Sunday 10 May 2020

రామాయణము యుద్ధకాండ -నూటముప్పదియొకటవసర్గ

                                     రామాయణము 

                              యుద్ధకాండ -నూటముప్పదియొకటవసర్గ 

భరతుడు వినయముతో అంజలి ఘటించి  శ్రీరాముతో "అన్నా !ఈ రాజ్య పాలనను న్యాసముగా నాకు అప్పగించితివి . దానిని ఇప్పుడు నీకు యధా స్థితిలో తిరిగి అర్పిస్తున్నాను . అన్నా !గుఱ్ఱము యొక్క వేగమును గాడిద అందుకోలేదు . హంస యొక్క సుందర నడకను ,కాకి అనుసరించలేదు . శత్రువులను అదుపు చేయగల మహావీరా !అలాగే రాజ్య రక్షణమునందు నీకు కల సామర్ధ్యము నాకు లేదు "అని పలికెను . 
అప్పుడు శ్రీరాముడు భరతుని వినమ్ర వచనములు విని 'తధాస్తు 'అని పలికి ఒక చక్కని ఆసనంపై కూర్చుండెను . అప్పుడు శత్రుజ్ఞుని ఆజ్ఞపై క్షుర కర్మలో నిపుణులు అక్కడికి వచ్చిరి . ముందుగా మిక్కిలి బలశాలురైన బరతలక్ష్మణ శత్రుజ్ఞులు అభ్యంగనస్నానము చేసిరి . పిదప సుగ్రీవుడు ,విభీషణుడు స్నానాదికములను ముగించుకొనిరి . అనంతరము శ్రీరాముని జటలకు చిక్కులు తీసి ,కేశ సంస్కారములు చేసిరి . అభ్యంగన స్నానానంతరం ఆ స్వామికి చక్కటి హారములను ,వస్త్రములను అలంకరించిరి . కస్తూరి మున్నగు సుగంధములతో మైపూతలు పూసిరి . పిదప దశరధుని పత్నులు అందరూ సీతాదేవిని చక్కగా అలంకరించిరి . కౌసల్యా దేవి పట్టుపట్టి వానర పత్నులందరిని సుందరముగా అలంకరించింది . పిమ్మట శత్రుజ్ఞుని సూచనపై సుమంత్రుడు అను రధసారధి రధమును సర్వాంగ సుందరముగా సిద్ధపరచిరి . ఆ రధమును రాముని దగ్గరకు తీసుకు వచ్చిరి . శ్రీరాముడు ఆ దివ్య రధమును అధిరోహించెను . భరతుడు సారధిని తప్పుకోమని తానే ఆ రధమును నడిపెను . శత్రుఘ్నుడు శ్రీరాముని శిరస్సుపై ఛత్రమును పట్టెను . లక్ష్మణుడు ,విభీషణుడు చెరిఒక వింజామరను పట్టుకుని విసురుచుండెను . మహర్షులు ,మరుద్గణములతో కూడిన దేవతలు శ్రీరాముని పొగుడుతుండగా ఆ మాటలు స్పష్టముగా అక్కడి వారందరికీ వినిపించెను . 
సుగ్రీవుడు శత్రుంజయము అనే గజమును అధిరోహించి ఆ రధమును అనుసరించెను . వానరులందరూ తొమ్మిదివేల ఏనుగులపై ఆ రధము వెనక వచ్చుచుండిరి . శ్రీరాముని వెనక వచ్చుచున్న అయోధ్యా వాసుల హర్షద్వానాములతో వీధులు దద్దరిల్లుచుండగా ,శంఖారావములతో ,దుందుభులు ధ్వనులతో ఎంతో చక్కటి అయోధ్యా వీధులలోకి శ్రీరాముడు ప్రవేశించెను . అప్పుడు వశిష్టాదులు శ్రీరామునికి ఎదురువచ్చి స్వాగతము పలికిరి . అక్షింతలతో కొందరు ,బంగారు పాత్రలతో ఇంకొందరు లడ్లు మొదలగు మధుర పదార్ధము చేతపట్టుకొనిన ప్రజలు ,ద్విజులు ,గోవులు ,కన్యలు శ్రీరామునికి ముందు భాగమున నడిచిరి . ఆ విధముగా శ్రీరాముడు ఎంతో వైభవోపేతముగా అయోధ్యా నగరంలోకి ప్రవేశించి ,దశరధుని భవనంలోకి ప్రవేశించెను . 
