Thursday 14 May 2020

రామాయణము ఉత్తరకాండ -------- పదహారవసర్గ

                                             రామాయణము 

                                               ఉత్తరకాండ --------పదహారవసర్గ 

అగస్త్యుడు  ఇంకా  ఇలా చెప్పుచున్నాడు " రామా! రావణుడు  కుబేరున్ని  జయించిన పిమ్మట  అక్కడే గల  శరవణ  వనమునకు  విమానముపయు వెళ్లెను . అది కుమారస్వామి  జన్మించిన ప్రదేశము .  పిమ్మట  ఇంకా  ముందుకు సాగెను .  రమ్యమైన  వనములతో ఉన్న  ఒక పర్వతము పైకి  చేరిన పిమ్మట  విమానము  అక్కడే  గాలిలో  నిలిచిపోయెను  అది చూసిన  రాక్షస రాజు ' మంత్రులారా ! ఈ విమానము  ఇంత వరుకు  నా ఆదేశానుసారం  పయనించింది . కానీ ఇప్పుడు  నా ప్రమేయము లేకుండానే  ఆగిపోయింది .  దీనికి కారణము ఏమై ఉంటుంది . ఒక వేళ ఈ పర్వతముపై  దీనికి  అడ్డంకులు ఏమైనా ఉన్నవేమో  చూసిరండు '  అని  పలికెను .  అప్పుడు మారీచుడు  తన ప్రభువుతో " రాజా ! ఏ కారణము లేకుండా  ఈ పుష్పకము ఇలా  ఆగిపోదు .  ఇది కుబేరుడి యొక్క  వాహనము .  కనుక అతని ఆదేశము ప్రకారమే  ఇది  నడుచును . బహుశా  ఈ పుష్పకములో  కుబేరుడు లేక పోవుటచే ఇది  ఆగిపోయి ఉండవచ్చును " అని పలికెను . 
ఇంతలో  పరమేశ్వరుడి  అనుచరుడైన  నందీశ్వరుడు  ఆ శిఖరము  పైకి వచ్చెను . అతడు  పొట్టిగా  వికృతముగా  ఉండెను . ఆ నందీశ్వరుడు  రావణునితో " దశగ్రీవా! ఈ  పర్వతముపై  సంఖరుడు , పార్వతీ దేవితో కలిసి  విహరించుచున్నారు . ఇచటికి  నాగ , యక్ష, గరుడ,గాంధర్వ ,దేవ , దానాలు  మొదలగు  ఏ  ప్రాణులను  ఈ పర్వతము మీదికి  వెళ్ళరాదు . కనుక  వెనుతిరుగుము . లేనిచో  నీకు నాశనము తప్పదు . " అని హెచ్చరించెను . నందీశ్వరుని  మాటలు  వినిన వెంటనే రావణుడు మిక్కిలి  కోపంతో ' ఎవడీ  శంకరుడు ?'అని  పలుకుచూ  విమానము  పై నుండి  శిఖరము  పైకి  దిగెను . అక్కడ   శూలపాణి  ఐ  అపార శంకరుని  వాలే ఉన్న  నందీశ్వరుడిని  చూసేను . రావణుడు  వానర  ముఖంతో  ఉన్న  నందిని  చూచి  ఎగతాళిగా  వికటాట్టహాసము చేసెను.  దానికి  కోపించిన నందీశ్వరుడు  "  దశాననా!  నా వానర  ముఖమును చూసి  గెలిచేయుచూ  పెద్దగా  నవ్వితివి  కావున  నా వంటి రూపము గల  వానరులు  నిన్ను  నీవంశమును  నాశనము చేయుటకై జన్మింతురు . నాకములు  దంతములు,ఆయుధముగా  చేసుకొని  నీ బలగర్వములను  రూపుమాపెదరు .  అంతే కాక నిన్ను  నీ అమాత్యులను  , నీ బంధుమిత్రులను , పరివారమును నుగ్గునుగ్గుచేసెదరు . వారి దాకా  ఎందుకు  ఇప్పుడు  నేనే  నిన్ను  సంహరించి  వేయగలను  . కానీ  నీ దుష్కర్మల  ఫలితముగా   నీవు ఇప్పటికే  మృతతుల్యుడివి . " మహాత్ముడైన  నందీశ్వరుడు   ఈ విధముగా  పలుకగా  దేవదుందుభులు  మ్రోగినవి . ఆకాశము  నుండి  పూలవాన  కురిసినది . 
