Sunday 3 May 2020

రామాయణము యుద్ధకాండ --------నూట పదునాల్గవ సర్గ

                                    రామాయణము 

                                యుద్ధకాండ --------నూట పదునాల్గవ సర్గ 


అట్లు విలపించుచున్న రాక్షస స్త్రీలలో రావణుడికి  మిక్కిలి ప్రీతిపాత్రురాలు  పెద్ద బార్య అయిన మండోదరి  దీనంగా  భర్తను  పరిశీలించి చూసేను .  అప్పుడు ఆమె " ప్రాణేశ్వరా !  ఇది స్వప్నమా?  లేక నిజమా?  మహావీరుడవైన నీవు  రాముడి చేతిలో మరణించుట  ఏమిటి?  నీవు మృత్యుదేవతకే మృత్యువువు .  అలాంటి  నీవు  మృత్యువాత ఎలాపడినావు. ?   నీవు ముల్లోకాలలో  సంపదలను అనుభవించినావు . త్రిలోక వాసులను  భయబ్రాంతులకు గురిచేసినావు .  లోక పాలురను జయించినావు  నీ భుజబలముతో  శంకరునితోపాటు   కైలాస పర్వతమును కూడా ఎత్తినావు .  సింహ గర్జనలను  చేసి  సకల ప్రాణులను భీతిల్ల చేసినావు .  రాక్షసులకు నాయకుడవు , లంకాద్వీపమునకు  సంరక్షకుడవు  . ఇంతటి ప్రతిభాశాలివి  . నా భర్తవు ఐన  నిన్ను  ఈ విధంగా చూసికూడా  ఇంకా నేను జీవించే  ఉన్నాను . దీనిని  బట్టి  నా హృదయము  పాషాణము  అనిపిస్తోంది .   
మహా రాజా ! నేడు  నీవు వీరస్వర్గము  పొందితివి .  నీవులేకుండా  ఇంకనేను  బ్రతకలేను . కాబట్టి  నన్ను కూడా  నీతో  పాటు తీసుకువెళ్ళు . నిస్సహాయురాలునైన నన్ను  వదిలి  నీవొక్కడవే ఎలా వెళ్లాలనుకుంటున్నావు.    నేను  ఎంతగా  విలపించుచున్న  నాతో మాట్లాడవేమి ? మేలి ముసుగు లేకుండా  కాలినడక  తో  నగర  ద్వారమునుండి  బయటకు వచ్చినందుకు  నాపై నీకు  కోపము రాలేదుకదా  !   నాధా ! పత్నులందరిపై  నీకు గల ప్రేమ  అపారము . మేలి ముసుగులు లేకుండా  దీనులై  ఏడ్చుచున్న  నీ భార్యలందరిని  ఒకసారి  చూడు  . వారిని  ఓదార్చు  లేదా  కోపగించుకో  . నీవు అసువులు కోల్పోయినా  శోకముచే  కుమిలిపోవుతున్న  నాయీ హృదయము  ఇంకను  వేయిముక్కలుగా  బ్రద్దలగుటలేదేమిటి ? " అని  బిగ్గరగా విలపిస్తూ  మూర్చిల్లి  రక్తసిక్తమై  ఉన్న  రావణుడి వక్షస్థలముపై  మండోదరి పడిపోయెను  .  ఆమె  సపత్నులు  లేవదీసి  కూర్చోబెట్టి  ఓదార్చిరి . అయినను  ఆమె  భోరుభోరుమని బిగ్గరగా  ఏడవసాగెను .  
రావణుడి భార్యలందరు ఈవిధంగా  మిక్కిలిధీనముగా  విలపించుచుండగా  అది చూసినవారందరికి  బాధతో  గుండెలు బరువెక్కేను . కొద్దిసేపటికి  శ్రీ రాముడు  విభీషణుడితో  " విభీషణా ! నీ సోదరుడగు రావణునికి  దహనసంస్కారములకు  సమయము మించిపోవుచున్నది . కావున  ఆ ఏర్పాట్లు చేయుము . " అని పలికెను 
శ్రీ రాముడి మాటలు విన్నంతనే  విభీషణుడు  త్వర త్వరగా  రావణుడికి  తగు రీతిలో  దహన సంస్కారములు  చేయుటకు  ఏర్పాట్లు చేసెను . మంచిగంధముచెక్కతో  , వట్టివేళ్ళు , పద్మకములు, మొదలైన  సుగంధద్రవ్యములతో  చితిని సిద్ధపరచిరి  దానిపై  మృగచర్మమును  కప్పిరి  . వేదమంత్రములతో  సశాస్త్రీయముగా   రావణుడికి  విభీషణుడు  దహనసంస్కారములు చేసెను . 
తదుపరి  విభీషణుడు  స్నానము చేసి  తడిబట్టలతోనే  తన అన్న అయిన రావణుడికి  తర్పణములు వదిలెను . పిదప  అక్కడ ఉన్న స్త్రీలను  తన మాటలతో ఓదార్చి  లంకకు వెళ్ళమని పలికెను . వెంటనే ఆ రావణుడి పత్నులందరు  లంకా నగరము లోకి ప్రవేశించిరి . పిమ్మట విభీషణుడు  యుద్ధభూమిలో  సైనిక శిభిరంలో ఉన్న  శ్రీ రాముడి  వద్దకు వెళ్లెను . 


రామాయణము -----------యుద్ధకాండ -------------నూటపదునాల్గవసర్గ --------------సమాప్తము ------. 

శశి ,

ఎం.ఏ,ఎం.ఏ (తెలుగు), తెలుగుపండితులు. 
















No comments:

Post a Comment