Friday 15 May 2020

రామాయణము ఉత్తరకాండ ----------ఇరువదిరెండవసర్గ

                                  రామాయణము 

                               ఉత్తరకాండ ----------ఇరువదిరెండవసర్గ 

తన  సైన్యము  నశించారని  తెలుసుకున్న  యమధర్మ రాజు తానే  స్వయముగా  యుద్ధమునకు  సిద్దపడెను . మృత్యు  దేవత  పాశమును, గదను  చేబూచి,  యమునిముందుభాగమున  నిలిచెను . యముని ఆయుధ మైన  కాల  దండము మనిషిగా  మారి యముని ప్రక్కన  నిలిచెను . తాకినంతనే  భగ్గుమనే గద  కూడా  వ్యక్తిగా  మారి  పక్కన నిలిచెను .  యముడు  క్రుద్ధుడై  ఉండుట చూసి ముల్లోకములు దేవతలు భయముతో  కంపించిపోయిరి . 
ఆ  విధముగా  యమధర్మ రాజు  క్షణకాలంలో  యుద్దభూమికి  చేరెను . మృత్యు  దేవతతో కలిసి  యుద్ధసన్నాహములతో  భీకరముగా  ఉన్న  యముడిని చూసి  రావణుని  మంత్రులు "  శక్తివంతములైన  యముని బలముల  ముందు  మన బలములు  నిలువచాలవు . వీరి తో యుద్ధము చేయుటకు మనము అసమర్థులము . " అని పలికి  అను దిక్కులా  పారిపోయెను . రావణుడు  ఏమాత్రము  భయపడలేదు . యముడు  రావణుడిని  సమీపించి  తన ఆయుధములతో  అతడి  ఆయువు పట్టులపై  కొట్టెను . రావణుడు  యముని రథముపై  సరవర్షము కురిపించెను . యముడు  వివిధ  ఆయుధములను చేతబూని  ప్రయోగించుచు  వరుసగా  ఏడురోజులు యుద్ధము  చెసెను . యముడి ధాటికి  తట్టుకోలేక  రావణుడు  దిక్కు తోచని వాడయ్యెను .  పిదప   యముడు  తన  కాల  దండముతో రావణుణ్ణి  కొట్టుటకై  యత్నించెను . అప్పుడు  బ్రహ్మదేవుడు  యముడికి  మాత్రమే కనబడి "  యమధర్మారాజా! నీ పరాక్రమము   అద్భుతము .   నీవు ఈ కాలదండముతో  ఈ రావణుడిని  చంపవలదు . దేవతలలో  శ్రేష్ఠుడివైన  యమధర్మరాజా  ! నేను  ఇతడికి  దేవతల  వలన  మరణము లేకుండునట్లు  వరము  ప్రసాదించితిని . నీవు  ఇతడిని  సంహరించినచో  నేను  అసత్య  వాదిని  అగుదును . అని పలికెను .   అప్పుడు యముడు "  స్వామీ! నీవు మా  అందరికి  ప్రభువువు . నీ మాట మాకు  శిరోధార్యము . కావున కాల దండమును  ఉపసంహరించుకుంటున్నాను . కనుక  నేను  ఇతడికి కనబడకుండా రధముతో సహా  అదృశ్యుడిని అయ్యేదను . " అని  పలికి  యముడు  అదృష్యుడుఅయ్యెను . అప్పుడు దశగ్రీవుడు  తాను యముడిని జయించినట్లుగా ప్రకటించుఁకొనెను . పిమ్మట  అతడు  పుష్పక విమానము  ఎక్కి యమలోకమునుండి వెళ్లిపోయెను . అనంతరము ఉర్మాధర్మరాజు  బ్రహ్మదేవునితో  సహా  స్వర్గలోకమునకు  చేరెను . నారదుడు  కూడా తన దారిన తాను  పోయెను . 

రామాయణము ---------ఉత్త్తరకాండ ----------ఇరువదిరెండవసర్గ  ----------సమాప్తము . 

శశి 

ఎం.ఏ,ఎం.ఏ(తెలుగు), తెలుగుపండితులు . 













No comments:

Post a Comment