూ శత్రువులపై  విరుచుకుపడెను . వేయి  చేతులుగల  కార్తవీర్యార్జునుడికి ఇరువైచేతులు  గల  రావణుడికి మధ్య  గ్రాయుద్దము  జరిగెను  . వారిరువురు  పరస్పరముగదలతో   తీవ్రముగా  మోదుకొన సాగిరి . ఆ గదా గాథ ధ్వనులు  దిక్కులు  పిక్కటిల్లు నట్లుగా  మారుమ్రోగినవి .  కార్తవీర్యార్జునుడు   పైకెగిరి  తన గదదెబ్బకు  కిందపడి  విలవిలా లాడుతున్న  రావణుణ్ణి గరుత్మంతుడు సర్పమును  పాటలుకున్నట్టుగా  పట్టుకొని బంధించెను .  అప్పుడు  సిద్దులు , దేవతలు  కార్తవీర్యార్జునుడిపై  పుష్పవర్షము  కురిపించిరి . 
రావణుడిని బంధించి తన తో  తీసుకుపోతున్న  కార్తవీర్యార్జునిడిని  చూసిన  రావణుని మంత్రులు " ఆగుము అగుము  మా ప్రభువును  విడువుము  విడువుము అని అరుస్తూ కార్తవీర్యార్జునిడిపై  అనేక ఆయుధములు ప్రయోగించిరి . తన మీదకు వచ్చుచున్న  ఆయుధములన్నిటినీ  కార్తవీర్యార్జునుడు  పట్టుకొని రాక్షసులపైనే  విసిరివేసెను . ఆ విధముగా  కార్తవీర్యార్జునుడు రావణుడిని తీసుకొని , మాహిష్మతీ నగరమునకుచేరి  అక్కడ అతడిని బంధించెను . 

రామాయణము ఉత్తరకాండ  ముప్పదిరెండవసర్గ సమాప్తము . 

శశి,

ఎం.ఏ,ఎం.ఏ (తెలుగు), తెలుగుపండితులు . 






















Monday 18 May 2020

రామాయణము ఉత్తరకాండ -ముప్పదిఒకటవసర్గ

                                        రామాయణము 

                                                                                                                                                                                      ఉత్తరకాండ -ముప్పదిఒకటవసర్గ 

అప్పుడు శ్రీ రాముడు అగస్త్యమునితో  "  విప్రోత్తమా!  క్రూరుడైన  ఆ రావణాసురుడు  విజయగర్వంతో  భూమండలమున తిరుగుచున్నప్పుడు భల  పరాక్రమములు  గల  క్షత్రియులు  ఒక్కరుకూడా  ఇక్కడ లేకుండెనా ?
లేక పోతే  ఆ కాలములో రాజులందరూ శాస్త్రజ్ఞానం  లేనివార ? " అని ప్రశ్నించెను . అప్పుడు  అగస్త్యమహా ముని నవ్వుతూ  "రామా! రావణుడు  రాజులందరిని పరాజితులు చేస్తూ  మాహిష్మతీ  పురమునకు చేరెను . అప్పుడా నగరమును  కార్తవీర్యార్జునుడు  అను రాజు పరిపాలించుచున్నాడు .  రావణుడు  అక్కడికి చేరిన నాడు  కార్తవీర్యార్జునుడు  నర్మదా నాదీ  జలములలో  జలకములు ఆడుటకు  వెళ్ళను . అప్పుడు  రావణుడు ఆ విషయము తెలుసుకుని  వింధ్యగిరి వైపుగా వెళ్లెను . రావణుడు  వింధ్యాద్రి వైభవమును  దర్శించుచూ  నర్మదా నదికి చేరెను . పిమ్మట  తన  మంత్రులను  నర్మదా  నదిలో జలకములాడుటకు  అనుమతిని ఇచ్చి  తాను  నది ఒడ్డున ఇసుక తిన్నెలపై  కూర్చుండి శివారాధన చేయసాగెను . రావణుడి మంత్రులు  అనుచరులు  నర్మదా నదిలో  జలకములు ఆడి  పిమ్మట  వారు రావణుడి పూజ కొరకై  పూలని తెచ్చిరి .రావణుడు  ఆ పూలతో  తన  తో  పాటు తెచ్చుకున్న  బంగారు లింగానికి  పూజచేయసాగెను . 

రామాయణము - ఉత్తరకాండ  ముప్పదిఒకటవసర్గ సమాప్తము . 

శశి,

ఎం.ఏ,ఎం.ఏ (తెలుగు), తెలుగుపండితులు . 















  

Sunday 17 May 2020

రామాయణము ఉత్తరకాండ --ముప్పదవసర్గ

                                        రామాయణము 

                                            ఉత్తరకాండ --ముప్పదవసర్గ 

మిక్కిలి  బలశాలి ఐన  ఇంద్రుడు రావణుడి సుతుడైన  ఇంద్రజిత్తు  చేతిలో  పరాజితుడై లంకలో బంహితుడైన పిమ్మట దేవతలు  బ్రహ్మదేవుడిని  ముందుఉంచుకొని  లంకకు వెళ్లిరి .  ఆకాశమునందుండియే  బ్రహ్మదేవుడు  "నాయనా! రావాణా ! నీ కుమారుడి  యొక్క బలపరాక్రమములకు  నేనెంతో  ముగ్దుడనైతిని . నలుగురు  దిక్పాలకులను  జయించి తీరెదను  అనే నీ  ప్రతిజ్ఞ  నెరవేరింది .  మిక్కిలి  బలశాలి  ఐన   నీ పుత్రుడు  ఇక పై  ఇంద్రజిత్తు  గా  ప్రసిద్దుడగును .  ఇంద్రుడిని విడిచి  పెట్టుము ప్రతిఫలంగా  దేవతలు  నీకు ఇవ్వగలరో  తెలుపుము ". అని పలికెను .  అప్పుడు  ఇంద్రజిత్తు " దేవా ! ఇంద్రునికి బంధవిముక్తి  కలిగించుటకై  ప్రతిఫలంగా  నేను అమరత్వము  కోరుచున్నాను " అని అడిగెను . దానికి బ్రహ్మదేవుడు  ఈ  సృష్టిలో  ఏ  ప్రాణికి  అమరత్వము ఉండదని తెలిపి మరేదైనా కోరుకొమ్మని  పలికెను . అప్పుడు ఇంద్రజిత్తు  " పితామహా!ఒక వేళా పూర్తిగా అమరత్వము  సాధ్యము కానిచో నేను  యుద్ధరంగములోకి  ప్రవేశించుటకు ముందుగా హోమంచేసి మంత్రపూర్వకములుగా  హవ్యములు  సమర్పించినచో  ఆ హోమం నుండి  ఒక దివ్య రధము  ఆవిర్భవింపవలెను . ఆ రథముపై నేను ఉన్నంతసేపు  నన్ను ఎవరు  చంపలేనట్లుగా  చేయుము ఒక వేళ మంత్రపూర్వకముగా   హోమరూపములో అగ్నిదేవుని  పూజించుట  పూర్తికాకముందే  నేను యుద్ధమునకు వెళ్ళినచో  నాకు మరణము కలుగునట్లు  చేయుము " అని ప్రాదించెను . అప్పుడు  బ్రహ్మదేవుడుతధాస్తు  అని పలికి  దేవతలతో సహా ఇంద్రుడుని  వెంటపెట్టుకొని  సురలోకమునకు   వెళ్లిపోయెను . 
పిమ్మట  ఇంద్రుడు తన తేజస్సు  తగ్గిపోయి  తాను పరాజితుడగుటకు కారణము గురించి  ఆలోచింపసాగెను . అప్పుడు  బ్రహ్మదేవుడు " ఇంద్రా ! ఇదువరుకు నీవు చేసిన తప్పిదమునకు  ఫలితమే ఇది . పూర్వము  నేను  మిక్కిలి సౌందర్యవతి ఐన  అహల్యను సృష్టించి ఈమెకు  భర్త ఎవరా అని ఆలోచింప సాగేను . నీవు న ప్రమేయము లేకుండానే  ఈమె నాకు భార్య కాగలు అని ఆలోచన చేసితివి . నేను  గౌతమునికి  ఇచ్చి వివాహము  చేసితిని . ఇంద్రా ! నీవు అన్ని ధర్మాలనుఎరిగినవాడివి  అయినా ఆమె నీకు భార్య  కాలేదని కోపంతో గౌహాటముని ఆశ్రముముకు  వెళ్లి అన్యధా ప్రవర్తించితివి . అప్పుడు గౌతముడు ఈ ఇంద్రపదవి  నీకు స్థిరముగా ఉండదని  శపించెను . ఆ శాప  కారణముగానే నేడు నీకీ  దుర్దశ కలిగినది . 
పిమ్మట గౌతముడు  తన భార్యను గట్టిగా మందలించి ఆమెనుకూడా  శపించెను . అప్పుడు అహల్యాదేవి  గౌతమునితో  తన తప్పేమి  లేదని  అది ఇంద్రామాయ అని  ప్రార్ధించెను . అప్పుడు గౌతముడు  " సతీ  ఇక్ష్వాకురాజ వంశమున శ్రీ మహావిష్ణువే  శ్రీరాముడి రూపములో అవతరించును .  అతడు రాక్షసులను సంహరించుటకు  ఇటువచును ఆయన్ని  దర్శించినంత మాత్రమునే నీవు పవిత్రురాలివి కాగలవు  పిమ్మట  నన్ను చెర గలవు " అని పలికి ఆయన తపస్సుకై వెడలిపోయెను .  పిమ్మట  అహల్యా దేవికూడా  తీవ్రమైన  తపస్సులో మునిగిపోయెను . ఆ  దుష్కర్మ  ఫలితమునే  ఇప్పుడు నీవు అనుభవించుచుంటివి .  దేవేంద్రా! వైష్ణవము  అనే యజ్ఞమును  చేయుము . దానివలన  నీకు శుభము కలుగును . నీ కుమారుడైన జయంతుడు  మరణించలేదు . మీ మామగారైన  పులోముడు  తన మనవడిని  తీసుకు వెళ్లి  సముద్రగర్భమున  భద్రముగా ఉంచెను " అని  పలికి బ్రహ్మ  దేవుడు తన లోకమునకు వెళ్లిపోయెను . 

