Wednesday 13 May 2020

రామాయణము ఉత్తరకాండ --------పదకొండవసర్గ

                                       రామాయణము 

                                         ఉత్తరకాండ --------పదకొండవసర్గ 

దశగ్రీవుడు , కుంభకర్ణుడు,విభీషణుడు   బ్రహ్మ వలన  వరములు  పొందిన విషయము సుమాలి కి  తెలిసెను . అప్పుడు అతడు భయమును వీడి  పాతాళలోకమునుండి  తన అనుచరులతో సహా బయటకు వచ్చెను . సుమాలి తనతో  పాటుగా  తన మంత్రులైన  మారీచుడు , ప్రహస్తుడు, విరూపాక్షుడు , మహోదరుడు అనే వారిని కూడా తీసుకువచ్చెను . పిమ్మట   అతడు  దశగ్రీవుని కడకు చేరి  అతడిని  అక్కున  చేర్చుకొని  అతడితో " నాయనా ! దశగ్రీవ!  ముల్లోకములలో  శ్రేష్ఠుడైన  బ్రహ్మదేవుని  నుండి  వరములు  పొందితివి . మేమందరము విష్ణు మూర్తికి భయపడి పాతాళలోకములో  తలదాచుకొంటిమి . మాకు ఆ  భయము ఇప్పుడు  తొలగి పోయింది . వాస్తవముగా  ఆ లంక మనది  నీసోదరుడగు  వైశ్రవణుడు  అందు నివసించుచున్నారు .  మనము ఇప్పుడు  సామదానోపాయములచేకాని  లేక  బలప్రయోగముచే  కానీ దాన్ని తిరిగి  పొందవలెను .  లంక మనకు  వశమైనచో  నీవే  రాజువి , మా  అందరికి  ప్రభువు వి " అని పలికెను .  తన వద్దకు వచ్చి , ఈవిధముగా  పలుకుతున్న తాత (తల్లికి  తండ్రి ) తో  "  తాతా! ఆ ధనాధిపతి  మాకు అగ్రజుడు . అతని గురించి నీవు  ఈ విధముగా మాట్లాడడము తగదు . " అని పలికి  తన తండ్రివద్దకు  వెళ్లి పోయెను .  కొంత కాలము తర్వాత  ప్రహస్తుడు  రావణుని సమీపించి " దశగ్రీవా  నీవు  ఆవిధముగా  పలకటం  తగదు . సురులకు  సోదరభావం  పట్టదు .  కనుక నా మాటలు వినుము . 
అదితి , దితి  అను వారు  అక్కాచెల్లెళ్లు  వారిరువురు పరస్పర  అనురాగము కలవారు . , మిక్కిలి సౌందర్యవంతులు . వారిరువురు  కశ్యప ప్రజాపతికి  భార్యలు . అతిధి  దేవతలకు జన్మనిచ్చెను . దితి  దైత్యులకు  జన్మనిచ్చెను . వనములతో  , సముద్రములతో, పర్వతములతో  కూడి ఉన్న  ఈ లంకా  నగర ప్రదేశమంతా  దైత్యులదే .  విష్ణువు రాన రంగమున  హతమార్చెను . అప్పుడు  దేవతలకు  శాశ్వతముగా  ముల్లోకములు  ప్రాప్తించెను . సోదరులతో పోరు సల్పుట  అను అంది నీకు విపరీతకార్యముగా  అని పించవచ్చు .  కానీ  ఈ కార్యమును  నీవు  మాత్రమే  చేయబోవుటలేదు .  అన్న దమ్ములైన సురాసురులు  ఇంతకు  ముందే  ఇట్టి పోరుసల్పి యుండిరి .  కనుక నా మాటలను  పాటించుము . " అని పలికెను . ప్రహస్తుడి మాటలకు దశగ్రీవుడు  క్షణకాలం పాటు అలోచించి  సంతోషముతో  పొంగిపోయి అట్లే అని తన సమ్మతిని  తెల్పెను . పిమ్మట అతడు తన అనుచరులతో కలిసి  త్రికూట పర్వతమునకు చేరి  ప్రహస్తుడిని  దూతగా పంపెను . 
