Monday 25 May 2020

రామాయణము ఉత్తరకాండ - ముప్పదిమూడవసర్గ

                                         రామాయణము 

                                        ఉత్తరకాండ - ముప్పదిమూడవసర్గ 

దేవతలవలన పులస్త్యునికి రావణుడు బంధింపబడిన విషయము తెలిసింది . ఆ మహాముని మిక్కిలి  ధైర్యశాలే అయినాను పౌత్రునికి వచ్చిపడిన దుఃఖ స్థితి అతని హృదయమును  చలింపచేసింది . వెంటనే  కార్తవీర్యార్జునిడిని కలుసుకొని అతడు మాహిష్మతి పురమునకు బయలుదేరెను . ఆ మహర్షి యొక్క  దివ్యతేజస్సును ఆ మాహిష్మతి పురప్రజలు  చూడలేకపోయిరి . వారికి అతడు అద్భుతమైన తేజస్సుతో  కాలినడకన  వచ్చుచున్న సూర్యుడిరీతిగా కనపడెను . ఆ పౌరులు ఎట్టకేలకు ఆ మహాత్మున్ని పులస్త్యమహర్షిగా గుర్తింపలేదని వెంటనే  వారు తమ ప్రభువైన కార్తవీర్యార్జుని వద్దకు వెళ్లి ఆయనకు ఆ ముని రాకను తెలిపిరి . 
వెంటనే కార్తవీర్యార్జునుడు పులస్త్య మహర్షికి ఎదురుగావెళ్లి ఆయనకు వందనము చేసి పిదప అర్ఘ్య పాద్యములను , మధుపర్కమును ,గోవులను సమర్పించెను . పిమ్మట ఆ ప్రభువు సంతోషముతో నిండిన గద్గద స్వరముతో " మహాత్మా నా అదృష్టము వలన నీ దర్శన భాగ్యము కలిగింది . నా జన్మ చరితార్ధమైనది. తపస్సు సఫలమైనది . బ్రహ్మర్షీ ! ఈ రాజ్యము నీది . నేను మా  భార్యాపిల్లలు అందరమూ నీవారము . నేను ఇప్పుడు ఏమిచేయగలనో ఆజ్ఞ్యాపించుము " అని పలికెను . 
ఆ మాటలువిని సంతోషించిన పులస్త్యుడు ముందుగా కార్తవీర్యార్జునుడి ,అతని బంధుజనముల యొక్క , అతని రాజ్యము యొక్క యోగక్షేమములు అడిగెను . పిమ్మట ఆయన  " నరేంద్ర నీ బలపరాక్రమములు అపూర్వములు నా మనవుడైన రావణుడికి భయపడి సముద్రము , వాయువుకూడా కదలికలు మాని అతనిని సేవించుచున్నారు . అతడునీచే యుద్ధమున పరాజితుడై బంధిపబడి ఉన్నాడు . నా మాటలపై  గౌరవము ఉంచి బాలుడైన రావణుడిని వదిలిపెట్టుము . " అని పలికెను . వెంటనే కార్తవీర్యార్జునుడు మారుపలుకక రావణుడిని  బంధవిముక్తుడిని చేసి దివ్యమైన పూలహారముతోను , వస్త్రాభరణములతోను సత్కరించి రావణుడిని  అక్కున చేర్చుకొనెను . పిమ్మట కార్తవీర్యార్జునుడు రావణుడు వెళ్ళుటకు అనుమతిని ఇచ్చెను . రావణుడు కార్తవీర్యార్జునుడి చేతిలో ఓడిపోయినందుకు గాను  సిగ్గుతో తలవంచుకొనెను . ఆ విధముగా  కార్తవీర్యార్జునితో మైత్రిని పొందిన రావణుడు  యథావిధముగా తన దుశ్చర్యములను కొనసాగించెను . 

రామాయణము ఉత్తరకాండ ముప్పదిమూడవసర్గ సమాప్తము . 

శశి,

ఎం.ఏ,ఎం.ఏ (తెలుగు),తెలుగుపండితులు . 




















 

No comments:

Post a Comment