Sunday 3 May 2020

రామాయణము , యుద్ధకాండ ---------నూటపదహారవసర్గ

                                       రామాయణము 

                                 యుద్ధకాండ ---------నూటపదహారవసర్గ 


వాయుసుతుడైన  హనుమంతుడు  శ్రీరాముడి ఆదేశము విన్నవెంటనే  ,  లంకా నగరము లోనికి  ప్రవేశించెను .  అక్కడి రాక్షసులు  హనుమను పూజించిరి  . పిమ్మట  హనుమ అశోక వనము లోకి  ప్రవేశించి , తైలసంస్కారములు లేక   మిక్కిలి దీనంగా ఉన్న  సీతా దేవిని  చూసి  ఆమెవద్దకు  వెళ్లి  తన గోత్రనామములను తెలిపి  ఆమెకు నమస్కరించెను . హనుమ శరీరము కుంచించుకొని  సీతాదేవి ఎదురుగా  వినమ్రుడై  నిలబడి ఉండెను . అప్పుడు సీతా దేవి  ఆయనను  గుర్తించి  మిక్కిలి సంతోషించెను . అప్పుడు హనుమ " అమ్మా ! వైదేహి! రాముడూ , లక్ష్మణుడు కుశలమే , కపీన్ద్రుడైన  సుగ్రీవుడు , యుద్ధమునకు తోడ్పడిన విభీషణుడు  , వానర యోధులందరూ క్షెమమే  , లోక కంటకుడైన రావణుని  వధించి  శ్రీ రామచంద్ర ప్రభువు నీ క్షేమ సమాచారముల గూర్చి  తెలుసుకొనుటకై నన్ను ఇక్కడికి పంపెను . అమ్మా! ఇంక  నీవు భీతిల్లవలదు  ఎందుకంటే  ఇప్పుడు  లంకానగరమంతా  భక్తి తత్పరుడైన  విభీషణుని అధీనములో  ఉన్నది . కావున  నిశ్చింతగా  ఉండుము . విభీషణుడు  నీ దర్శనమునకై  త్వరలోనే  ఇక్కడికి రాబోతున్నాడు " అని పలికెను . 
 హనుమంతుడు  పలికిన మాటలు విని  సీతాదేవి  సంతోషంతో  ఏమి మాట్లాడలేక పోయెను  . తనకి  సమాధానము  చెప్పకుండా  మౌనంగా ఉన్న  సీతాదేవేరితో  హనుమంతుడు " అమ్మా! ఇంకా ఏమిఆలోచిస్తున్నావు  ,  నాతో  మాట్లాడవేమి " అని పలికెను . అపుడు సీతా దేవి   సంతోషంతో  నిండిన   గద్గద స్వరముతో " మారుతి  నా పతిదేవుడు  విజయము  సాధించాడు . అనే  సంతోషకరమైన  వార్త విని  సంతోషంలో  మునిగిపోయాను . కనుక  క్షణకాలం  పాటు  మాట్లాడలేకపోయాను . వానరోత్తమా! నాకు ఇంతటి  ప్రియమైన సందేశమును  తీసుకు వచ్చిన  నిన్ను ఎలా అభినందించాలో  నాకు తెలియటంలేదు . ఓ కపివర  నాకు  ఇంతటి మంచి వార్తను తీసుకువచ్చిన  నీకు  ఇవ్వదగిన  బహుమానము  నాకు  ఈ భూలోకము నందేకాదు  అంతరిక్షమునందేకాదు , చివరికి స్వర్గములో కూడా  కనుపడుటలేదు . నీవు నాకు  చేసిన మేలుకు  వెండి బంగారములు కానీ , వివిధరత్నములు కానీ  చివరికి  త్రిలోకాదిపత్యము  కూడా  సాటికాజాలదు  " అని పలికెను . 
అప్పుడు సంతోషముతో  హనుమ"  అమ్మా !  ఈ రాక్షస స్త్రీలు  ఇన్నాళ్లు  నిన్ను ఎంతగానో  బాధపెట్టారు . నీవు అనుమతిని ఇస్తే  వీరందరిని  ఇప్పుడే హతమారుస్తాను . " అని పలికెను . అప్పుడు  సీతా దేవి " మారుతీ  ! ఈ రాక్షస  స్త్రీలు  రావణుడి అధీనములో  ఉన్నారు .  రాజాజ్ఞలను  పాటించుటయే  వీరి కర్తవ్యము  . అట్టి  వీరిపై కోపము ఎందులకు ?నా దురదృష్టము వలనో లేక నేను ఇదివరకు చేసిన పాప ఫలితముగానో నాకు ఈ బాధలన్నీ కలిగినవి . ఈ రావణుడి దాసీలను నేను క్షమిస్తున్నాను . "అని పలికెను . 
సీతాదేవి ఇలా పలుకగా అప్పుడు మారుతి "మాహాత్మురాలివి ,శ్రీరాముడి ధర్మపత్నివి ఐన నీవు కూడా ఆ స్వామీ లాగే శరణాగతవాత్సల్యము మొదలగు ఉత్తమ గుణములను కలిగివుండుట ఎంతేని సముచితము . ఇక నేను నా ప్రభువు వద్దకు వెళ్తాను . నీ సందేశమును తెలుపుము "అని పలికెను . అప్పుడు సీత 'వానరోత్తమా !నా పతిదేవుని చూడాలనుకుంటున్నాను . "అని పలికెను . అప్పుడు హనుమ ఆ తల్లికి సంతోషము కలిగేలా "అమ్మా !శ్రీరామచంద్రప్రభువును నీవు త్వరలోనే చూడగలవు "అని పలికి శ్రీరాముని వద్దకు వెళ్లెను . 

రామాయణము యుద్ధకాండ నూటపదహారవసర్గ సమాప్తము . 

                        శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .  











No comments:

Post a Comment