Tuesday 26 May 2020

రామాయణము ఉత్తరకాండ -ముప్పదియెనిమిదవసర్గ

                                      రామాయణము 

                                       ఉత్తరకాండ -ముప్పదియెనిమిదవసర్గ 

మహాబాహువైన  రఘురాముడు ఇదేవిధముగా సభలో ఆసీనులై అందరిచే గౌరవింపబడుతూ పురజనులయొక్క జానపదులయొక్క,కార్యములను అన్నిటిని  పర్యవేక్షించుచూ  రాజ్యపాలన చేయుచుండెను . కొన్ని దినముల పిమ్మట తిరుగుప్రయామమునకు  సిద్దమైన  జనకమహారాజుతో శ్రీ రాముడు " మహారాజా ! అన్నివిధములుగా  నీవే మాకు పెద్దదిక్కు నీ సహాయ సహకారములతో అండదండలతో మేము ప్రశాంతముగా ఉంటిమి . మేము సమర్పించే రత్నాభరణాదికములు దయతో స్వీకరింపుము . నీ ప్రయాణమునందు భారతసత్ర్యజ్ఞులు వెంటవుంది తోడ్పడుదురు  " అని పలికెను . అప్పుడు జనకమహారాజు అందుకు సమ్మతించి శ్రీ రామునితో " అయోధ్యాపతీ! అపురూపమైన మీ దర్శనమునకు , వినయస్వభావములకును , నేను ఎంతో ముగ్దుడనైతిని . రాజా! నీవు మాకు బహూకరించే రత్నాధికములు అన్నింటిని హృదయపూర్వకముగా స్వీకరించెదను . ఆ సకల బహుమతులను మా అమ్మాయి సీతకు ఇచ్చివేయుచున్నాను ." అని పలికి అందరిని వీడ్కొని మిథిలకు  బయలుదేరెను . 
పిమ్మట శ్రీ రాముడు  ప్రయాణమునకు సిద్ధమైయున్న  భరతుని మేనమామ యగు యధాజిత్తు తో " రాజా! నరోత్తమా! నీవుమాకు ఆత్మీయబంధుడవు . మేము ప్రేమతో ఇచ్చే  సంపదలను , రత్నాభరణములను స్వీకరించుము . లక్ష్మణుడు  మీకు తోడుగా  వస్తాడు " అని పలుకగా యధాజిత్తు కూడా అట్లే అని " రఘునందనా! ఈ సంపదను , రత్నాభరములను మీ వద్దనే ఉంచుము " అని పలికి లక్ష్మణునితో కలిసి  పయనమయ్యెను . యధాజిత్తునకు వీడ్కోలు  పలికిన పిమ్మట శ్రీ రాముడు తనకుమిత్రుడైన  కాశీరాజఅయినటువంటి  ప్రతర్ధునిని అక్కున చేర్చుకొని " రాజా! నా రాజ్యాభిషేకం సమయమున నీవు భరతునితో కలిసి ఎంతో సహాయ సహకారములు అందించితివి ". అని పలికి కాశీరాజుకి వీడ్కోలు పలికాడు . పిమ్మట శ్రీ రాముడు తనకొరకై వచ్చిన మూడువందలమందిరాజులకుకూడా  వీడ్కోలు పలికెను . 

రామాయణము ఉత్తరకాండ ముప్పైఎనిమిదవసర్గ సమాప్తము . 

శశి,

ఎం.ఏ,ఎం.ఏ(తెలుగు)తెలుగుపండితులు . 









No comments:

Post a Comment