అప్పుడు శ్రీరాముడు భరతునితో  ముత్యములు ,వైడూర్య మణులతో పొదగబడిన తన మందిరమును ,సుగ్రీవునికి విడిదిగా ఇవ్వమని చెప్పెను . భరతుడు అన్న ఆజ్ఞ ప్రకారము సుగ్రీవుని చేయిపట్టి తీసుకువెళ్లి శ్రీరాముని మందిరమున ఉంచెను . శత్రుఘ్నుడు ఆ మందిరమును చక్కగా అలంకరింపచేసెను . అప్పుడు భరతుడు సుగ్రీవునితో "సుగ్రీవా !శ్రీరామచంద్రప్రభువు పట్టాభిషేకము కొరకై జలములను తీసుకువచ్చుటకు మీ వీరులను ఆజ్ఞాపింపుము "అని పలికెను . అప్పుడు సుగ్రీవుడు అట్లే చేసెను . సుషేణుడు రత్నఖచితమైన ఒక బంగారు కలశములో తూర్పు సముద్రము నుండి జలములను నింపుకుని వచ్చెను . ఋషభుడు దక్షిణ సముద్రము నుండి ,గవయుడు పశ్చిమ సముద్రము నుండి ,నలుడు ఉత్తర సముద్రము నుండి నీటిని బంగారు కలశములలో నింపుకుని వచ్చెను . శత్రుఘ్నుడు ఆ జలములను ప్రధాన పురోహితునికి ఇచ్చెను . 
వంశపురోహితుడైన వసిష్ఠుడు బ్రాహ్మణులతో కూడి ,సీతాసహితుడైన శ్రీరాముని రత్న సింహాసనంపై ఆసీనుని కావించెను . వసిష్ఠుడు ,వామదేవుడు ,జాబాలి ,కాశ్యపుడు ,కాత్యాయనుడు ,సుయజ్ఞుడు ,గౌతముడు ,విజయుడు మొదలగు మహర్షులు శ్రీరామచంద్రప్రభువుని నిర్మలములైన సుగంధ జలములతో అభిషేకించిరి . ఆకాశమున నిలిచి వున్న దేవతలు  ,గంధర్వులు ,కిన్నెర కింపురుషులు ఓషధీ రసములతో సీతారాములను అభిషేకించిరి . పూర్వము బ్రహ్మదేవుడు రత్నఖచితమైన ఒక కిరీటమును నిర్మించి ,మనువుకు ఇచ్చెను . మను వంశ రాజులందరూ ఆ కిరీటముచేతనే పట్టాభిషిక్తులయిరి . ఇప్పుడు శ్రీరాముని కి కూడా ఆ కిరీటమును అలంకరింపచేసిరి . 
అప్పుడు దేవేంద్రుడు స్వయముగా వచ్చి నూరుపద్మములతో మెరియుచున్న బంగారుమాలను ,ముత్యాలహారమును శ్రీరామునికి ఇచ్చెను . ఆ సమయములో దేవతలు ,గంధర్వులు గానము చేసిరి . అప్సరసలు నృత్యము చేసిరి . అప్పుడు శ్రీరాముడు లక్షల గోవులను ,బ్రాహ్మణోత్తములకు దానము చేసెను . ముప్పయి కోట్ల బంగారు ఆభరణములను ,వివిధ ఆభరణములను ,వస్త్రములను బ్రాహ్మణులకు ఇచ్చెను . అప్పుడు శ్రీరాముడు మణులు పొదిగిన ఒక బంగారు ఆభరణమును సుగ్రీవునికి ఇచ్చెను . రత్నములతో వైడూర్యములతో పొదగబడిన రెండు భుజకీర్తులను అంగదునికి ఇచ్చెను . మేలైన మణులతో కూడిన ఒక ఆభరణమును సీతాదేవికి