రామాయణము  ఉత్తరకాండ  ముప్పదవసర్గ సమాప్తము . 

శశి,

ఎం.ఏ,ఎం.ఏ(తెలుగు),తెలుగుపండితులు . 












Saturday 16 May 2020

రామాయణము ఉత్తరకాండ - ఇరువదితొమ్మిదవసర్గ

                                    రామాయణము 

                                  ఉత్తరకాండ - ఇరువదితొమ్మిదవసర్గ

ఆ విధముగా  చీకట్లు కమ్ముకొని ఉన్నను దేవతలు రాక్షసులు  పరస్పరము యుద్ధము కొనసాగించుచూ , ఒకరినొకరు  చంపుకుంటిరి .  ఆ మహాయుద్ధమున  సుర సైనికుల దాటికి  రాక్షస మహాబలము  పదోవంతు వారు మాత్రమే మిగిలి ఉంటిరి  . మిగిలిన వారు మృత్యు  వాత పడిరి .  అది చూసిన రావణుడు  కోపోద్రిక్తుడై  పెద్దగా గర్జించెను .  అప్పుడు ఇంద్రుడు  ససైన్యముగా  వచ్చి  రావణుడిని చుట్టుముట్టేను .  అప్పుడు  ఇంద్రజిత్తు  పూర్వముతాను  సంకరునినుండి  వరంగా పొందిన  మాయను ప్రయోగించి  అతడు అదృశ్యమయ్యెను .  ఆ అదృశ్యరూపములోనే  సుర బలములపై  విజృంభించెను .  పిమ్మట అతడు  ఇంద్రుడిపై కూడా  తన  బాణ పరంపరను  ప్రయోగించెను . ఇంద్రుడు మాయా రూపములో ఉన్న  మేఘనాధుని  కనుగొనలేక పోయెను . అతడు   తన మాయచే  ఇంద్రుడిని  బంధించి  తన సైన్యము వద్దకు తీసుకు పోయెను . 
ఆ సమయములో రావణుడు  తనను  ఎదిరించిన  ఆదిత్యుని తో , వసువులతో పోరాడసాగెను .  అప్పుడు మేఘనాధుడు " తండ్రీ ! రండి  మనకు  విజయము లభించినది . ఇంద్రుడిని  బంధించి తీసుకు వచ్చాను .  మనము  ఇంటికి  వెళ్ళెదము " అని పలికెను . అప్పుడు రావణుడు  మేఘనాధుడు  మిగిలిన తమ సైన్యముతో, ఇంద్రుడితోసహా లంకకు చేరెను . 

రామాయణము ఉత్తరకాండ  ఇరువదితొమ్మిదవసర్గ  సమాప్తము . 

శశి,

ఎం.ఏ,ఎం.ఏ(తెలుగు),తెలుగుపండితులు . 













రామాయణము ఉత్తరకండ -ఇరువదియెనిమిదవసర్గ

                                        రామాయణము 

                                       ఉత్తరకండ -ఇరువదియెనిమిదవసర్గ 

దేవతల  దెబ్బలకు తట్టుకొనలేక  పారిపోతున్న రాక్షస బలములను చూసి  మేఘనాధుడు  రాక్షస సైన్యమును తిరిగి  యుద్ధరంగమునకు మరల్చి  దేవతల మీదికి  విజృంభించెను . మేఘనాధుడి  దాటికి తట్టుకొనలేక   దేవతలందరు  నలుదిశల కు  పారిపోయిరి . అది చూసిన జయంతుడు  (ఇంద్రుడి కొడుకు) యుద్ధరంగములో  ప్రవేశించి  మేఘనాధునితో  తలపడెను . జయంతుడు , ఇంద్రజిత్తు  చేయుచున్న  యుద్ధము  మిక్కిలి  తీవ్రముగా  కొనసాగుచుండెను .  మేఘనాధుడు  తీవ్రమైన  తన  మాయను ప్రయోగించగా లోకములన్నియూ  చీకటి ఆయెను . అంతటా  చీకట్లు క్రమ్ముకున్నకారణముగా  రాక్షసులు సురులు  ఒకరికొకరు గుర్తుపట్టలేక  తారుమారై  కలిసి పోయి  చెలాచెదురైరి  . తమ పక్షమువారు ఎవరో  పర పక్షమువారు  ఎవరో తెలియక  రాక్షసులతో రాక్షసులు  దేవతలతో దేవతలు కొట్టుకొనుచుండిరి ఈ అయోమయ స్థితిలో కొందరు దిక్కు తోచక పారిపోయిరి . 
అటువంటి  సమయములో  పులోముడు అనే దైత్య రాజు  జయంతుడిని బంధించి  తీసుకొని  సముద్రగర్భమునకు చేరెను .  జాయ్న్తుడు కనపడక పోవుటచే  సకల సురయోధుల్లో  ఉత్సాహము  సన్నగిల్లెను . అప్పడు ఇంద్రుడు యుద్ధ రంగమునకు వచ్చి  యుద్ధము చేయ సాగెను . అప్పుడు  ఇరు పక్షముల మధ్య మిక్కిలి గోరంగా యుద్ధము జరింగింది . కుంభకర్ణుడు  వివిధ  మారణాయుధములను చేతబూని దొరికి వాళ్ళను  దొరికి నాట్లు చితక బాదు  చుండెను .  ఇంద్రుడి అండ చూసుకొన్న దేవతలు  తమ పరాక్రమము చూపిరి . దేవతల దాటికి  తమ  బలములు  నశించి పోవుచుండగా  రావణుడు  మిక్కిలి  క్రుద్ధుడై  దేవతల సైన్యములోకి  ప్రవేశించి ఇంద్రుడి ఎదుట నిలిచెను . 
రావణ  ఇంద్రుల యొక్క బాణా పరంపరకు ఆకాశమంత  నిండిపోయి రణభూమి  అంత  అంధకారమయ్యెను . 

రామాయణము ఉత్తరకాండ ఇరువదియెనిమిదవసర్గ సమాప్తము . 

శశి,

ఎం.ఏ,ఎం.ఏ(తెలుగు),తెలుగుపండితులు . 














రామాయణము ఉత్తరకాండ - ఇరువదియేడవసర్గ

                                       రామాయణము 

                                        ఉత్తరకాండ - ఇరువదియేడవసర్గ 

రావణాసురుడు కైలాస పర్వతము దాటి  స్వర్గమునకు బయలుదేరెను . రావణుడు  వచ్చుచున్నట్లు తెలుసుకున్న ఇంద్రుడు కలవరపడి  యుద్ధసన్నద్ధుడయ్యెను .  పిమ్మట  ఇంద్రుడు  విష్ణుమూర్తి  వద్దకు  వెళ్లి ఆ  స్వామికి  దైన్యముతో  ఇట్లు విన్నవించెను . " శ్రీ  హరీ ! ఆ  రావణాసురుడు  గొప్ప బలపరాక్రమములు  కలవాడు . అతడు  సుర లోకముపై  దండెత్తి   వచ్చుచున్నాడు . బ్రహ్మదేవుని  వచనములను  వ్యర్ధము  కానీయరాదు  కదా ! కనుక  బాగుగా  ఆలోచించి నాకొక  ఉపాయమును చెప్పుము . నీవే  నాకుదిక్కు " అని పలికెను . అప్పుడు  శ్రీమన్నారాయణుడు  "  ఆ దుష్టుడు  బ్రహ్మదేవుని  నుండి  వరములు పొందినందువలన అజేయుడు . దేవాసురులు  అందరూ  కలిసినా కూడా  ఇతడిని చంపలేరు . సరికదా జయింపలేరుకూడా  బాల గర్వితుడైన  ఈ  రాక్షసుడు కుమారునితో కలిసి అనేక విధాలుగా దుష్కార్యాలను చేస్తాడు . దేవేంద్రా ! నీ ముందే ప్రమాణము  చేయుచున్నాను . రావణుయి చావు దగ్గర  పడిన పిమ్మట ఇతడిని , ఇతడి పరివారమును  నేనే  హతమార్చెదను  . ప్రస్తుతము  నీవు వెళ్లి అతనితో యుద్ధము చేయుము . " అని పలికెను . పిమ్మట ఇంద్రుడు యుద్ధమునకు సిద్దపడెను . దేవతలకు  రాక్షస యోధులకు మద్య  తీవ్రమైన యుద్ధము  ప్రారంభమైనది . సుపరిసిద్దుడు  సూరుడు  అష్టవసువులో  ఎనిమిదవవాడు ఐన సావిత్రుడు కదన  రంగములో  రాక్షసులను  చీల్చి చెండాడు  చుండెను . సుమాలి  అతడిని  ఎదిరించి యుద్ధము చేసి  ,అతని  దాటికి తట్టుకొనలేక  యుద్ధరంగములో  ప్రాణములను కోల్పోయెను . వసువు  యొక్క దాటికి  తట్టుకొనలేక  రాక్షసులు  తమ పిక్కబలము  చూపి పారిపోయిరి . 

