Tuesday 12 May 2020

రామాయణము ఉత్తరకాండ ---------తొమ్మిదవసర్గ

                                         రామాయణము 

                                         ఉత్తరకాండ ---------తొమ్మిదవసర్గ 

కొంత కాలము తర్వాత సుమాలి పాతాళ  లోకము నుండి  భూమిపైకి వచ్చి పుష్పక విమానము పై వెళుతున్న  కుభేరుణ్ని  చూసేను .  కుభేరుడు తన తండ్రి అగు  విశ్రవసుని  దర్శించుటకై  స్వేచ్ఛగా వెళ్లుచుండగా  సుమాలి ఆశ్చర్య పడి  తిరిగి పాతాళమునకు  ప్రవేశించెను .  అతడు  రాక్షసులతో  బాగుగా ఆలోచించి  తన కుమార్తె కైకసితో   " అమ్మా ! నీకు పెళ్లీడు  వచ్చినది  వయస్సు మించిపోవుచున్నది  . నీవు తిరస్కరిస్తావన్న  భయముతో  వరులు ఎవ్వరు నిను వివాహము చేసుకొనుటకు  ముందుకు వచ్చుటలేదు  కావున  పుత్రి  పులస్త్య నందనుడైన  విశ్రవసుడు  బ్రహ్మ వంశమునకు  చెందిన వాడు  ఆ ముని శ్రేష్ఠుడు  నీకు తగిన వరుడు  ఆయన్ను  పతిగా కోరి  సేవింపుము . కుభేరుని  వంటి పుత్రులు నీకు కలిగెదరు " అని పలికెను . 
అప్పుడా  కైకసి తండ్రిపై గల గౌరవముతో  మరుక్షణమే  తప్ప మాచరించుచున్న  విశ్రవసుని  దగ్గరకు వెళ్లి  తల  వంచుకొని  పాదాంగుష్ఠము తో  పదే పదే నేలపై  రాయ సాగెను . అది చూసిన  విశ్రవసుడు  "  ఓ సుందరి నీవు ఎవరి కుమార్తెవు ? ఎక్కడినుండి వచ్చితివి ? ఇక్కడికి వచ్చుటకు  గల కారణమేమిటి ? " అని ప్రశ్నించగా  అప్పుడా కైకసి  " మునీశ్వరా ! నా పేరు కైకసి  నేను  సుమాలి పుత్రికను .  మా తండ్రి ఆదేశముపై నేను ఇక్కడకు వచ్చితిని . మిగిలిన విషయములను  నీ తపఃప్రభావము  వలన నీవే తెలుసుకొనగలవు . " అని పలికెను . అప్పుడు ఆ ముని ధ్యాన నిమగ్నుడై  విషయమును గ్రహించి  " ఓ కన్య ! నీవు నావలన పుత్రుని పొందవలెనని కోరికతో  ఉన్నావు  కానీ నీవు  దారుణ మైన  సంధ్యా సమయములో  నా వద్దకు  వచ్చావు .  కనుక  నీకు జన్మించే తనయులు  గూర్చి తెలిపెదను వినుము భయంకర  ఆకారములు కలిగి  క్రూరకార్యములకు  పాల్పడే రాక్షసులు  నీకు పుత్రులుగా జన్మిస్తారు " అని పలికెను . 
ఆ ముని మాటలు  విన్న కైకసి  అంజలి గటించి  " మహాత్మా ! మీరు వేదవేత్తలు . మీనుండి  దురాచారులైన  పుత్రులను పొందుటకు  నాకు  సమ్మతము కాదు .  నాపై కనికరము చూపించు " అని అర్ధించెను . అప్పుడు ఆ ముని నావలన  నీకు కలిగే  కుమారులలో  చివరివాడు నా వంశమునకు తగినట్లుగా ధర్మాత్ముడు  ఆగుతాడు . అని పలికెను . ఆ ముని అలా పలికిన తర్వాత  కొంతకాలమునకు ఆ కైకసికి రాక్షస లక్షణములు  కల కొడుకులు  పుట్టెను . ఆ బాలురు  పదితలలు  ఇరువై భుజములు  పొడుగు  దంతాలను  కలిగి ఉన్నాడు . అతడు జన్మించినపుడు . రక్త వర్షము  కురిసినది . ఉల్కలు  రాలినవి . సూర్య కాంతులు  సన్నగిల్లినవి  భూమి కంపించింది . గాలులు  దారుణముగా వేయిచినవి  ఇతనికి   దశగ్రీవుడు అని పేరు పెట్టిరి . 
అనంతరము  కైకసికి పుట్టిన వాడు కుంభకరుణుడు . అతను  మిక్కిలి బలశాలుడు  అతిపెద్ద  దేహము కలవాడు పిమ్మట ఆ కైకసికి  వికృతమైన  ముఖము కల  కూతురు  కలిగినది . ఆమె పేరు సూర్పనఖ  కైకసికి  చివరగా కలిగిన కుమారుడి పేరుని పేరు విభీషణుడు . అతడు  మిక్కిలి ధర్మాత్ముడు . అతడు పుట్టినవెంటనే పుష్పవర్షము కురిసినది . విశ్రవసుని ఆశ్రమము కల ఆ మహారణ్యము నందు ,దశగ్రీవకుంభకర్ణులు ఇద్దరూ పెరిగి పెద్దవారయ్యిరి . విభీషణుడు మాత్రము ధర్మాత్ముడై నియమనిష్టలతో వేదాధ్యయనము చేసేవాడు . పిదప కొంతకాలమునకు ధనాధిపతి ఐన కుబేరుడు తన తండ్రిని దర్శించుటకై ,పుష్పకవిమానముపై అచటికి వచ్చెను . రాక్షసియైన కైకసి తన కుమారుడగు దశగ్రీవునితో "కుమారా !నీ సోదరుడగు ఈ వైశ్రవణుడిని చూడుము . దివ్యమైన ఇతడి తేజోవైభవములను చూడుము . వరుసకు మీరిద్దరూ సోదరులు . అయినా నీ ఈ స్థితిని చూసుకొనుము . నాయనా !దశగ్రీవా !నీవు అమిత పరాక్రమశాలివి . నీవు కూడా వైశ్రవణుడి వలె తేజివైభవమూర్తివి అగుటకు యత్నించుము . "అని పలికెను . తల్లి మాటలను విన్న వెంటనే దశగ్రీవుడు "అమ్మా !నేను తేజోవైభవములను పొంది ,ఈ సోదరునితో సమానుడను కానీ ,ఇతని కంటే మించినవాడిని కానీ కాగలను . ఇది నా ప్రతిజ్ఞ "అని పలికెను . అనంతరము ఆ ఆవేశమును చల్లారనివ్వక దశగ్రీవుడు తమ్ములతో కలిసి తీవ్రముగా తపస్సు చేయుటకై గోకర్ణాశ్రమమునకు చేరెను . పిమ్మట తిరుగులేని కార్యశూరుడైన ఆ దశగ్రీవుడు సోదరులతో కలిసి తీవ్రముగా తపస్సు చేసి బ్రహ్మదేవుని సంతోషపరిచేను . బ్రహ్మ సంతుష్టుడై అతడికి అన్నివిధములుగా జయమును కలిగించే వరములను అనుగ్రహించెను . 

రామాయణము ఉత్తరకాండ తొమ్మిదవసర్గ సమాప్తము . 

                         శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 















No comments:

Post a Comment