Wednesday 13 May 2020

రామాయణము ఉత్తరకాండ -పన్నెండవసర్గ

                                      రామాయణము 

                                        ఉత్తరకాండ -పన్నెండవసర్గ 

లంకారాజ్యమునకు పట్టాభిషిక్తుడైన పిమ్మట ,రావణుడు తన సోదరి అయిన శూర్పణఖ కు వివాహము చేయదలిచి తన సోదరులతో అలోచించి ,కాలకుని పుత్రుడైన విదుజ్జిహ్వునికి శూర్పణఖను ఇచ్చి వివాహము చేసెను . పిమ్మట ఒకనాడు రావణుడు ,వేటాడుటకై అడవిలో తిరుగుచుండగా ,అక్కడ ఆయనకు దితి కుమారుడైన మయుడు కనిపించెను . అతడి వెంట ఒక కన్య కూడా ఉండెను . అతడిని చూసిన రావణుడు అతడితో "మహాత్మా !నీవు ఎవరు ?"అని ప్రశ్నించెను . అప్పుడు మయుడు రావణునితో "నాయనా !హేమా అనే అప్సరస గురించి నీవు వినే ఉంటావు . నాకు ఆమె వలన ఇద్దరు కుమారులు ఒక కుమార్తె కలిగిరి . పెద్దవాడి పేరు మాయావి . రెండవ అతడిపేరు దుందుభి . ఈమె నా కుమార్తె ఈమె పేరు మండోదరి . ఈమెకు వివాహము చేయుటకై తగిన వరుడిని వెతుకుతూ ఈమెతో సహా ఇక్కడికి వచ్చితిని . నీవు ఎవరు ?"అని పలికెను . 
అప్పుడు రావణుడు "మహాత్మా !నేను పులస్త్యుని కుమారుడైన విశ్రవసు తనయుడను "అని పలుకగా అప్పుడు మయుడు రావణుడు బ్రహ్మవంశమువాడని సంతోషించి తన కుమార్తెను రావణునికి ఇచ్చి వివాహము చేసెను . ఆ వివాహ సమయములో తన తపః ఫలముగా తనకు లభించిన శక్తిని అల్లుడైన రావణునికి ఇచ్చెను . తరవాతి కాలములో దానినే రావణుడు లక్ష్మణుడిపై ప్రయోగించెను . ఆలా వివాహము చేసుకున్న రావణుడు తన భార్యతో సహా లంకా నగరంలోకి ప్రవేశించెను . పిమ్మట అతడు కుంభకర్ణునికి బలిచక్రవర్తి మనమరాలు అయిన వజ్రజ్వాలను ఇచ్చి వివాహము చేసెను . విభీషణునికి శైలూషుడు అనే గంధర్వ రాజు కుమార్తె అయిన సరమను ఇచ్చి వివాహము చేసెను . కాలక్రమమున మండోదరికి మేఘనాధుడు అనే పుత్రుడు కలిగెను . అతడినే మీరందరూ ఇంద్రజిత్తు అని పిలుచుచుంటిరి . 

రామాయణము ఉత్తరకాండ పన్నెండవసర్గ సమాప్తము . 

                    శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 








No comments:

Post a Comment