రామాయణము -ఉత్తరకాండ  ఇరువదియేడవసర్గ  సమాప్తము . 

శశి,

ఎం.ఏ,ఎం.ఏ (తెలుగు), తెలుగు పండితులు . 

















రామాయణము ఉత్తరకాండ -ఇరువదిఆరవసర్గ

                                       రామాయణము 

                                         ఉత్తరకాండ -ఇరువదిఆరవసర్గ 

దశగ్రీవుడు ఆ రోజు రాత్రికి కైలాసపర్వతముపైనే ఉండిపోయెను . సైన్యము అందరూ ఆదమరచి నిద్రపోయినా రావణుడు మాత్రము కైలాసగిరి సౌందర్యమును చూస్తూ కూర్చుండెను . అప్పుడు అప్సరసలలో మేటి అయిన రంభ దివ్య ఆభరణములతో ,పుష్పములతో ,సుగంధములతో అలంకరించుకుని వెళ్లుచుండగా రావణుడు చూసేను . అతడు వెంటనే ఆమె చేతిని  పట్టుకొని "సుందరీ !ఎవరు నీవు ?ఈ సమయములో ఎక్కడికి వెళ్లుచున్నావు . నేను లంకాధిపతి రావణుడిని . ఈ ప్రపంచములో నాకు సాటి అయిన వాడు ఎవ్వడు లేడు . కావున నన్ను చేరుము . "అని పలుకగా రంభ కంపిస్తూ రావణునితో "ప్రభూ ! నేను నీ సోదరుడైన కుబేరుడి కుమారుడు నలకూబరుడి భార్యను . కోడలు కూతురుతో సమానము . కావున నీవు నాకు తండ్రివంటి వాడవు . నాపై దయ చూపుము "అని అర్దించెను . 
రంభ ఎంతగా అర్ధించినప్పటికీ రావణుడు వినిపించుకొనక ఆమె ను బలాత్కరించెను . రంభ ఏడుస్తూ నలకూబరుని వద్దకు వెళ్లి జరిగిన విషయమును తెలిపెను . అప్పుడు అతడు కోపముతో "సుందరీ !ఆ దుష్ట రావణుడు బలాత్కారముగా నే పట్ల అకృత్యము చేసినాడు . కావున ఇకపై అతడు ఇష్టములేని వనితను బలాత్కారము చేయ చూసినచో అతడి తల ఏడు ముక్కలైపోవును "అని శపించేను . ఆ శాపము వినగానే రావణుడి ఒళ్ళు జలదరించింది . స్త్రీని బలాత్కారముగా పొందవలెననే భావమును మానుకొనెను . రావణుడు బలవంతముగా తీసుకువెళ్లిన స్త్రీలందరికీ ఈ శాపము గురించి తెలిసి వారు మిక్కిలి సంతోషించిరి . 

రామాయణము ఉత్తరకాండ ఇరువదిఆరవసర్గ సమాప్తము . 

                      శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 





Friday 15 May 2020

రామాయణము ఉత్తరకాండ ----- ఇరువదిఐదవసర్గ

                                     రామాయణము 

                                ఉత్తరకాండ ----- ఇరువదిఐదవసర్గ 


రావణుడు లంకయొక్క  పశ్చిమద్వారమునకు  చేరువలో గల  నికుంభాల  వనంలోకి  తన  అనుచరులతో సహా ప్రవేశించెను .  తన కుమారుడైన మేఘనాధుడు  , కృష్ణాజినము , కమండలం , శిఖ  ధరించి ఒక యజ్ఞము  చేయుచుండగా  రావణుడు  చూసేను .  ఆ యజ్ఞము  రాక్షసగురువు  శుక్రాచార్యుడు  చేయించుచున్నాడు . అప్పుడు  రావణుడు  తన  కుమారుడైన మేఘనాధుని వద్దకు వెళ్లి  అతని ప్రేమతో  ఆలింగనము  చేసుకొని " నాయనా  ఏమి యజ్ఞము  చేయుచున్నావు  " అని అడిగెను . మౌనదీక్షలో  ఉన్న మేఘనాధుడు  మౌనంగా  ఉండెను . అప్పుడు  శుక్రాచార్ర్యుడు " మహారాజా! సకల సంపదల సంవృద్దికై ఆచిరింప బడుతున్న  యజ్ఞము ఇది .  అవి  అగ్నిష్టోమము , అశ్వమేధము , బహుసువర్ణకాము, రాజసూయము , గోమేధము , వైష్ణవము , మహీవరాయజ్ఞము . మొత్తము ఏడు . ఇతడు  వీటిని  భక్తి శ్రద్దలతో  ఆచరించి  పరమేశ్వరుడి అనుగ్రహముతో ' ఒక దివ్య విమానమూ , తామసి అను మయా విద్యను  బాణములు అక్షయముగా  సృష్టింపగల  రెండు తూణీరములు , ఒక చాపము , ఒక అస్త్రము 'పొందెను . " అని పలికెను . అప్పుడు రావణుడు  కుమ్మరా ! నేను జయించిన శత్రువులైన  దేవతలను  నీవు  పవిత్రద్రవ్యములతో పూజించుట ఏమి ? సరేలే  , ఇదీ  సత్కార్యమే  మనము ఇంటికి  వెళ్ళెదము . అని పలికి తన కుమారునితో, విభీషనుతో  సహా  తన  భావమునకు  చేరెను . 
పిదప రావణుడు  విమానంలో  బంధిపబడిన స్త్రీ  లందరిని కిందకు  దింపించెను .  వారందరు ఇంకనూ  కన్నీరు  కార్చుచూ  గద్గద స్వరములతో  ఏడ్చుచునే  ఉండిరి .  అది చూసిన విభీషణుడు  " సోదరా ! నీవు తీసుకు వచ్చిన ఈ  స్త్రీలను  హింసించుట తగదని  ఎరిగియు , శాస్త్ర మర్యాదలను  అతిక్రమించి ఇష్టం వచ్చినట్లు  ప్రవర్తించుచున్నావు . ఇలా  చేయుట  వలన  నీకు  అపకీర్తి  వచ్చును సంపదలు నశించును . వంశ  ప్రతిష్ట దెబ్బతినును.  ఇట్టి పాప కర్మలను  చేయవలననే  ఆలోచన  నీకు వచ్చుటకు  మనము  చేసిన పాపకర్మలే కారణము . మాల్యవంతుడు  మన తల్లి  కైకసికి  పెదతండ్రి  మనకు పూజ్యుడు . ఆయన  పుత్రిక అయినా  అనల కూతురు  కుంభీనసి  మన  సోదరులందరికి  చెల్లెలు . రాజా ! మధురాక్షసుడు  అనువాడు  ఆమెను  బలవంతముగా  అపహరించుకుని పోయెను . ఆసమయములో  మేఘనాధుడు  యజ్ఞదీక్షలో ఉన్నాడు . నేను  తపస్సు నిమిత్తమై  జలముల  మధ్యఉన్నాను .  కుంభకరుణుడు  గాఢమైన నిద్రావస్థలో ఉన్నాడు . మధు రాక్షసుడు  అదును చూసుకొని  ఎదిరించిన  మన మంత్రులను చంపి  నిద్రించుచున్న  కుంభీనసని  ఎత్తుకొనిపోయినాడు . తదుపరి ఆ విషయము  నీకు తెలిసిన్నప్పటికీ నీవు అతనిని  చంపక ఊరుకుంటివి . పెడ బుద్దితో  నీవు చేసిన ఆపనికి  ఫలితమే ఇది " అని పలికెను . 
విభీషణుడి మాటలు విన్న రావణుడు పశ్చాత్తాపపడుతూ నాలుగువేల అక్షౌహిణుల సైన్యముతో ,మేఘనాధుడితో కుంభకర్ణుడితో కలిసి  మధురాక్షసుడిని వధించుటకు  బయలుదేరేను . విభీషణుడు మాత్రము లంకలోని ఉండిపోయెను . పిమ్మట రావణుడు తన సైన్యముతో సహా మదుపురము చేరి అక్కడ తన సోదరి అగు కుంభీనస ను చూసేను . ఆమె తన అన్నను చూసిన వెంటనే అతడి పాదములకు ప్రణమిల్లెను . అప్పుడు రావణుడు ఆమె ను లేవనెత్తి "అమ్మా !బయపడకు  ఇప్పుడు నేను చేయవలసిన పని ఏమి ?"అని ప్రశ్నించెను . అప్పుడు ఆమె "అన్నా !నీవు నన్ను నిజముగా అనుగ్రహింపదలిచినచో నా భర్తను చంపవద్దు . నన్ను కనికరింపుము . "అని అర్దించెను . అప్పుడు రావణుడు కుంభీనసకు అభయము ఇచ్చి తన బావగారిని గూర్చి అడిగెను . వెంటనే సంతోషముతో కుంభీనస  నిద్రించుచున్న తన భర్త ను నిద్రలేపి తన అన్న వచ్చిన విషయము తెలిపెను . వెంటనే ఆ రాక్షసుడు రావణుని సమీపించి తగినవిధముగా గౌరవమర్యాదలు చేసెను . రావణుడు ఆ రాత్రికి అక్కడే బస చేసి మరునాడు ఉదయమే సైన్యముతో సహా కైలాసపర్వతమునకు వెళ్లెను . 

