Sunday 3 May 2020

రామాయణము, యుద్ధకాండ---------నూట పన్నెండవ సర్గ

                                       రామాయణము 

                                    యుద్ధకాండ---------నూట పన్నెండవ  సర్గ 

రాముడి చేతిలో  హతుడైన  రావణాసురుడు  భూమి మీద పడిఉండుట  చూసిన  విభీషణుడు  అంతులేని  శోకంతో  కృంగిపోవుచూ  " అన్నా ! మహా వీరుడవి,   పరాక్రమ  శాలివి  , సుప్రసిద్ధుడవి , విద్యావంతుడవి , రాజనీతి కోవిదుడవి , హంస తూలికా తలములపై శయనించుచుండెడివాడివి.   అట్టి నీవు  అసువులు  కోల్పోయి  ఇట్లు   భూమిపై  పడివుంటివి .  అయ్యో   ఇదివరలో  నీతో  హితవచనములు  పలికివుంటిని  కానీ  అప్పుడు కామ మోహపరుడవై ఉన్న  నీకు  ఆ మాటలు రుచింపలేదు  , అయ్యో  ఆ దుష్కార్యములు  ఫలితంగా  ఇప్పుడు  ప్రాణములు కోల్పోయినావు కదా " అని విలపించ  సాగెను . 
శోకంతో  ఇలా విలపిస్తున్న  విభీషణుడి తో శ్రీ రాముడు " విభీషణ !  మీ అన్న అయిన  రావణుడు పిరికిపందవలె   యుద్ధము నుండి  పారిపోలేదు .  యుద్ధము నందు  తీవ్రముగా  పరాక్రమము  చూపినాడు . ఇతని  రణోత్సాహము మహోత్తరమైనది . వీరునికు విజయమో , వీరస్వర్గమో  లభించుట తధ్యము  . కావున నీవు శోకమును త్యజించుము . మీ సోదరుడికి  చేయవలసిన  అనంతరకార్యముల  గురించి ఆలోచించుము ."  అని  పలికేను .  
శ్రీ రాముడు ఇలా పలుకగా  శోకసంతప్తుడైన  విభీషణుడు  .  తన సోదరునకు  చేయవలసిన  ఉత్తర  కర్మల గురించి  శ్రీ రాముడితో  ఇలా  పలికెను  .  రామా ! " నిత్యము  అగ్నికార్యములను  ఆచరించిన వాడు  మా సోదరుడు  ఇతడు గొప్ప  తపస్వి  వేదాంత వేత్త  యజ్ఞ యాగాదులను  ఆచరించువారిలో ప్రముఖుడు  . ఇతని  పుత్రులందరు  యుద్దములో  మరణించారు  విగత  జీవుడైన  ఇతడికి  నీవు దయతలచినచో ,  ప్రేతకార్యములను  నేనే  నిర్వహించాలనుకుంటున్నాను . " అని పలికెను . విభీషణుడు  పలికిన  దైన్యవచనములు  విని  ఉదారచరితుడైన  మహాత్ముడైన  శ్రీ రాముడు రావణునకు  స్వర్గాది  ఉత్తమ లోకములు  ప్రాప్తించుటకై  అంత్యక్రియలను  ఆచరించుటకు  విభీషణునకు , ఆజ్ఞ ఇచ్చి  ఇట్లు అనెను . విభీషణా !  వ్యక్తులు జీవించియున్నంతవరకే వైరములు ఉండవలెను . అనంతరము  ఆ వైరములను  త్యజింప వలెను . ఇప్పుడు  మన  కార్యము  నెరవేరినది . కనుక  ఇతనికి  అంతిమ సంస్కారములను  నెరపుము .  యితడు నీకు వలే నాకును  గౌరవార్హుడే . "అని పలికెను .  




 రామాయణము ---------యుద్ధకాండ -------- నూటపన్నెండవసర్గ ----------సమాప్తము . 


శశి, 
ఎం.ఏ,ఎం.ఏ,(తెలుగు ) , తెలుగు పండితులు . 


























No comments:

Post a Comment