Friday 15 May 2020

రామాయణము ఉత్తరకాండ -పందొమ్మిదవసర్గ

                                                రామాయణము  

                                                 ఉత్తరకాండ -పందొమ్మిదవసర్గ 

రావణుడు మరుత్తురాజును జయించిన పిమ్మట ,దేవేంద్రుడు ,వరుణుడు తో సమానమైన బలపరాక్రమములు కల రాజులను చేరి వారిని యుద్ధమునకు ఆహ్వానించెను . వారందరూ తమలోతాము ఆలోచించుకుని యుద్ధము చేయకనే ఓడిపోయినట్లు ఒప్పుకొనిరి . అనంతరము రావణుడు అయోధ్యను చేరెను . అప్పుడు అనరణ్యుడు అను మహారాజు అయోధ్యకు రాజు . అతడు రావణుడి యుద్ధవార్తలు తెలిసి ముందుగానే సైన్యమును సిద్దము చేసుకొని ఉంచెను . రావణుడు వచ్చిన విషయము తెలుసుకుని తన సైన్యముతో సహా యుద్ధమునకు వచ్చి ,రావణుని ఎదిరించెను . 
అనరణ్యుని పరాక్రమము తట్టుకోలేక రావణుడి మంత్రులైన మారీచుడు ,శుకసారణులు ,ప్రహస్తుడు మొదలగువారు పలాయనం చిత్తగించిరి . పిమ్మట రావణుడు యుద్ధమునకు దిగి అనరణ్యుని సైన్యమును చిత్తుచేసెను . అనరణ్యుని కూడా తన అస్త్రశస్త్రములతో మిక్కిలి గాయపరిచేను . అయినను ఆ మహారాజు యుద్ధరంగమునుండి వెళ్లిపోక రావణుడితో "మహాత్ములకు పుట్టినిల్లయిన రఘువంశమునే అవమానపరిచితివి . కనుక నీకు శాపమును ఇచ్చుచున్నాను . నేను అర్హులకే దానధర్మములు చేసియున్నచో పరార్ధబుద్ధితో యజ్ఞయాగములను ఆచరించినచో ,కన్నబిడ్డలవలె ప్రజలను రక్షించుచున్నచో ,నా శాపము ఫలించుగాక !రావణా !ప్రసిద్ధమైన ఈ రఘువంశములో ఎందరో ప్రసిద్ధులైన మహానుభావులు ఉద్బవించిరి . అట్లే దశరధుని కుమారుడిగా మహాత్ముడైన శరీరాముడు అవతరించి నీ ప్రాణములు తీయగలడు . "అని శపించి ఆ మహారాజు మరణించెను . అనంతరము రావణుడు అక్కడినుండి వెళ్లిపోయెను . 

రామాయణము ఉత్తరకాండ పందొమ్మిదవసర్గ సమాప్తము . 

                        శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






No comments:

Post a Comment