ప్రహస్తుడు  కుభేరుడి  పాలనలో ఉన్న  లంకలో  అడుగిడి ఆ ధనాధిపతితో  " ధర్మాత్మా ! నీ సోదరుడైన  దశగ్రీవుడు పంపగా నీవద్దకు  వచ్చితిని .  విశాలాక్ష !  పూర్వము  రమ్యమైన  ఈ  లంకా పురమును  సుమాలి మున్నగు రాక్షస ప్రముఖులు  పరిపాలించెడివారు . కనుక  తిరిగి ఈ లంకా నగరమును మాకు ఇచ్చివేయుము .అని తనమాటగా  దశగ్రీవుడు నీకు  తెల్పమన్నాడు . ఆ మాటలు విన్న వైశ్రవణుడు  " ప్రహస్త ! రాక్షసులు వదిలి వెళ్లిన పిమ్మట  చాలా కాలము  ఈ లంక  కాలియగానే  ఉన్నది అప్పుడు మా తడ్రిగారగు విశ్రవసుడు ఈ  నగరమును నాకు అప్పగించెను . పిమ్మట  నా ప్రజలైన  యక్షులను ఇందు నివసింప  చేసితిని . నా పరిపాలనలో ఉన్న ఈ నగరము మా తమ్ముడిది  కూడా  కావున  హాయిగా  తనను  నాతో కలిసి  ఇక్కడ ఉండ  మను  " అని పలికెను . 
ఆ  దూతతో  ఈ విధముగా పలికి అతడిని పంపించిన తరువాత  తన తండ్రి వద్దకు వెళ్లి  తన  తండ్రితో  రావణుడి  కోరికను తెల్పెను . అప్పుడు  ఆయన కుభేరునితో  " కుమారా ! దశగ్రీవుడు  నా వద్ద ఈ  విషయములను ఐదు వరకే ప్రస్తావంచినాడు . ఆ  దుర్మతికి  నేనెంతో  నచ చెప్పను  మిక్కిలి మందలించితిని కూడా  నీవి ఇలా చేసినచో  తప్పక పథాన మవుతావు అని  కోపంతో పదే  పదే  హెచ్చరించితిని . భళా గర్వితుడైన ఆదుష్టుడు  యుక్తాయుక్తములను  ఎరుగడు  అందువలన  నీవు నీ సహచరులతో కలిసి లంకను వదిలి  కైలాస పర్వతమునకు వెళ్లి అక్కడ నివసింపుము  నీకు ఆ రాక్షసునితో  వైరము ఏమాత్రము తగదు  అతడు  బ్రహ్మ నుండి పొందిన వరములు గురించి  నీకును తెలియును కదా " అని పలికెను . తండ్రి మాటలు విన్న వైశ్రవణుడు  ఆయన మాటలు పాటించి  భార్య పుత్రులతో  అమాత్యులతో  , ధన , వస్తు వాహనములతో  వెంటనే  లంకను వీడి  కైలాసమునకు చేరెను .  పిమ్మట  దశగ్రీవుడు  తనసోదరులతో  అనుచరులతో  కలిసి  లంకా నగరములో ప్రవేశించెను , దశాననుడు లంకా నగరమునకు పట్టాభిషిక్తుడై వైభవోపేతముగా  నివసింపసాగెను . ఆ లంక నగరము రాక్షస  గణములతో  నిండిపోయినది .  ఖుభేరుడు  తండ్రిమాట పై గల  గౌరవముతో  కైలాసగిరి యందలి అలకా పురిలో  నివసించసాగిరి . 

రామాయణము --------ఉత్తరకాండ -------పదకొండవసర్గ ----------సమాప్తము . 

శశి,

ఎం.ఏ,ఎం.ఏ (తెలుగు), తెలుగుపండితులు . 












No comments:

Post a Comment