రామాయణము ఉత్తరకాండ ఇరువదియైదవసర్గ సమాప్తము . 

                 శశి ,

ఎం . ఏ ,ఎం .ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 


















రామాయణము ఉత్తరకాండ ------------ఇరువదినాలుగవసర్గ

                                      రామాయణము 

                                ఉత్తరకాండ ------------ఇరువదినాలుగవసర్గ 

మిల్కీలి దుర్మార్గుడైన  రావణుడు   విజయోత్సాహముతో  తిరిగివచుచూ  రాజులా , రుషిలా, దేవా, గందర్వల,నాగ,రాక్షస,,యక్ష ,  కన్యలను  పెక్కు మందిని  అపహరించెను . చూడ  ముచ్చటైన్ కన్య గాని  పరసతిగాని  కనబడినచో  వారి బంధు  జనులను చంపివేసి  ఆ కన్యలను  విమానమునందు  నిర్బంధించెను . ఆ కన్యలు , స్త్రీలు  విమానము నందు  బోరున ఏడవసాగిరి   వారందరు  తమలోతాము  తమగోడు వేళ్ళ బోసుకుంటూ  శోక సాగరములో  మునిగిరి .  ఆ స్త్రీలలో పెక్కు మంది "  ఈ రాక్షాదములు  పరస్త్రీ లపై  కోరిక కలిగి ఉన్నందున  ఒక స్త్రీ మూలంగానే  ఇతడికి మరణము ప్రాప్తించును . " అని శపించిరి 
ఈ విధముగా  స్త్రీ  లచే  శపించబడిన రావణుడు  తేజోరహితుడయ్యెను .  అతని మనస్సు కలత చెందెను .  వారి విలాపం వచనములు వింటూ  రావణుడు  లంకా నగరంలోకి  ప్రవేశించెను . అప్పుడు  నిశాచరులు  జైజైలు  పలుకుతూ  ఆయనకు స్వాగత సత్కారములు  చేసిరి .  ఇంతలో  కామరూపిణి  భయంకరమైన  రాక్షసి అగు  శూర్పణఖ  తన అన్న రావణుడి  ముందు  భూమి పై సాగిలపడెను .  అప్పుడు  రావణుడు తన చెల్లిని  లేవనెత్తి "  ఇది  ఏమి  నీకు వచ్చిన  ఆపదేమిటి  వెంటనే చెప్పు  " అని పలికెను .  నేత్రములనుండి  బాష్పములు  స్రవించుచునుండగా   ఆ శూర్పణఖ  " నీవు పరాక్రమ  సాలివే కావచ్చు  నీ ప్రతాప  కారణముగా నన్ను  విదవను  చేసితివి .  నా సోదరుడివి  అయ్యిఉండి  నా భర్తను చంపితివి . ఇట్లుచేసినందుకు  నీకు సిగ్గుగాలేదా !? " అని ప్రశ్నించెను. 
అప్పుడు రావణుడు "అమ్మా !ఏడవకుము . శత్రువులను దెబ్బతీయుటలో నిమగ్నుడనై ఉన్ననేను నీ భర్తను గుర్తించలేకపోతిని . ఇప్పుడు నీ హితము కొరకై నేను చేయగలిగినది అంతా చేసెదను . నీవు మనకు సోదరుడైన ఖరుడి వద్ద నివసింపుము . అతడు నీ ఆజ్ఞప్రకారము నడుచుకుంటాడు . "అని పలికేను . పిమ్మట రావణుడు పరాక్రమశాలురైన పదునాలుగువేలమంది యోధులతో కూడిన సైన్యము ఖరుడి ఆధీనములో ఉండునట్లు ఆజ్ఞలను ఇచ్చెను . అప్పుడు ఖరుడు తన సైన్యముతో కలిసి దండకారణ్యములో ప్రవేశించి ,పరిపాలన చేయుచుండెను . శూర్పణఖ కూడా ఆ వనములోనే నివసించసాగెను . 

    రామాయణము ఉత్తరకాండ ఇరువదినాలుగవసర్గ సమాప్తము . 

                   శశి ,

ఎం .ఏ ,ఎం .ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 









రామాయణము ఉత్తరకాండ ---------ఇరువదిమూడవసర్గ

                                      రామాయణము 

                                     ఉత్తరకాండ ---------ఇరువదిమూడవసర్గ 

అగస్త్యడు  ఇంకా  ఇలా చెప్పుచున్నాడు  " రామా!  రావణుడు  యముని జయించి  తన యుద్ధ సామర్ధ్యమును  తానే  పొగుడుకొనుచూ  రసాతలముకు  వెళ్లెను . అది  దైత్యులకు  నాగ జాతి వారికి  నివాస స్థలము . అది వరుణుడి రక్షణలో ఉండెను . మొదట రావణుడు  వాసుకి  పాలనలో ఉన్న  భోగవతీ  పురమునకు  వెళ్లి  నాగజాతి  వారిని  వశపరుచుకొనెను .  పిమ్మట  అతడు  బ్రహ్మదేవుడిచే  వరములు పొందిన నివాతకవచాది  దైత్యులు నివసించే  మణిపురముకు చేరి వారిని  యుద్ధమునకు పిలిచెను .  పిమ్మట ఆ దైత్యులకు  రావణునికి మధ్య  ఓక సంవత్సర కాలము మించి యుద్ధము కొనసాగేను . కానీ  వారిలో ఏ  పక్షమువారు  జయించలేదు . ఇంతలో శాశ్వతుడైన బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చి వారిని వారించి "దైత్యులారా !రావణుడిని జయించుట అసాధ్యము . అట్లే అమరులు దానవులు కలిసి వచ్చినను మిమ్ము జయించలేరు . కావున మీరు ఈ రావణుడితో మైత్రిచేసుకొనుట ఉత్తమము . మైత్రివలన ఇరుపక్షముల వారికి సకల ప్రయోజనములు కలుగును . "అని పలికెను . 
అప్పుడు రావణుడు నివాతకచులతో అగ్నిసాక్షిగా మైత్రి చేసుకొనెను . రావణుడు అచట ఒక సంవత్సరకాలం వుంది అతిధి మర్యాదలు పొందెను . పిమ్మట రావణుడు వారి నుండి వంద మాయా విద్యలను పొందెను . పిమ్మట కాలకేయులు మట్టుపెట్టేను . పిమ్మట దశాననుడు తన సైన్యమునే తినివేయుచున్న కారణముగా శూర్పణఖకు భర్త ,తనకి బావమరిది అయిన విద్యుజ్జిహ్వుని తన ఖడ్గముతో ఖండించివేసెను . పిదప ఆ రాక్షసరాజు వరుణుని యొక్క దివ్యమందిరము సమీపమునకు  వెళ్లెను . అచట నందీశ్వరుడి తల్లి అయిన సురభిని చూసేను . ఆ గోవునకు ప్రదక్షణపూర్వకముగా నమస్కరించెను . వరుణుడి భవనంలో ప్రవేశించుచున్న రావణుడిని అక్కడ కల సేనాపతులు అడ్డగించిరి . అప్పుడు రావణుడు వారిని దెబ్బతీసి అక్కడ యోధులతో మీ రాజైన వరుణుడిని నాతొ యుద్ధమునకు రమ్మని చెప్పండి అని పలికెను . 
ఇది తెలుసుకొన్న వరుణుని పుత్రులు ,పౌత్రులు ,వారి బలములకు అధ్యక్షులైన గోపుష్కరులు మిక్కిలి కోపముతో అక్కడికి వచ్చిరి . వారికి రావణునికి మధ్య దారుణమైన యుద్ధము జరిగెను . మహాపరాక్రమవంతులైన రావణాసురుని అమాత్యులధాటికి తట్టుకోలేక వరుణుని బలములు క్షణములో నేలపాలయినవి . అది చూసిన వరుణుని పుత్రులు శీఘ్రముగా పయనింపకల తమ రధములపై ,ఆకాశమునకు చేరి అచట నుండి యుద్ధము చేయసాగిరి . రావణుడు చిత్రవిచిత్రమైన ఆయుధములను వరుణుని పుత్రులపై ప్రయోగించగా వారు మిక్కిలి గాయపడిరి . అది చూసిన రావణుడు మిక్కిలి సంతోషముతో ప్రళయకాల మేఘమువలె బిగ్గరగా గర్జించెను . అప్పుడు వారు యుద్ధవిముఖులై తమ భవనములకు వెళ్లిపోయిరి . అనంతరము ఆ రాక్షస రాజు "యుద్ధమునకు మీ రాజుని పిలువుడు "అని వరుణుని సైనికులతో పలికెను . అప్పుడు వారు "రాక్షసరాజా !నీవు యుద్ధమునకు పిలుచుచున్నా మా మహారాజైన వరుణుడు గంధర్వగానములు వినుటకు బ్రహ్మలోకమునకు వెళ్లెను . ఇక్కడలేరు . అతని పుత్రపౌత్రులను నీవు పరాజితులు చేసితివి . "అని పలికిరి . అప్పుడు రావణుడు తానూ విజేత అయినట్టు ప్రకటించుకుని ,సంతోషముతో సింహనాదం చేయుచు ,వరుణలోకము నుండి వెళ్లిపోయెను . 

