Friday 15 May 2020

రామాయణము ఉత్తరకాండ ----- ఇరువదిఐదవసర్గ

                                     రామాయణము 

                                ఉత్తరకాండ ----- ఇరువదిఐదవసర్గ 


రావణుడు లంకయొక్క  పశ్చిమద్వారమునకు  చేరువలో గల  నికుంభాల  వనంలోకి  తన  అనుచరులతో సహా ప్రవేశించెను .  తన కుమారుడైన మేఘనాధుడు  , కృష్ణాజినము , కమండలం , శిఖ  ధరించి ఒక యజ్ఞము  చేయుచుండగా  రావణుడు  చూసేను .  ఆ యజ్ఞము  రాక్షసగురువు  శుక్రాచార్యుడు  చేయించుచున్నాడు . అప్పుడు  రావణుడు  తన  కుమారుడైన మేఘనాధుని వద్దకు వెళ్లి  అతని ప్రేమతో  ఆలింగనము  చేసుకొని " నాయనా  ఏమి యజ్ఞము  చేయుచున్నావు  " అని అడిగెను . మౌనదీక్షలో  ఉన్న మేఘనాధుడు  మౌనంగా  ఉండెను . అప్పుడు  శుక్రాచార్ర్యుడు " మహారాజా! సకల సంపదల సంవృద్దికై ఆచిరింప బడుతున్న  యజ్ఞము ఇది .  అవి  అగ్నిష్టోమము , అశ్వమేధము , బహుసువర్ణకాము, రాజసూయము , గోమేధము , వైష్ణవము , మహీవరాయజ్ఞము . మొత్తము ఏడు . ఇతడు  వీటిని  భక్తి శ్రద్దలతో  ఆచరించి  పరమేశ్వరుడి అనుగ్రహముతో ' ఒక దివ్య విమానమూ , తామసి అను మయా విద్యను  బాణములు అక్షయముగా  సృష్టింపగల  రెండు తూణీరములు , ఒక చాపము , ఒక అస్త్రము 'పొందెను . " అని పలికెను . అప్పుడు రావణుడు  కుమ్మరా ! నేను జయించిన శత్రువులైన  దేవతలను  నీవు  పవిత్రద్రవ్యములతో పూజించుట ఏమి ? సరేలే  , ఇదీ  సత్కార్యమే  మనము ఇంటికి  వెళ్ళెదము . అని పలికి తన కుమారునితో, విభీషనుతో  సహా  తన  భావమునకు  చేరెను . 
పిదప రావణుడు  విమానంలో  బంధిపబడిన స్త్రీ  లందరిని కిందకు  దింపించెను .  వారందరు ఇంకనూ  కన్నీరు  కార్చుచూ  గద్గద స్వరములతో  ఏడ్చుచునే  ఉండిరి .  అది చూసిన విభీషణుడు  " సోదరా ! నీవు తీసుకు వచ్చిన ఈ  స్త్రీలను  హింసించుట తగదని  ఎరిగియు , శాస్త్ర మర్యాదలను  అతిక్రమించి ఇష్టం వచ్చినట్లు  ప్రవర్తించుచున్నావు . ఇలా  చేయుట  వలన  నీకు  అపకీర్తి  వచ్చును సంపదలు నశించును . వంశ  ప్రతిష్ట దెబ్బతినును.  ఇట్టి పాప కర్మలను  చేయవలననే  ఆలోచన  నీకు వచ్చుటకు  మనము  చేసిన పాపకర్మలే కారణము . మాల్యవంతుడు  మన తల్లి  కైకసికి  పెదతండ్రి  మనకు పూజ్యుడు . ఆయన  పుత్రిక అయినా  అనల కూతురు  కుంభీనసి  మన  సోదరులందరికి  చెల్లెలు . రాజా ! మధురాక్షసుడు  అనువాడు  ఆమెను  బలవంతముగా  అపహరించుకుని పోయెను . ఆసమయములో  మేఘనాధుడు  యజ్ఞదీక్షలో ఉన్నాడు . నేను  తపస్సు నిమిత్తమై  జలముల  మధ్యఉన్నాను .  కుంభకరుణుడు  గాఢమైన నిద్రావస్థలో ఉన్నాడు . మధు రాక్షసుడు  అదును చూసుకొని  ఎదిరించిన  మన మంత్రులను చంపి  నిద్రించుచున్న  కుంభీనసని  ఎత్తుకొనిపోయినాడు . తదుపరి ఆ విషయము  నీకు తెలిసిన్నప్పటికీ నీవు అతనిని  చంపక ఊరుకుంటివి . పెడ బుద్దితో  నీవు చేసిన ఆపనికి  ఫలితమే ఇది " అని పలికెను . 
విభీషణుడి మాటలు విన్న రావణుడు పశ్చాత్తాపపడుతూ నాలుగువేల అక్షౌహిణుల సైన్యముతో ,మేఘనాధుడితో కుంభకర్ణుడితో కలిసి  మధురాక్షసుడిని వధించుటకు  బయలుదేరేను . విభీషణుడు మాత్రము లంకలోని ఉండిపోయెను . పిమ్మట రావణుడు తన సైన్యముతో సహా మదుపురము చేరి అక్కడ తన సోదరి అగు కుంభీనస ను చూసేను . ఆమె తన అన్నను చూసిన వెంటనే అతడి పాదములకు ప్రణమిల్లెను . అప్పుడు రావణుడు ఆమె ను లేవనెత్తి "అమ్మా !బయపడకు  ఇప్పుడు నేను చేయవలసిన పని ఏమి ?"అని ప్రశ్నించెను . అప్పుడు ఆమె "అన్నా !నీవు నన్ను నిజముగా అనుగ్రహింపదలిచినచో నా భర్తను చంపవద్దు . నన్ను కనికరింపుము . "అని అర్దించెను . అప్పుడు రావణుడు కుంభీనసకు అభయము ఇచ్చి తన బావగారిని గూర్చి అడిగెను . వెంటనే సంతోషముతో కుంభీనస  నిద్రించుచున్న తన భర్త ను నిద్రలేపి తన అన్న వచ్చిన విషయము తెలిపెను . వెంటనే ఆ రాక్షసుడు రావణుని సమీపించి తగినవిధముగా గౌరవమర్యాదలు చేసెను . రావణుడు ఆ రాత్రికి అక్కడే బస చేసి మరునాడు ఉదయమే సైన్యముతో సహా కైలాసపర్వతమునకు వెళ్లెను . 

రామాయణము ఉత్తరకాండ ఇరువదియైదవసర్గ సమాప్తము . 

                 శశి ,

ఎం . ఏ ,ఎం .ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 


















No comments:

Post a Comment