Tuesday 5 May 2020

రామాయణము యుద్ధకాండ ---------- నూటపందొమ్మిదవసర్గ

                                         రామాయణము 

                                         యుద్ధకాండ ---------- నూటపందొమ్మిదవసర్గ 

అప్పుడు జానకి దేవి భర్త మాటలచే మిక్కిలి గాయపడినదై ,కన్నీరు మున్నీరుగా విలపించసాగెను . పిమ్మట సీతా  దేవి  కన్నీటితో తడిసిన తన ముఖమును తుడుచుకొనుచు గద్గద స్వరముతో తన భర్త తో ఇలా పలికెను . "మహావీరా ! ఒక నిమ్నశ్రేణికి  చెందినవాడు . నిమ్న స్థాయి స్త్రీ తో పలికినట్లు నీవంటివానికి  తాగనిరీతిలో  ఇట్లు  కర్ణకఠోరమైన  పరుషవచనములను  నాతో ఏల  పలుకుచుంటివి .  ఇంతవరకును  మనము  త్రీకరణశుద్దిగా  ఒక్కరుగా  మసలితిమి . అయినను  నీకు నన్ను  గురించి సరియగు అవగాహన లేనిచో ఇక నేను జీవించుట వ్యర్ధము .  
మహావీర!  నాజాడను  ఎరుగుటకై  నీకు  నమ్మినబంటు  వారుడైన హనుమంతుని  పంపితివి కదా ! ఆ సమయమున  నేను  లంకలోని  ఉన్న  విషయము  అతనిద్వారా నీకు  తెలిసియే  యున్నదికదా ! అయినచో  నను అప్పుడే ఎందుకు  వదిలివేయలేదు ? . అప్పుడే నేను ప్రాణత్యాగము  చేసేదానిని  .   అట్లు   చేసినచో  అనేక సంకట పరిస్థితులను ఎదురుకొని  వృధాగా  ఈ యుద్దమునకై శ్రమపడి ఉండేడి  వారు కాదుకదా  అంతే కాక  మీ మిత్రులు కూడా అనేక కష్టములకు గురికావాల్సిన  అవస్థ తప్పేది .  కన్నీరు కార్చుచు  గద్గద కంటయయి  శ్రీ రాముడితో  ఇలా పలికిన పిమ్మట  సీతాదేవి  అక్కడే ఉన్న లక్ష్మణుడితో "  నాయనా లక్ష్మణా  ఇటువంటి అపవాదమునకు గురి ఐన నేను  ఇక జీవించి ఉండదల్చుకోలేదు  కావున  నాకొరకై చితిని పేర్చుము  నా తీరని  దుఃఖమునకు  అది మాత్రమే దివ్య ఔషధము నా స్వామి  నన్ను అందరి సమక్షమున  పరిత్యజించినాడు .  ఇక  అగ్ని ప్రవేశము ఒక్కటే నాకు శరణ్యము  " అని పలికెను . 
అప్పుడు లక్ష్మణుడు  మిక్కిలి బాధతో  శ్రీ రాముడి వైపు చూసేను .  ఆయన ఏమి మాట్లాడుకుండుట చూసి  చితిని సిద్దపరిచేను .  అప్పుడు సీతా దేవి  శ్రీ రాముడికి ప్రదక్షిణాలు చేసి  నమస్కారముచేసి  లక్ష్మణుడు పేర్చిన  చితిని  సమీపించెను .  పిదప  సీత చేతులు జోడించి  మండుతున్న ఆ అగ్నికి నమస్కారము చేసి " నా హృదయము  ఒక్క క్షణమైనను  శ్రీ రామునికి దూరము కాక  నిరంతరము  ఆయన యందే లగ్నమై ఉన్నచో లోక సాక్షిఅయిన  అగ్ని దేవుడు అన్ని విధములుగా నన్ను రక్షించు గాక . నేను మనసా  వాచా కర్మణా  అన్ని విషయముల యందు  సర్వధర్మజ్ఞుడైన  రాఘవుని అనుసరించి ఉన్నచో  అగ్ని దేవుడు నన్ను కాపాడు గాక  " .  అని ప్రార్ధించి అగ్నిదేవునకు ప్రదక్షిణము చేసి  శరీరముకై ఆసక్తివీడి  ప్రెశాంత చిత్త  అయి ప్రజ్వలించుచున్న అగ్నిలో ప్రవేశించెను . 
సీతాదేవి  ఆ  విధంగా  అగ్నిలో ప్రవేశిస్తుండగా చుసిన  రాక్షసులు  , వానరులు, కనీవినీ ఎరుగనిరీతిలో  దిక్కులు పిక్కటిల్లునట్లుగా  హాహాకారములు ఒనర్చిరి  . 

రామాయణము---------- యుద్ధకాండ ----------నూటపందొమ్మిదవసర్గ -----------సమాప్తము 




























No comments:

Post a Comment