ఇచ్చెను . సీతాదేవి దివ్యమైన వస్త్రములను ఆభరణములను మారుతికి ఇచ్చెను . పిమ్మట తన మెడలోని కంఠాభరణమును తీసి హనుమకు ఇచ్చెను . మైందునుకు ,ద్వివిదునకు ,నీలునకు ,జాంబవంతునకు వారి అభిరుచులకు అనుగుణముగా వానరులందరి నూతన వస్త్రాభరణములతో తగిన రీతిగా శ్రీరాముడు సత్కరించెను . తాము కోరుకున్న రీతిలో పుష్కలముగా రత్నాభరణములు మొదలగు వాటిచే సత్కరింపబడిన ఆ వానర ప్రముఖులు సంతోషముతో శ్రీరామునకు నమస్కరించి ,ఆ స్వామీ అనుమతితో కిష్కింధకు బయలుదేరిరి . విభీషణుఁడు సీతారాములను హృదయములో నిలుపుకుని లంకకు బయలుదేరెను . దుష్టులను శిక్షించేవాడు ,మిక్కిలి పేరుప్రతిష్టలు కలవాడు ,ఉదారస్వభావుడు అయిన రఘురాముడు కొసలరాజ్యమును పరిపాలించసాగెను . 
" యువరాజ పదవిని సవీకరింపుము అని శ్రీ  రాముడు  ఎంతగా బతిమాలినను  లక్ష్మణుడు  ఒప్పుకొనలేదు . అప్పుడు  శ్రీ రాముడు  భరతుడిని యువరాజుగా పట్టాభిషిక్తుణ్ణి  చేసెను .  ఆ రాజశ్రేష్ఠుడు , పౌడరీకము  , అశ్వమేధము , వాజపేయము , ఇంకా  అనేకరకములగు  యజ్ఞములను  తఱచుగానిర్వహించుచుండెను.  శ్రీ రాముడు రాజ్య పరిపాలన చేయుచుండగా స్త్రీ లకు వైధవ్యము  లజుండెను ప్రజలకు  క్రూరమృగముల భాద లేకుండెను . దొంగల భయము లేకుండెను . ప్రజలు  రోగగ్రస్తులు  కాకుండిరి . పెద్దలు  బ్రతికి ఉండగా పిల్లలు  మృత్యువు పాలు కాకుండిరి .  రామరాజ్యములో ప్రజలందరూ ధర్మ నిరతులై   శాంతిషముతో  జీవించుచుండిరి . వారు శ్రీ రాముని ధ్యానించుచూ ,  పరస్పర విరోధము లేక ఆత్మీయముగా  ఉండిరి .  ఎవ్వరి నోటా వినను రామ  నామము  రాముని గాధలే  వినుపించుచుండెను . శ్రీ రాముడి తన సోదరులతో కలిసి పదకొండువేలసంవత్సములు  రాజ్యమును  పరిపాలించెను . 
వాల్మీకి రచించిన రామాయణము  శుభప్రదమైనది  ఆయురాయోగ్యములను , కీర్తి ప్రతిష్టలను  పెంపొందించునది , 
లోకమున ఈ కావ్యము పఠించువారు , విన్న వారు , సర్వపాపములనుండి విముక్తులగుదురు . శ్రీ రామ పట్టాభిషేక ఘట్టమ విన్నవారికి  సంతానము కలుగును  సంపదలు ప్రాప్తించును . రాజులు శత్రువులను జయించి  భూమిని పరిపాలించెదరు . శ్రీ రాముని అను గ్రహమున వారి కోరికలన్నీ నెరవేరును . వాల్మీకి మహర్షి రాసిన రామాయణమును  భక్తితో రాసినవాడు  తప్పక  స్వర్గ సుఖములను  పొందెదరు . 


రామాయణము ------------------యుద్ధకాండ -----------------సమాప్తము

శశి,ఎం.ఏ,ఎం.ఏ (తెలుగు ), తెలుగు పండితులు .  



















No comments:

Post a Comment