Friday 1 May 2020

రామాయణము యుద్ధకాండ ----------నూటయారవసర్గ

                                         రామాయణము 

                                      యుద్ధకాండ ----------నూటయారవసర్గ 

తీవ్రముగా మృత్యుప్రేరితుడైన  రావణుడు  అజ్ఞానము  వలన  అత్యంత  క్రుద్ధుడై  కన్నులెర్రచేసి  సారధితో   "బుద్ది హీనుడా!  నన్ను బలహీనుడుగా , పిరికివాడగా  అస్ర్త కౌశలము  కోల్పోయినవాడగా ,  తలచి నన్ను అవమానించి  నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించితివి . నా అభిప్రాయము  తెలుసుకొనక  నా ఈ రధమును  దారి మళ్ళించితివి . నేను చిరకాలము  ఆర్జించిన కీర్తిని , పరాక్రమమును , తేజస్సును , నేడు నాశనము చేసితివి . 'రావణుడు ఎట్టి పరిస్థితిలోను యుద్ధము నుండి వెను  తిరిగడు ' అను లోక  విశ్వాసము   ఒమ్ము చేసావు .  దుర్మతి   నీవు శత్రువు నుండి  లంచము తీసుకొని  అతడికి  వసమైనావని  నా అనుమానము . లేనిచో  ఈ రధమును శత్రువు ఎదురు నుండి  పక్కకు మళ్లించేడి  వాడవు కాదు.   వెంటనే రధమును యుద్ధరంగమునకు  మరల్చుము " అని పలికెను . 
రావణుడు  పరుషంగా ఇట్లు  పలికిన పిమ్మట  ఎల్లప్పుడూ  అతని హితమునే కోరే ఆ సారధి తన  రాజుని అనునయించుచూ  ఇలా హిత వచనములు పలికెను .  " మహారాజా!  నేను భీతిల్లుట  లేదు,   శత్రువు యొక్క ప్రలోభములకు  లోబడిన వాడను కాదు .  ఏమర పాటుతో  లేను .  మీయందు గల గౌరవ భావము ఏ మాత్రము తగ్గలేదు . మీరు నాకు చేసిన  ఉపకారములు  మరువలేదు .  నేను ఇప్పుడు చేసిన పని  మీకు  అప్రియముగా  తోచవచ్చుఁ . కానీ  మీ హితము కోరే  నేను అలా చేసితిని . మహా సంగ్రామముయందు నీవు పూర్తిగా  అలసినట్లు  నేను గమనించాను . అప్పుడు నీలో  శత్రువును ఎదుర్కొనగలిగిన  యుద్ధోత్సాహము  గాని,   పరాక్రమము గాని  లేదు .  నీకు కొంత సేపు విశ్రాంతి అవసరము . నీ అలసటను దూరము చేయటానికే ఈ పని  చేసాను . మీ యందు నాకు గల భక్తి కారణంగానే  మీ క్షేమము కోరి ఈ పని చేసాను . శత్రు సంహారక ఇప్పుడు నేను ఏమి చేయవలనునో ఆజ్ఞాపింపుము .  . త్రికరణశుద్ధిగా  నీ ఆజ్ఞను శిరసావహించెదను" .  రావణుడు తనసారధి పలికిన  ఆ మాటలకు  ఎంతో సంతోషించాడు . రణకుతూహలుడైన  ఆ రావణుడు తన సారధిని  పెక్కు రీతులా  కొనియాడెను . "సారధి మన  రధమును వెంటనే  రామునకు  ఎదురుగా  పోనివ్వు . నేను రణమున  శత్రువులను హతమార్చనిదే  వెనుకకు మరలను" . అని పలికెను . 
రాక్షస రాజైన రావణుడు ఇట్లు పలికిన పిమ్మట  అతనికి తన  చేతికి ఉన్న మేలైన హస్తాభరణమును  బహూకరించెను . రావణుని ఆదేశానుసారం  సారధి రధమును యుద్ధరంగమునకు  మరల్చెను . అనంతరము రావణుని ఆజ్ఞ మేరకు గుఱ్ఱములను అదల్చెను . మరుక్షణమునే  ఆ రాక్షస రాజుయొక్క రధము రాముని ముందు నిల్చెను . 


రామాయణము -----------యుద్ధకాండ --------------నూటఅరవసర్గ -----------సమాప్తము  -------------------------

శశి , 
ఎం.ఏ,ఎం.ఏ (తెలుగు ) తెలుగు పండితులు. 

















No comments:

Post a Comment