దశాననుడు  నందీశ్వరుని  మాటలు  లెక్క చేయక  కైలాస  పర్వత  సమీపమునకు  చేరి  పెద్దగా  "  శంకరా !  నీ కారణుమగా  నా  పుష్పక  విమానము  ఆగిపోయినది .  కనుక  నీ ఈ  పర్వతమును  పెకలించివేసెదను . " అని అరిచి  పర్వతము  యొక్క  కింది భాగమును  తన  భుజములను  ఆనించి  దానిని  పైకి  ఎత్తుటకు  ప్రయత్నించెను . అప్పుడు  ఆ పర్వతము  కంపించ సాగెను . ప్రమదగణములు  కంపించెను.  పార్వతికూడా  చలించి. పరమేశ్వరుడిని  గట్టిగా  పట్టుకొనెను .  అప్పుడు  పాపాత్ములను  శిక్షించు వాడు  ఐన   పరమేశ్వరుడు  తన  కాలి  బొటని  వేలితో  ఆ శైలమును  అదిమెను .  ఆ  ఒత్తిడి  వలన  కొండా  క్రింద ఉన్న  రావణుడి బాహువులు నలిగిపోయినవి .  భుజముల నొప్పి  భరించలేనంతగా  ఉండగా  ఆ రాక్షసుడు  బిగ్గరగా  ఒక పొలికేక  పెట్టెను . ఆ  భయంకర  నాదమునకు  ముల్లోకములు  గడగడలాడినవి .   అప్పుడు విలవివిలలాడుతున్న  రావణుడితో  అతని మంత్రులు " రాజా !  దేవదేవుడు  ఐన  పరమేశ్వరుడిని  స్తోత్రములతో  సంతోష  పరుచుము .  ఇప్పుడా  స్వామిని  సారాను వేడుట తప్ప  మరొక  మార్గములేదు . 
ఆ  అమాత్యుల  మాటలకు సమ్మతించి  రావణుడు   శంకరునకు  ప్రణమిల్లి , సామవేదమంత్రములతో, వివిధ  స్తోత్రములతో , ఒక  వేయి  సంవత్సరములపాటు  పరమేశ్వరుడిని  ఆర్తితో  కీర్తించెను . అప్పుడు  ఆ మహాదేవుడు  ప్రీతుడై  అతని భుజములనుండి  శైలమును  తప్పించి " దశాననా  నీ  సౌర్య   పరాక్రమములకు  మెచ్చితిని  . నీవు  చేసిన  భీకర ధ్వనికి  ముల్లోకములు  గడగడలాడినవి .  కనుక  నేటి నుండి  నీవు  రావణుడు  అనే పేరుతో  పిలవపడతావు . నీవు  వెళ్లుటకు  అనుమతి ఇచ్చుచున్నాను  " అని  పలికెను .  అప్పుడు రావణుడు  " మహా దేవా ! నీవు  సంతుష్టుడ  వైనచో  నాకు  ఒక వరమును  ప్రసాదింపుము . నాకు  బ్రహ్మదేవునివలన  దీర్గాయువు  లభించినది . నేను  అకాలమరణము పొందకుండా  నన్ను అనుగ్రహించుము . అదేవిధముగా  నాకు  ఒక  మహాత్రమును  ప్రసాదించుము . " అని వేడుకొనెను .  అప్పుడు పరమేశ్వరుడు  అతనికి  కాంతులు  విరజిమ్మిచున్న  చంద్రహాసము  అనే పేరుకల  ఒక  ఖడ్గమును  ప్రసాదించి " రావణా!  ఎప్పుడు ఈ  ఖడ్గమును  అవమాన పరుచురాదు . ఎప్పుడైనా  దీనిని  పూజించుటలొ  అశ్రద్ధ  చోపినట్లైతే   ఇది మళ్ళీ  నా వద్దకే  వచ్చి చేరును " అని చెప్పెను . అప్పడు  రావణుడు  మహాదేవుడికి  ప్రణమిల్లి  అక్కడ నుండి వెడలిపోయెను . 
అనంతరము  రావణుడు  భూమిపై  సంచరించుచు  క్షత్రియులను  బాధింపసాగెను .  బల పరాక్రమ వంతులైన  కొందరు  క్షత్రియులు  రావణుడిని ఎదిరించి  సపరివారంగా  నశించిరి . ఇతర  రాజులు  తమ  పరాజయము  ఒప్పుకొని  రావణుడికి  లొంగిపోయిరి . 

రామాయణము -----------ఉత్తరకాండ ---------- పదహారవసర్గ---------సమాప్తము . 

శశి, ఎం.ఏ,ఎం.ఏ(తెలుగు), తెలుగుపండితులు . 


















No comments:

Post a Comment