రామాయణము ఉత్తరకాండ ఇరువదిమూడవసర్గ సమాప్తము . 

                       శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 








రామాయణము ఉత్తరకాండ ----------ఇరువదిరెండవసర్గ

                                  రామాయణము 

                               ఉత్తరకాండ ----------ఇరువదిరెండవసర్గ 

తన  సైన్యము  నశించారని  తెలుసుకున్న  యమధర్మ రాజు తానే  స్వయముగా  యుద్ధమునకు  సిద్దపడెను . మృత్యు  దేవత  పాశమును, గదను  చేబూచి,  యమునిముందుభాగమున  నిలిచెను . యముని ఆయుధ మైన  కాల  దండము మనిషిగా  మారి యముని ప్రక్కన  నిలిచెను . తాకినంతనే  భగ్గుమనే గద  కూడా  వ్యక్తిగా  మారి  పక్కన నిలిచెను .  యముడు  క్రుద్ధుడై  ఉండుట చూసి ముల్లోకములు దేవతలు భయముతో  కంపించిపోయిరి . 
ఆ  విధముగా  యమధర్మ రాజు  క్షణకాలంలో  యుద్దభూమికి  చేరెను . మృత్యు  దేవతతో కలిసి  యుద్ధసన్నాహములతో  భీకరముగా  ఉన్న  యముడిని చూసి  రావణుని  మంత్రులు "  శక్తివంతములైన  యముని బలముల  ముందు  మన బలములు  నిలువచాలవు . వీరి తో యుద్ధము చేయుటకు మనము అసమర్థులము . " అని పలికి  అను దిక్కులా  పారిపోయెను . రావణుడు  ఏమాత్రము  భయపడలేదు . యముడు  రావణుడిని  సమీపించి  తన ఆయుధములతో  అతడి  ఆయువు పట్టులపై  కొట్టెను . రావణుడు  యముని రథముపై  సరవర్షము కురిపించెను . యముడు  వివిధ  ఆయుధములను చేతబూని  ప్రయోగించుచు  వరుసగా  ఏడురోజులు యుద్ధము  చెసెను . యముడి ధాటికి  తట్టుకోలేక  రావణుడు  దిక్కు తోచని వాడయ్యెను .  పిదప   యముడు  తన  కాల  దండముతో రావణుణ్ణి  కొట్టుటకై  యత్నించెను . అప్పుడు  బ్రహ్మదేవుడు  యముడికి  మాత్రమే కనబడి "  యమధర్మారాజా! నీ పరాక్రమము   అద్భుతము .   నీవు ఈ కాలదండముతో  ఈ రావణుడిని  చంపవలదు . దేవతలలో  శ్రేష్ఠుడివైన  యమధర్మరాజా  ! నేను  ఇతడికి  దేవతల  వలన  మరణము లేకుండునట్లు  వరము  ప్రసాదించితిని . నీవు  ఇతడిని  సంహరించినచో  నేను  అసత్య  వాదిని  అగుదును . అని పలికెను .   అప్పుడు యముడు "  స్వామీ! నీవు మా  అందరికి  ప్రభువువు . నీ మాట మాకు  శిరోధార్యము . కావున కాల దండమును  ఉపసంహరించుకుంటున్నాను . కనుక  నేను  ఇతడికి కనబడకుండా రధముతో సహా  అదృశ్యుడిని అయ్యేదను . " అని  పలికి  యముడు  అదృష్యుడుఅయ్యెను . అప్పుడు దశగ్రీవుడు  తాను యముడిని జయించినట్లుగా ప్రకటించుఁకొనెను . పిమ్మట  అతడు  పుష్పక విమానము  ఎక్కి యమలోకమునుండి వెళ్లిపోయెను . అనంతరము ఉర్మాధర్మరాజు  బ్రహ్మదేవునితో  సహా  స్వర్గలోకమునకు  చేరెను . నారదుడు  కూడా తన దారిన తాను  పోయెను . 

రామాయణము ---------ఉత్త్తరకాండ ----------ఇరువదిరెండవసర్గ  ----------సమాప్తము . 

శశి 

ఎం.ఏ,ఎం.ఏ(తెలుగు), తెలుగుపండితులు . 













రామాయణము ఉత్తరాకాండ --------ఇరువదిఒకటవసర్గ

                                     రామాయణము 

                                    ఉత్తరాకాండ --------ఇరువదిఒకటవసర్గ 

ఎక్కడికైనా  త్వర త్వరగా  వెళ్లే  శక్తిగల  విప్రోత్తముడైన  నారదుడు వెనువెంటనే  యమలోకమునకు వెళ్లి రావణుడు  దండెత్తి వస్తున్న విషయము  తెలిపెను . ఇంతలోనే  దూరముగా  రావణుడి విమానము  కనబడెను. 
విమానంపై  వచ్చుచున్న  రావణుడు నరకలోకములో  ప్రాణులు పడుతున్న  మిక్కిలి భయానకరమైన నరక  యాతనలను కళ్లారా  చూసేను . అవి  వెన్నులో వొణుకు పుట్టించునట్లుగా  ఉండెను . ఆ భాదలు తట్టుకోలేక  జీవులు కర్ణ  కఠోరంగా  కేకలు పెట్టుచుండిరి .  పిమ్మట  దశగ్రీవుడు  మరొకవైపు  చూడగా  అక్కడ పుణ్యాత్ములేన  జీవులు తమ  మంచికర్మల  ప్రభావంగా  శ్రేష్టమైన  గృహములలో జీవించుచూ  గీతములతో  , వాద్యగోష్టులతో , మనోహర  నాదములతో  ఆనందించుచుండిరి . వారిలో గృహదానములు చేసినవారు చక్కని భావనములలో ఉండెను . గోదానములు చేసిన వారు  గోక్షీరమును  ఆస్వాధించుచుండెను . అన్న దానము చేసిన వారు  రుచికరమైన  ఆహార పదార్ధములను  భుజించుచుండెను . 
తాము  చేసిన  దుష్కర్మల ఫలితముగా  రంపపుకోతలు మొదలగుయాతనలు  అనుభవించుచున్న  ప్రాణులకు రావణుడు  తన  భళా పరాక్రమముల ద్వారా  విముక్త్తి  కలిగించెను . అప్పుడు  యమా  దూతలు  మిక్కిలి క్రుద్ధులై  రావణునిపై  విరుచుకుపడిరి . యమభటులు పుష్పక విమానంపై  ఈటలను , శూలములను బల్లెములను వందల  వేలకొలదిగా విసిరిరి  కానీ  బ్రహ్మ యొక్క  ప్రభావమున  అది చెక్కు చెదరక ఉండేను . రావణుడు  , అతని  అనుచరులు  యముని పక్షముకు  చెందిన  యోధులపై  దాడికి  దిగి అక్కడ ఉన్న వృక్షములను , కొండలను , మహాప్రాసాదములను   పెకలించి యుద్ధము చేయసాగిరి .  యమభటులు రావణుడి అస్త్రములను నివారించుచూ  రావణుడిని  ఒంటరిగా  చేసి  అతనిని  దెబ్బ తీసిరి అప్పుడు రావణుడు పాశుపతాదాస్త్రమును  ప్రయోగించెను .  ఆ అస్త్రము  నిప్పులు  చిమ్ముచు  పొదలను  వృక్షములను , బస్మం  చేస్తూ  దూసుకొని పోవుచుండెను . ఆ అస్త్రము యెక్క తేజ ప్రభావంగా యముని సైనయము నెల కూలెను . 

రామాయణము ------------ఉత్తరకాండ ----------ఇరువదిఒకటవసర్గ -----------సమాప్తము . 

