Friday 15 May 2020

రామాయణము ఉత్తరకాండ ---------ఇరువదిమూడవసర్గ

                                      రామాయణము 

                                     ఉత్తరకాండ ---------ఇరువదిమూడవసర్గ 

అగస్త్యడు  ఇంకా  ఇలా చెప్పుచున్నాడు  " రామా!  రావణుడు  యముని జయించి  తన యుద్ధ సామర్ధ్యమును  తానే  పొగుడుకొనుచూ  రసాతలముకు  వెళ్లెను . అది  దైత్యులకు  నాగ జాతి వారికి  నివాస స్థలము . అది వరుణుడి రక్షణలో ఉండెను . మొదట రావణుడు  వాసుకి  పాలనలో ఉన్న  భోగవతీ  పురమునకు  వెళ్లి  నాగజాతి  వారిని  వశపరుచుకొనెను .  పిమ్మట  అతడు  బ్రహ్మదేవుడిచే  వరములు పొందిన నివాతకవచాది  దైత్యులు నివసించే  మణిపురముకు చేరి వారిని  యుద్ధమునకు పిలిచెను .  పిమ్మట ఆ దైత్యులకు  రావణునికి మధ్య  ఓక సంవత్సర కాలము మించి యుద్ధము కొనసాగేను . కానీ  వారిలో ఏ  పక్షమువారు  జయించలేదు . ఇంతలో శాశ్వతుడైన బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చి వారిని వారించి "దైత్యులారా !రావణుడిని జయించుట అసాధ్యము . అట్లే అమరులు దానవులు కలిసి వచ్చినను మిమ్ము జయించలేరు . కావున మీరు ఈ రావణుడితో మైత్రిచేసుకొనుట ఉత్తమము . మైత్రివలన ఇరుపక్షముల వారికి సకల ప్రయోజనములు కలుగును . "అని పలికెను . 
అప్పుడు రావణుడు నివాతకచులతో అగ్నిసాక్షిగా మైత్రి చేసుకొనెను . రావణుడు అచట ఒక సంవత్సరకాలం వుంది అతిధి మర్యాదలు పొందెను . పిమ్మట రావణుడు వారి నుండి వంద మాయా విద్యలను పొందెను . పిమ్మట కాలకేయులు మట్టుపెట్టేను . పిమ్మట దశాననుడు తన సైన్యమునే తినివేయుచున్న కారణముగా శూర్పణఖకు భర్త ,తనకి బావమరిది అయిన విద్యుజ్జిహ్వుని తన ఖడ్గముతో ఖండించివేసెను . పిదప ఆ రాక్షసరాజు వరుణుని యొక్క దివ్యమందిరము సమీపమునకు  వెళ్లెను . అచట నందీశ్వరుడి తల్లి అయిన సురభిని చూసేను . ఆ గోవునకు ప్రదక్షణపూర్వకముగా నమస్కరించెను . వరుణుడి భవనంలో ప్రవేశించుచున్న రావణుడిని అక్కడ కల సేనాపతులు అడ్డగించిరి . అప్పుడు రావణుడు వారిని దెబ్బతీసి అక్కడ యోధులతో మీ రాజైన వరుణుడిని నాతొ యుద్ధమునకు రమ్మని చెప్పండి అని పలికెను . 
ఇది తెలుసుకొన్న వరుణుని పుత్రులు ,పౌత్రులు ,వారి బలములకు అధ్యక్షులైన గోపుష్కరులు మిక్కిలి కోపముతో అక్కడికి వచ్చిరి . వారికి రావణునికి మధ్య దారుణమైన యుద్ధము జరిగెను . మహాపరాక్రమవంతులైన రావణాసురుని అమాత్యులధాటికి తట్టుకోలేక వరుణుని బలములు క్షణములో నేలపాలయినవి . అది చూసిన వరుణుని పుత్రులు శీఘ్రముగా పయనింపకల తమ రధములపై ,ఆకాశమునకు చేరి అచట నుండి యుద్ధము చేయసాగిరి . రావణుడు చిత్రవిచిత్రమైన ఆయుధములను వరుణుని పుత్రులపై ప్రయోగించగా వారు మిక్కిలి గాయపడిరి . అది చూసిన రావణుడు మిక్కిలి సంతోషముతో ప్రళయకాల మేఘమువలె బిగ్గరగా గర్జించెను . అప్పుడు వారు యుద్ధవిముఖులై తమ భవనములకు వెళ్లిపోయిరి . అనంతరము ఆ రాక్షస రాజు "యుద్ధమునకు మీ రాజుని పిలువుడు "అని వరుణుని సైనికులతో పలికెను . అప్పుడు వారు "రాక్షసరాజా !నీవు యుద్ధమునకు పిలుచుచున్నా మా మహారాజైన వరుణుడు గంధర్వగానములు వినుటకు బ్రహ్మలోకమునకు వెళ్లెను . ఇక్కడలేరు . అతని పుత్రపౌత్రులను నీవు పరాజితులు చేసితివి . "అని పలికిరి . అప్పుడు రావణుడు తానూ విజేత అయినట్టు ప్రకటించుకుని ,సంతోషముతో సింహనాదం చేయుచు ,వరుణలోకము నుండి వెళ్లిపోయెను . 

రామాయణము ఉత్తరకాండ ఇరువదిమూడవసర్గ సమాప్తము . 

                       శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 








No comments:

Post a Comment