Monday 25 May 2020

రామాయణము ఉత్తరకాండ -ముప్పదిఐదవసర్గ

                                    రామాయణము 

                                      ఉత్తరకాండ -ముప్పదిఐదవసర్గ 

అప్పుడు శ్రీరామ  చంద్రుడు సవినయముగా  అంజలిఘటించి అగస్త్యమునితో " మహర్షీ ! వాలి , రావణులయొక్క  బలపరాక్రమములు అత్యద్భుతమైనవి అందుసందేహములేదు . కానీ హనుమంతుని  శక్తిసామర్ధ్యములముందు  వీరిరువురు  తీసికట్టే అని నాకు  తోచుచున్నది . శౌర్యము ,దక్షత ,బలము ,ధైర్యము ,తెలివితేటలూ ,నేర్పుగా కార్యము సాధించుట ,పరాక్రమము ,శక్తి ఇవి అన్నియు హనుమలో గూడుకట్టుకుని వున్నవి . సముద్రమును దాటుట ,సీతాన్వేషణ ,అశోకవనధ్వంసము ,రావణుని సేనాపతులని ,మంత్రి కుమారులని ,ఎనుబదివేల కింకరులను ,అక్షకుమారుని నేలపాలు కావించుట ,లంకను భస్మము చేయుట ఈ కార్యములన్నియూ అనితరసాధ్యములు . ఇతడి వలనే లక్ష్మణుడు నాకు దక్కినాడు . ఇతడి వలెనే నేను సీతను రక్షించుకోగలిగాను . మరి ఇంతటి శక్తి సామర్ధ్యములు కలిగిన మారుతి వాలిసుగ్రీవులకు విరోధము కలిగినపుడు మారుతి ఎందుకు వాలిని మట్టుపెట్టి ,సుగ్రీవునికి సహాయము చేయలేదు ?దయచేసి నాకు తెలపండి "అని పలికెను . 
అగస్త్యమహర్షి రామునితో " రఘువరా ! హనుమంతుని విషయములో  నీవు పలికిన మాటలన్నీ  యదార్థములే . వేగములో , బుద్ధికౌసల్యములో ఇతనితో సరితూగగలవాడు  మరియెవ్వరు లేరు .  రామా! పూర్వము ఈ వాయుసుతునకు  మహర్షులు శశాపమిచ్చిరి . ఆ శాప ఫలితముగానే  ఇతఁడు తన బలమును ఎరుగడు . రామా సుమేరు గిరికి ప్రభువైన కేసరి ఆయన భార్య  అంజనా దేవి హనుమతల్లితండ్రులు ఈ హనుమంతుడు వాయుదేవుడి  వర ప్రభావమున  జన్మించాడు . ఇతడు  వారిగింజ ముల్లువలె పింగళివర్ణము కలవాడు . ఇతడి చిన్న తనములో ఒకసారి  అంజనాదేవి ఫలములకై అడవులకు వెళ్లెను . ఇతడు ఆకలిబాధ తట్టుకోనలేక ఉదయించుచున్న సుర్యుడిని పండుగా భావించి భాను మండలమువైపు ఎగిరెను . శిశువుగా ఉన్న హనుమ  ఇట్లుఎగురుచుండగా  చూసిన దేవదానవులు యక్షులు మిక్కిలి ఆశ్చర్యపడిరి కొన్ని వేలయోజనముల దూరము  పయనించి సూర్యుడిని చేరెను . సర్వము తెలిసిన  సూర్యభగవానుడు అతడికి తాపము కలిగించలేదు . ఆ సమయములోనే రాహువుకూడా సూర్యుణ్ణి పట్టుకొనుటకై అక్కడికి వచ్చి మారుతి స్పర్శకు భయపడి పారిపోయెను . 
వెంటనే రాహువు ఇంద్రుడిని చేరి " ఇంద్రా ! నీవు నాకు ఇచ్చిన వరము ప్రకారము ఈరోజు  గ్రహణము కావున నేను సూర్యుడిని మింగుటకు వెళ్ళాను . కానీ అప్పటికే అక్కడ మరియొక రాహువు ఉన్నాడు " అని పలికెను . ఆ మాటలు విన్న దేవేంద్రుడు తత్తరపడెను . సింహాసనము నుండి దిగ్గున లేచి ఐరావతము ఎక్కి సర్యుడినిచేరి  అక్కడ హనుమను చేసెను . అప్పుడు హనుమ ఇంద్రుడి వెనకే వచ్చిన రాహువును చూసి అతడిని పెద్దపండుగా  భావించి  రాహువువైపుగా రాసాగేను . అదిచూసి రాహువు భయముతో ' ఇంద్రా!  ఇంద్రా!' అని పెద్దగా అరవసాగెను . అప్పుడు మారుతిని ఇంద్రుడు తన వజ్రాయుధముతో కొట్టెను . ఆ దెబ్బకు అతడు ఒక పర్వతముపై పడిపోయెను . అతని ఎడమ దవడ  దెబ్బతినెను . అది తెలిసిన వాయుదేవుడు ఇంద్రుడి యెడ మిక్కిలి కుపితుడాయెను . సకల ప్రాణులలో అంతర్గతుడైయున్న  వాయుదేవుడు తన చలనమును ఉపసంహరించుకుని హనుమను తీసుకొని ఒక గృహలోకి ప్రవేశించెను . 
వాయు ప్రకోపము వలన  స్వాస ఆడక సకల ప్రాణులు కొయ్యబారిపోయెను . అప్పుడు గంధర్వులు దేవతలు , అసురులు , మానవులు బ్రహ్మదేవుని వద్దకు పరుగులు తీసి జరిగిన విషయమును  మొరపెట్టుకొనిరి . అప్పుడు బ్రహ్మదేవుడు వారితో " నాయనలారా ! ఇంద్రుడు వాయుసుతుడైన  హనుమను తన వజ్రాయుధముతో  కొట్టెను . అందులకే  వాయుదేవుడు కోపించినాడు . మనమందరము వాయుదేవునివద్దకు వెళ్లి ఆయనని ప్రసన్నము చేసుకొనుటయే మన ముఖ్యకర్తవ్యము. లేనిచో  మనకు  వినాశనం తప్పదు " అని పలికెను . పిమ్మట దేవతలందరు  కలిసి వాయుదేవుడు ఉన్న ప్రదేశమునకు వెళ్లిరి . 

రామాయణము ఉత్తరకాండ ముప్పదిఐదవసర్గ  సమాప్తము . 

శశి,

ఎం.ఏ,ఎం.ఏ (తెలుగు ), తెలుగుపండితులు . 














No comments:

Post a Comment