Monday 25 May 2020

రామాయణము ఉత్తరకాండ - ముప్పదినాలుగవసర్గ

                                      రామాయణము 

                                      ఉత్తరకాండ - ముప్పదినాలుగవసర్గ 

రావణుడు లోకముల బలశాలి ఐన మనుష్యుడు గురించిగాని , రాక్షసుడి గురించిగాని తెలిసిన వెంటనే అతడు మీదకు యుద్ధముకు వెళ్లసాగెను . అలా  రావణుడు ఒకసారి వాలి పాలనలో ఉన్న కిష్కిందా నగరమునకు యుద్ధమునకు వెళ్లెను . అప్పుడు తారుడు సుషేణుడు యువరాజైన సుగ్రీవుడు రావణుడితో " రాక్షసరాజా ! మా ప్రభువైన వాలి కిష్కిందానగరములో లేడు . మా వాలి నాలుగు సముద్రజలములతో సంధ్యోపాసనచేసి శీఘ్రముగానే ఇక్కడికి వస్తాడు . అప్పటి వరుకు ఇక్కడే వేచిఉండుము . రాక్షసరాజా ! ఇక్కడ గుట్టలుగా  పడిఉన్న  ఎముకల  గూడులను చూడుము . నీవలె యుద్దానికై వచ్చిన  పలువురు మహావీరులు  వీలిబలపరాక్రమములప్రభావమునకు మృతులైరి . ఈ  అస్థిపంజరములన్నియూ వారివే -అతనితో యుద్ధమునకు తలపడినచో నీకును ఇట్టి గతియే పట్టును . మృత్యు ముఖమును చేరుటకు నీకు తొందరగా ఉన్నచో దక్షిణసముద్రము కడకు వెళ్లుము . వాలి నీకు అక్కడ దర్శనమిచ్చును . "అని పలికెను . 
వానరవీరులు ఎంతగా హెచ్చరించుచున్నప్పటికీ ,రావణుడు వినిపించుకొనక పుష్పకముపై ఎక్కి దక్షిణసముద్రమునకు చేరెను . అక్కడ రావణుడికి వాలి కనిపించెను . రావణుడు వాలిని వెనకనుండి పట్టుకొనుటకై చప్పుడు చేయకుండా వాలివైపుగా నడవసాగెను . వాలి తన  యొక్క శక్తివలన రావణుడు వచ్చుట గమనించి వెనకకు తిరగకుండానే ,తన చంకలో ఇరికించుకుని ఆకాశములో ఎగిరెను . రావణుడి అమాత్యులు 'మా ప్రభువును విడువుము ,విడువుము 'అని అరుస్తూ వాలిని వెంబడించిరి . వాలి రావణుడిని చంకలో ఉంచుకునే అన్ని సముద్రములలో సంధ్యావందనము పూర్తిచేసెను . పిమ్మట వాలి కిష్కిందా నగరమునకు చేరి ,అక్కడ రావణుడిని వదిలెను . 
వాలి బలపరాక్రమములకు ఆశ్చర్యచకితుడైన రావణుడు వాలితో "వానరప్రభూ !నేను రాక్షసరాజుని . నాపేరు రావణుడు . నేను నీతో యుద్ధము చేయుటకై ఇచటికి వచ్చితిని . ఓ కపీశ్వరా !నీ బలపరాక్రమములు ఎంతటివో తెలిసినది . నేను నీతో అగ్ని సాక్షిగా చిరకాలమైత్రిని కోరుచున్నాను . "అని పలుకగా వాలికూడా అంగీకరించి రావణుడిని కౌగిలించుకునేను . పిమ్మట రావణుడు వాలి ఆతిధ్యములో ఒక మాసము కిష్కిందా నగరములో ఉండెను . 

రామాయణము ఉత్తరకాండ ముప్పదినాలుగవసర్గ సమాప్తము . 

                      శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

No comments:

Post a Comment