Monday 11 May 2020

రామాయణము ఉత్తరకాండ --------మూడవసర్గ

                                       రామాయణము 

                                         ఉత్తరకాండ --------మూడవసర్గ 

పులస్త్యుని సుతుడైన  విశ్రవసుడు కూడా అచిరకాలంలోనే  తండ్రివలె  తపోనిష్ఠ కలవాడయ్యెను . భరద్వాజముని ఇతనియొక్క సత్ప్రవర్తన  గురించి తెలుసుకొని తనకుమార్తె  అగు  దేవర్ణిని  ని  అతడికి ఇచ్చి పెళ్ళిచేసెను . వీరికి 
మిక్కిలి శక్తీ సంపన్నుడు ధర్మజ్ఞుడు  అయినా ఒక కుమారుడు  జన్మించెను . అప్పుడు పులస్త్యుడు  తన దివ్యదృష్టితో చూసి  ' ఇతడు  దానాధ్యక్షుడు కాగలడు  అని భావించి  వైశ్రవణుడు  అనే పేరుపెట్టెను . ప్రశాంతమైన  ఆశ్రమ వాతావరణము  పెరిగిపెద్దవాడైన  వైశ్రవణుడు  అక్కడే  వేయి  సంవత్సరములు  పాటు తపస్సు చేసెను .  ఆ  గోర తపస్సుకు  సంతృప్తుడై  బ్రహ్మ దేవుడు ఇంద్రాది దేవతలతో సహా వైశ్రవణుడికి ప్రత్యక్షమై  "  వత్సా  ! నీవు  చేసిన తపస్సుకు నేను సంతుష్టుడను అయ్యెను .  వారములు  కోరుకో  " అని పలికెను . అప్పుడు  వైశ్రవణుడు  " పూజ్యుడా నన్ను లోకపాలకునిగా  అశేషనిధులకు అధిపతిగా చేయుము .  " అని పలికెను . అప్పుడు సంతోషముతో బ్రహ్మదేవుడు  వత్సా ! యముడు , ఇంద్రుడు, వరుణుడు , అను వారితో సమానముగా  నీవు కోరుకున్న  లోక పాలత్వమును  అనుగ్రహించుచున్నాను .  ధర్మగ్యా  దీనితో పాటు  ధనాధ్యక్షతను కూడా       స్వీకరించుము .  నాయనా  ఇక్కడ గల ఈ విమానము పేరు పుష్పకవిమానము . దీనిని నీవు సంచరించుటకై ఇచ్చుచున్నాను . నేటి నుండి నీవు దేవతలతో సమానుడవి  అవుతావు . నీకు శుభమగుగాక . " అని పలికి తమ లోకములకు  వెళ్లెను . 
అప్పుడు  వైశ్రవణుడు తండ్రితో " తండ్రీ ! బ్రహ్మదేవుని వలన  నాకు ఇష్టమైన  వరములను  పొందితిని  కానీ  ఆ పితామహుడు  నాకు నివాసమును మాత్రము చూపలేదు .  మహాత్మా ! ఏ  ప్రాణికి ఎట్టి భాధా లేని ప్రశాంతమైన ప్రదేశమును నాకు తెల్పును " . అని పలికెను . అప్పుడు విశ్రవసుమహర్షి  " నాయనా!  దక్షిణ తీరమున త్రికూటము అను పర్వతము కలదు . ఆ గిరిపై  విశాలమైన రమ్యమైన , లంకా నగరము కలదు .  రాక్షుసులు నివసించుటకై విశ్వకర్మ దానిని నిర్మించెను . అక్కసి రాక్షసులు విష్ణువు వలన భయకంపితులై పాతాళమునకు పారిపోవుటచే ,  అది కాలిగా ఉంది . కావున  అక్కడ నీవు హాయిగా ఉండవచ్చును . "  అని పలికెను . 
తండ్రి వచనములు విని వైశ్రవణుడు లంకా నగరములో నివసించ సాగెను వేలకొలది  యక్ష రాక్షసులు ఆయనను సేవించసాగిరి   ధనాధ్యక్షుడైన వైశ్రవణుడు ( కుభేరుడు) తన తల్లి తండ్రులను  దర్శించుటకై అప్పుడప్పుడు పుష్పకవిమానముపై వెళ్లివచ్చుచుండెడివాడు . ఆ ధనాధిపతిని  దేవతలు, గంధర్వులు ప్రశంసించుచుండెడివారు . అతని భవనము నిరంతరము అప్సరసల నృత్య విలాసములతో విరాజిల్లు చుండేది . 

రామాయణము --------ఉత్తరకాండ ---------మూడవసర్గ -----------సమాప్తము . 

శశి , ఎం.ఏ,ఎం.ఏ (తెలుగు ) , తెలుగుపండితులు . 















No comments:

Post a Comment