శశి,

ఎం.ఏ,ఎం.ఏ (తెలుగు), తెలుగుపండితులు 










రామాయణము ఉత్తరకాండ ---------- ఇరువదియవసర్గ

                                     రామాయణము 

                                ఉత్తరకాండ ----------  ఇరువదియవసర్గ 

రావణుడు  భూమండలమును  గడగడలాడించుచూ  ఒక  రోజు  నారదుడిని  చూసి  అయన వద్దకు  వెళ్లి  నమస్కారము  చేసి  కుశల  ప్రశ్నలు  అడిగెను . అప్పుడు నారదుడు " రాక్షసరాజా ! నీ సూర్య సాహసములకు మిక్కిలి సంతోషించితిని నీకు  ఉన్నచో  మాటలు  చెప్పెదను  వినుము .  నాయనా ! అమరులైన  దేవతలు సైతం  నిన్ను చంపలేదు . ఇంక మానవ  మాత్రులు  ఎంత ? నిత్యము  ఆకలి దప్పులతో  రోగములతో , ముసలితనముతో, అర్ధకామములతో  చస్తూ  బ్రతికే వారిని  చంపుటవలన  ప్రయోజనమేమి  ? మానవులందరు  యమలోకమునకు  వెళ్లవలిసిన   వారే  కావున వీరిని బాధించుటమాని  యమునిపని   పట్టుము . యముని  జయించినచో  సమస్తము జయించినట్లే  అగును . "" అని పలికెను . 
నారదుని  మాటలువిన్న  రావణుడు " మహాత్మా! యమధర్మ  రాజును  వధించుటకు  నేను  కృత నిశ్చయుడనై  ఉన్నాను . కావున అతడు నివసించే  దక్షిణ దిశకే  బయలుదేరుతున్నాను .  ప్రాణులను  ఏతేన పాలు చేయునట్టి  ఆ యమధర్మరాజుకు  మృత్యుముఖమునకు  పంపెదను " అని పలికి ఆ మహామునికి  నమస్కరించి  దక్షిణ దిశగా  బయలుదేరెను . రావణుడికి  యముడికి మధ్య జరిగే  యుద్ధము చూచుటకై  నారదుడు  కూడా  యమపురికి  వెళ్లెను . 


రామాయణము ----------ఉత్తరకాండ ---------ఇరువదియవసర్గ -----------సమాప్తము . 

శశి,

ఎం.ఏ,ఎం.ఏ (తెలుగు), తెలుగుపండితులు . 














రామాయణము ఉత్తరకాండ -పందొమ్మిదవసర్గ

                                                రామాయణము  

                                                 ఉత్తరకాండ -పందొమ్మిదవసర్గ 

రావణుడు మరుత్తురాజును జయించిన పిమ్మట ,దేవేంద్రుడు ,వరుణుడు తో సమానమైన బలపరాక్రమములు కల రాజులను చేరి వారిని యుద్ధమునకు ఆహ్వానించెను . వారందరూ తమలోతాము ఆలోచించుకుని యుద్ధము చేయకనే ఓడిపోయినట్లు ఒప్పుకొనిరి . అనంతరము రావణుడు అయోధ్యను చేరెను . అప్పుడు అనరణ్యుడు అను మహారాజు అయోధ్యకు రాజు . అతడు రావణుడి యుద్ధవార్తలు తెలిసి ముందుగానే సైన్యమును సిద్దము చేసుకొని ఉంచెను . రావణుడు వచ్చిన విషయము తెలుసుకుని తన సైన్యముతో సహా యుద్ధమునకు వచ్చి ,రావణుని ఎదిరించెను . 
అనరణ్యుని పరాక్రమము తట్టుకోలేక రావణుడి మంత్రులైన మారీచుడు ,శుకసారణులు ,ప్రహస్తుడు మొదలగువారు పలాయనం చిత్తగించిరి . పిమ్మట రావణుడు యుద్ధమునకు దిగి అనరణ్యుని సైన్యమును చిత్తుచేసెను . అనరణ్యుని కూడా తన అస్త్రశస్త్రములతో మిక్కిలి గాయపరిచేను . అయినను ఆ మహారాజు యుద్ధరంగమునుండి వెళ్లిపోక రావణుడితో "మహాత్ములకు పుట్టినిల్లయిన రఘువంశమునే అవమానపరిచితివి . కనుక నీకు శాపమును ఇచ్చుచున్నాను . నేను అర్హులకే దానధర్మములు చేసియున్నచో పరార్ధబుద్ధితో యజ్ఞయాగములను ఆచరించినచో ,కన్నబిడ్డలవలె ప్రజలను రక్షించుచున్నచో ,నా శాపము ఫలించుగాక !రావణా !ప్రసిద్ధమైన ఈ రఘువంశములో ఎందరో ప్రసిద్ధులైన మహానుభావులు ఉద్బవించిరి . అట్లే దశరధుని కుమారుడిగా మహాత్ముడైన శరీరాముడు అవతరించి నీ ప్రాణములు తీయగలడు . "అని శపించి ఆ మహారాజు మరణించెను . అనంతరము రావణుడు అక్కడినుండి వెళ్లిపోయెను . 

రామాయణము ఉత్తరకాండ పందొమ్మిదవసర్గ సమాప్తము . 

                        శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






రామాయణము ఉత్తరకాండ -------------పదునెనిమిదవ సర్గ

                                        రామాయణము 

                                  ఉత్తరకాండ -------------పదునెనిమిదవ సర్గ 

రావణుడు పుష్పకముపై   భూమండలమంతా  తిరుగుతూ మరుత్తుడు  అనే మహారాజు యజ్ఞము చేయుచుండగా  చూసేను . బృహస్పతికి సోదరుడైన  సంవత్తుడు  అను బ్రహ్మర్షి  సమస్త  దేవతలతో  కలిసి ఆ యజ్ఞము  చేయుచుండెను .  రావణుడి  రాకను గమనించి  దేవతలు భయపడి  పశుపక్షాదులుగా  మారిరి  ఇంద్రుడు  నెమలిగాను , యమధర్మరాజు  కాకిగాను  , కుబేరుడు  తొండగాను , వరుణుడు  హంసగాను  మారీరి  అప్పుడు రావణుడు  యజ్ఞ  శాలలో  ప్రవేశించి  మరుత్తు  రాజుతో  "  నాతో  యుద్ధముచేయుము  లేదా  పరాజితుడవైనట్లు  ఒప్పుకొనుము . " అని  పలికెను . అప్పుడా  మరుత్త  రాజు  రాక్షసరాజా ! అన్నతో యుద్ధముచేసి  ఆయనను  జయించిన  నీవు  ఎహ్తో దన్యుడివి కదా . కానీ  నీవు చేసిన  ఆ పని  లోక ధర్మములకు విరుద్ధము పైగా  నింద్యము . నేడే నా బాణములతో నిన్ను మృత్యుముఖమునకు  చేర్చెదను " అని పలికెను . 
అప్పుడు సంవర్తన  మహర్షి  ఆ  మహారాజుకు  అడ్డంవచ్చి " రాజా ! నీకు నా మాటలపై  గౌరవము ఉన్నచో  వినుము  నీవు ఇప్పుడు  యుద్ధమునకు దిగుట  యుక్తముకాదు  ఇది  పరమేశ్వరుడకు  సంబంధించిన  యాగము . దీనిని  పూర్తిచేయనిచో  నీ  వంశమే నాశన మగును . యజ్ఞ  దీక్షలో  ఉన్నవాడు  యుద్ధమునకు  పూనుకొనుట తగదు యజ్ఞ దీక్షలో ఉన్న వానికి కోపమే రారాదు . ఈ రాక్షసుడు  అజేయుడు . " అని  పలికెను . వెంటనే  మరుత్త రాజు  ధనుదానములను  పక్కనపెట్టి  ప్రశాంతముగా  యజ్ఞము  చేయుటకు  పూనుకొనెను . అప్పుడు  సుఖరాక్షసుడు  రావణుడే జయించాడు  అని బిగ్గరగా  సింహనాదం  చేసెను . పిదప  రావణుడు , అతని  అనుచరులు  యజ్ఞమునకు  విచ్చేసి  వేదిక పై  ఉన్న మహర్షులను భక్షించి వారి రక్తములను  తనివితీరా  త్రాగెను . 
రావణుడు  వెళ్లి పోయిన పిమ్మట  ఇంద్రుడు  మయూరమునకు వారము ప్రసాదించెను . అంతకు ముందు నెమళ్ళ పింఛములన్నియూ  కేవలము నీలముగా  మాత్రమే  ఉండేవి ఇంద్రుడి వార ప్రభావమున  ఆ పింఛములన్ని  కన్నులతో విరాజిల్లినవి . పిమ్మట  యమధర్మరాజు  కాకితో  " వాయసమా ! న అనుగ్రహ  ప్రభావమున  మీ జాతికి  ఏరోగములు అంటవు. మీకు మృత్యు భయము కూడా ఉండదు . నరులు  నిన్ను వధింపనంతవరుకూ  నీవు  జీవించే ఉండెదవు . నాలోకమునకు చేరిన అమానవులన్దరు  ఆకలి దప్పులతో  అలమటించెదరు . భూమిపైనున్న  వారి బంధువులు  నీకు ఆహారమిచ్చి  తృప్తిపరిచినచో  పితృదేవతలయొక్క  ఆకలి  దప్పులు   తీరును . " అని  వరమిచ్చెను . 
తదుపరి  వరుణుడు  హంసతో  " నీవు ఎల్లపుడూ  మనోజ్ఞమైన  కాంతులతో  విలసిల్లుతావు . నా  సంతోష చిహ్నముగా  నీవు  అపారమైన  సంతృప్తిని  కలిగివుంటావు " అని వరమిచ్చెను . పిమ్మట  కుబేరుడు తొడతో  " నీ  శిరస్సుపై  బంగారు ఱంగు  స్థిరముగా ఉందును . నీ  నీల  వర్ణము పోయి  సువర్ణాచాయను  పొందుతావు . " అని వరమిచ్చెను . ఈ  విధముగా  ఇంద్రాది దేవతలు అందరు ఆ  యజ్ఞోత్సవ  సమయములో  పశుపక్షాదులకు  వారములు ఇచ్చి తమతమ  భవనములకు  చేరిరి . 

రామాయణము ------------ఉత్తరకాండ ----------పదునెనిడవసర్గ -------------సమాప్తము . 

శశి,

ఎం.ఏ,ఎం.ఏ(తెలుగు)తెలుగు పండితులు . 










 

రామాయణము ఉత్తరకాండ----------పదిహేడవసర్గ

                                         రామాయణము 

                                                                                                                                                                                                                                                                                                                                 ఉత్తరకాండ----------పదిహేడవసర్గ 

రామా! రావణుడు  భూమండలమున తిరుగుతూ  హిమవత్పర్వత ప్రదేశమునకు వెళ్లి  అక్కడ  సంచరింపసాగెను . అతడు  అక్కడ  కృష్ణాజినము , జటలను  ధరించి  తపస్సు చేయుచున్న ఒక  సుందర   స్త్రీ ని  చూసేను . ఆమె ఒక  దేవతవలె  విరాజిల్లుచుండెను . అప్పుడు రావణుడు  ఎంతో  సుందరమైన  కన్య  దొరికినది కదా  అని  సంతోష పడుతూ  ఆమెతో  "  శుభాoగి ! ఇది ఏమి ? అద్భుతమైన  నీ యవ్వనముకు  విరుద్ధముగా  ఇట్టి  కఠినతరమైన  తపస్సుకు  పూనుకుంటివి ? నీవు ఇట్లు  తపస్సును  నిమగ్నమగుట  ఉచితము కాదు . నీవు ఎవరి  కుమార్తెవు ? ఈ కఠోర తపస్సును  ఆచరించుటకు  గల కారణము ఏమి ? " అని ప్రశ్నించెను . 
రావణుడి  మాటలు విన్న  ఆ సుందరాంగి  " మహాత్మా ! మా తండ్రి  కుశధ్వజుడు . ఆయన  బృహస్పతి  కుమారుడు . నా పేరు  వేదవతి . క్రమముగా  దేవతలు, గంధర్వులు, యక్షులు , రాక్షసులు , నాగులు , మొదలైనవారు  మా తడ్రివద్దకు వచ్చి నన్ను  వివాహమాడదల్చినట్లు  ప్రకటించిరి . కానీ మా తండ్రి  నన్ను  విష్ణువుకిచ్చి  వివాహము చేయవలెనని  ఉద్దేశముతో  ఆరందరిని   తిరస్కరించిరి .  ఈ వార్తలన్నీ  విన్న దంభుడు అనే దైత్యుడు రాత్రివేళ  రహస్యముగా  మా ఇంటికి  వచ్చి  నిద్రించుచున్న  మా తండ్రిని  హతమార్చెను .  మా తండ్రికి  అగ్నిసంస్కారములు  చేయునపుడు  మా తల్లిగారు  సహగమనము  చేసెను . ఆ విధముగా  ఒంటరినిఅయ్యిననెను  మా తండ్రి  ఆశ  నెరవేచుటకై  ఇచటకు వచ్చి  విష్ణువుగూచి  తపస్సు చేయుచున్నాను . 
పులస్త్యా  వంశజా ! నా తపఃప్రభావమున  నీవెవరో  నీ మనస్సులోని  ఆంతర్యమేమిటో  గ్రహించాను  . ఇక  నీవు వెళ్ళవచ్చు  " అని పలికింది . 
అప్పుడు రావణుడు  ఓ సుందరాంగి  నీవు  గర్వితురాలుగా  కనపడుచున్నావు . కనుకనే  ఈ విధముగా  మాట్లాడుచున్నావు . నేను లంకాధిపతిని  నన్ను  దశగ్రీవుడు  అందిరి . నన్ను వివాహము చేసుకొని  సమస్త భోగములను  హాయిగా అనుభవింపుము . ఎవరా  విష్ణువు ? భళా పరాక్రమములో  తపశ్శక్తిలో  వైభవములో  అతడు  నాకు  సమానుడు  కాడు ." అని ఆమెను ఒప్పించ ప్రయత్నించెను . అప్పుడు ఆమె  " రాక్షసేన్ద్రా! నీవు ఈ  విధముగా  పలుకుట  ఏమాత్రము  తగదు . శ్రీ  మహావిష్ణువు  త్రిలోకాధిపతి . సకల  లోకముల  వారు  ఆయనకు  ప్రణమిల్లెదరు . " అని పలికెను . అప్పుడు రావణుడు  మిక్కిలి  కోపంతో వేదవతి  జుట్టు  పట్టుకొనెను . అందులకు కోపించిన  ఆమె  తన  చేతినే  ఖడ్గముగా  చేసుకొని  తన  జుట్టును  నరికివేసుకొనెను . పిమ్మట ఆమె  ప్రాణత్యాగమునకు  సన్నద్ధురాలై  తన  తపశ్శక్తిచే  అగ్నిని ప్రజ్వలింపచేసి దహించి వేయునట్లుగా  చూచుచూ " నీచుడా  నన్ను నీవు  తీవ్రముగా  అవమానపరిచినందుకు ఇక నేను  జీవించి  ఉండను  నీవు చూచు  చుండగానే  అగ్నికి ఆహుతి  అయ్యెదను . నన్ను అవమానించిన  కారణముగా  నిన్ను  హతమార్చుతద్వారా  పగతీర్చుకొనుటకై  మరల జన్మించెదను .  పాపాత్ముడైన పురుషుడని  ఒక స్త్రీ  తన శరీర  శక్తిచే  చంపజాలదు . నా తపః ప్రభావముచే   నిన్ను భస్మము  చేయగలను  కానీ  అందులకు నా తపశ్శక్తిని  వ్యర్థము  చేయను . నా  తపఃప్రభావమున  అయోనిజ నయి  సాద్విలక్షణములు కలిగి  ఒక దారమాత్ముడికి  కుమార్తెను అయ్యేదను " అని  పలికి  ఆమె  అగ్నికి  ఆహుతి అయ్యెను .  ఆ సమయములో  ఆకాశమునుండి  పూలవాన  కురిసేను . 
ఆ  వెధవతియే  మరల  బాలికగా  ఒక  పద్మమునందు  ఆవిర్భవించెను .  పిమ్మట  ఆ బాలిక  మునపటివలె  రావణుడి చేతికి  చిక్కెను . రావణుడు  ఆమెను తీసుకొని  లంకా నగరమునకు వెళ్లి  జ్యోతిష్యము బాగుగా  తెలిసిన  తన మంత్రికి  చూపించెను .  సాముద్రికా  లక్షణములను  బాగుగా  గమనించిన  ఆ  మంత్రి  రావణుడితో  రాక్షస రాజా ! అందచందాల  ఈ  బాలిక  నీ ఇంట ఉన్నచో  నీకు చావు తప్పదు  "  అని పలికెను  . అప్పుడు  రావణుడు  ఆ  బాలికను  సముద్రములో పారవేసెను . అప్పుడు ఆమె భూమికిచేరి  భూమిలో ఉండిపోయెను . జనక  మహారాజు  యజ్ఞమునకై  భూమిని  దున్నుచుండగా  పవిత్రురాలైన  ఆ బాలిక  నాగలి చాలున దొరికెను . అప్పుడా  మిథిలా  నగర ప్రభువు  ఆమెను  తన కుమార్తెగా  పెంచనారంభించెను . ఆమెయే  నీ భార్య  సీతా . అవతార పురుషుడవైన  నీవు ఆ శ్రీ  మహావిష్ణువువు  ఆ విధముగా  రావణుడు  వేదవతి  యొక్క  ఆగ్రహముకు  గురియై  తన  నాశనమును  తానే కొనితెచ్చుకున్నాడు . 

రామాయణము ---------ఉత్తరకాండ ----------పదిహేడవసర్గ ----------సమాప్తము . 

శశి,

ఎం.ఏ,ఎం.ఏ (తెలుగు), తెలుగుపండితులు . 

















Thursday 14 May 2020

రామాయణము ఉత్తరకాండ -------- పదహారవసర్గ

                                             రామాయణము 

                                               ఉత్తరకాండ --------పదహారవసర్గ 

అగస్త్యుడు  ఇంకా  ఇలా చెప్పుచున్నాడు " రామా! రావణుడు  కుబేరున్ని  జయించిన పిమ్మట  అక్కడే గల  శరవణ  వనమునకు  విమానముపయు వెళ్లెను . అది కుమారస్వామి  జన్మించిన ప్రదేశము .  పిమ్మట  ఇంకా  ముందుకు సాగెను .  రమ్యమైన  వనములతో ఉన్న  ఒక పర్వతము పైకి  చేరిన పిమ్మట  విమానము  అక్కడే  గాలిలో  నిలిచిపోయెను  అది చూసిన  రాక్షస రాజు ' మంత్రులారా ! ఈ విమానము  ఇంత వరుకు  నా ఆదేశానుసారం  పయనించింది . కానీ ఇప్పుడు  నా ప్రమేయము లేకుండానే  ఆగిపోయింది .  దీనికి కారణము ఏమై ఉంటుంది . ఒక వేళ ఈ పర్వతముపై  దీనికి  అడ్డంకులు ఏమైనా ఉన్నవేమో  చూసిరండు '  అని  పలికెను .  అప్పుడు మారీచుడు  తన ప్రభువుతో " రాజా ! ఏ కారణము లేకుండా  ఈ పుష్పకము ఇలా  ఆగిపోదు .  ఇది కుబేరుడి యొక్క  వాహనము .  కనుక అతని ఆదేశము ప్రకారమే  ఇది  నడుచును . బహుశా  ఈ పుష్పకములో  కుబేరుడు లేక పోవుటచే ఇది  ఆగిపోయి ఉండవచ్చును " అని పలికెను . 
ఇంతలో  పరమేశ్వరుడి  అనుచరుడైన  నందీశ్వరుడు  ఆ శిఖరము  పైకి వచ్చెను . అతడు  పొట్టిగా  వికృతముగా  ఉండెను . ఆ నందీశ్వరుడు  రావణునితో " దశగ్రీవా! ఈ  పర్వతముపై  సంఖరుడు , పార్వతీ దేవితో కలిసి  విహరించుచున్నారు . ఇచటికి  నాగ , యక్ష, గరుడ,గాంధర్వ ,దేవ , దానాలు  మొదలగు  ఏ  ప్రాణులను  ఈ పర్వతము మీదికి  వెళ్ళరాదు . కనుక  వెనుతిరుగుము . లేనిచో  నీకు నాశనము తప్పదు . " అని హెచ్చరించెను . నందీశ్వరుని  మాటలు  వినిన వెంటనే రావణుడు మిక్కిలి  కోపంతో ' ఎవడీ  శంకరుడు ?'అని  పలుకుచూ  విమానము  పై నుండి  శిఖరము  పైకి  దిగెను . అక్కడ   శూలపాణి  ఐ  అపార శంకరుని  వాలే ఉన్న  నందీశ్వరుడిని  చూసేను . రావణుడు  వానర  ముఖంతో  ఉన్న  నందిని  చూచి  ఎగతాళిగా  వికటాట్టహాసము చేసెను.  దానికి  కోపించిన నందీశ్వరుడు  "  దశాననా!  నా వానర  ముఖమును చూసి  గెలిచేయుచూ  పెద్దగా  నవ్వితివి  కావున  నా వంటి రూపము గల  వానరులు  నిన్ను  నీవంశమును  నాశనము చేయుటకై జన్మింతురు . నాకములు  దంతములు,ఆయుధముగా  చేసుకొని  నీ బలగర్వములను  రూపుమాపెదరు .  అంతే కాక నిన్ను  నీ అమాత్యులను  , నీ బంధుమిత్రులను , పరివారమును నుగ్గునుగ్గుచేసెదరు . వారి దాకా  ఎందుకు  ఇప్పుడు  నేనే  నిన్ను  సంహరించి  వేయగలను  . కానీ  నీ దుష్కర్మల  ఫలితముగా   నీవు ఇప్పటికే  మృతతుల్యుడివి . " మహాత్ముడైన  నందీశ్వరుడు   ఈ విధముగా  పలుకగా  దేవదుందుభులు  మ్రోగినవి . ఆకాశము  నుండి  పూలవాన  కురిసినది . 
దశాననుడు  నందీశ్వరుని  మాటలు  లెక్క చేయక  కైలాస  పర్వత  సమీపమునకు  చేరి  పెద్దగా  "  శంకరా !  నీ కారణుమగా  నా  పుష్పక  విమానము  ఆగిపోయినది .  కనుక  నీ ఈ  పర్వతమును  పెకలించివేసెదను . " అని అరిచి  పర్వతము  యొక్క  కింది భాగమును  తన  భుజములను  ఆనించి  దానిని  పైకి  ఎత్తుటకు  ప్రయత్నించెను . అప్పుడు  ఆ పర్వతము  కంపించ సాగెను . ప్రమదగణములు  కంపించెను.  పార్వతికూడా  చలించి. పరమేశ్వరుడిని  గట్టిగా  పట్టుకొనెను .  అప్పుడు  పాపాత్ములను  శిక్షించు వాడు  ఐన   పరమేశ్వరుడు  తన  కాలి  బొటని  వేలితో  ఆ శైలమును  అదిమెను .  ఆ  ఒత్తిడి  వలన  కొండా  క్రింద ఉన్న  రావణుడి బాహువులు నలిగిపోయినవి .  భుజముల నొప్పి  భరించలేనంతగా  ఉండగా  ఆ రాక్షసుడు  బిగ్గరగా  ఒక పొలికేక  పెట్టెను . ఆ  భయంకర  నాదమునకు  ముల్లోకములు  గడగడలాడినవి .   అప్పుడు విలవివిలలాడుతున్న  రావణుడితో  అతని మంత్రులు " రాజా !  దేవదేవుడు  ఐన  పరమేశ్వరుడిని  స్తోత్రములతో  సంతోష  పరుచుము .  ఇప్పుడా  స్వామిని  సారాను వేడుట తప్ప  మరొక  మార్గములేదు . 
ఆ  అమాత్యుల  మాటలకు సమ్మతించి  రావణుడు   శంకరునకు  ప్రణమిల్లి , సామవేదమంత్రములతో, వివిధ  స్తోత్రములతో , ఒక  వేయి  సంవత్సరములపాటు  పరమేశ్వరుడిని  ఆర్తితో  కీర్తించెను . అప్పుడు  ఆ మహాదేవుడు  ప్రీతుడై  అతని భుజములనుండి  శైలమును  తప్పించి " దశాననా  నీ  సౌర్య   పరాక్రమములకు  మెచ్చితిని  . నీవు  చేసిన  భీకర ధ్వనికి  ముల్లోకములు  గడగడలాడినవి .  కనుక  నేటి నుండి  నీవు  రావణుడు  అనే పేరుతో  పిలవపడతావు . నీవు  వెళ్లుటకు  అనుమతి ఇచ్చుచున్నాను  " అని  పలికెను .  అప్పుడు రావణుడు  " మహా దేవా ! నీవు  సంతుష్టుడ  వైనచో  నాకు  ఒక వరమును  ప్రసాదింపుము . నాకు  బ్రహ్మదేవునివలన  దీర్గాయువు  లభించినది . నేను  అకాలమరణము పొందకుండా  నన్ను అనుగ్రహించుము . అదేవిధముగా  నాకు  ఒక  మహాత్రమును  ప్రసాదించుము . " అని వేడుకొనెను .  అప్పుడు పరమేశ్వరుడు  అతనికి  కాంతులు  విరజిమ్మిచున్న  చంద్రహాసము  అనే పేరుకల  ఒక  ఖడ్గమును  ప్రసాదించి " రావణా!  ఎప్పుడు ఈ  ఖడ్గమును  అవమాన పరుచురాదు . ఎప్పుడైనా  దీనిని  పూజించుటలొ  అశ్రద్ధ  చోపినట్లైతే   ఇది మళ్ళీ  నా వద్దకే  వచ్చి చేరును " అని చెప్పెను . అప్పడు  రావణుడు  మహాదేవుడికి  ప్రణమిల్లి  అక్కడ నుండి వెడలిపోయెను . 
అనంతరము  రావణుడు  భూమిపై  సంచరించుచు  క్షత్రియులను  బాధింపసాగెను .  బల పరాక్రమ వంతులైన  కొందరు  క్షత్రియులు  రావణుడిని ఎదిరించి  సపరివారంగా  నశించిరి . ఇతర  రాజులు  తమ  పరాజయము  ఒప్పుకొని  రావణుడికి  లొంగిపోయిరి . 

రామాయణము -----------ఉత్తరకాండ ---------- పదహారవసర్గ---------సమాప్తము . 

శశి, ఎం.ఏ,ఎం.ఏ(తెలుగు), తెలుగుపండితులు .