Sunday 17 May 2020

రామాయణము ఉత్తరకాండ --ముప్పదవసర్గ

                                        రామాయణము 

                                            ఉత్తరకాండ --ముప్పదవసర్గ 

మిక్కిలి  బలశాలి ఐన  ఇంద్రుడు రావణుడి సుతుడైన  ఇంద్రజిత్తు  చేతిలో  పరాజితుడై లంకలో బంహితుడైన పిమ్మట దేవతలు  బ్రహ్మదేవుడిని  ముందుఉంచుకొని  లంకకు వెళ్లిరి .  ఆకాశమునందుండియే  బ్రహ్మదేవుడు  "నాయనా! రావాణా ! నీ కుమారుడి  యొక్క బలపరాక్రమములకు  నేనెంతో  ముగ్దుడనైతిని . నలుగురు  దిక్పాలకులను  జయించి తీరెదను  అనే నీ  ప్రతిజ్ఞ  నెరవేరింది .  మిక్కిలి  బలశాలి  ఐన   నీ పుత్రుడు  ఇక పై  ఇంద్రజిత్తు  గా  ప్రసిద్దుడగును .  ఇంద్రుడిని విడిచి  పెట్టుము ప్రతిఫలంగా  దేవతలు  నీకు ఇవ్వగలరో  తెలుపుము ". అని పలికెను .  అప్పుడు  ఇంద్రజిత్తు " దేవా ! ఇంద్రునికి బంధవిముక్తి  కలిగించుటకై  ప్రతిఫలంగా  నేను అమరత్వము  కోరుచున్నాను " అని అడిగెను . దానికి బ్రహ్మదేవుడు  ఈ  సృష్టిలో  ఏ  ప్రాణికి  అమరత్వము ఉండదని తెలిపి మరేదైనా కోరుకొమ్మని  పలికెను . అప్పుడు ఇంద్రజిత్తు  " పితామహా!ఒక వేళా పూర్తిగా అమరత్వము  సాధ్యము కానిచో నేను  యుద్ధరంగములోకి  ప్రవేశించుటకు ముందుగా హోమంచేసి మంత్రపూర్వకములుగా  హవ్యములు  సమర్పించినచో  ఆ హోమం నుండి  ఒక దివ్య రధము  ఆవిర్భవింపవలెను . ఆ రథముపై నేను ఉన్నంతసేపు  నన్ను ఎవరు  చంపలేనట్లుగా  చేయుము ఒక వేళ మంత్రపూర్వకముగా   హోమరూపములో అగ్నిదేవుని  పూజించుట  పూర్తికాకముందే  నేను యుద్ధమునకు వెళ్ళినచో  నాకు మరణము కలుగునట్లు  చేయుము " అని ప్రాదించెను . అప్పుడు  బ్రహ్మదేవుడుతధాస్తు  అని పలికి  దేవతలతో సహా ఇంద్రుడుని  వెంటపెట్టుకొని  సురలోకమునకు   వెళ్లిపోయెను . 
పిమ్మట  ఇంద్రుడు తన తేజస్సు  తగ్గిపోయి  తాను పరాజితుడగుటకు కారణము గురించి  ఆలోచింపసాగెను . అప్పుడు  బ్రహ్మదేవుడు " ఇంద్రా ! ఇదువరుకు నీవు చేసిన తప్పిదమునకు  ఫలితమే ఇది . పూర్వము  నేను  మిక్కిలి సౌందర్యవతి ఐన  అహల్యను సృష్టించి ఈమెకు  భర్త ఎవరా అని ఆలోచింప సాగేను . నీవు న ప్రమేయము లేకుండానే  ఈమె నాకు భార్య కాగలు అని ఆలోచన చేసితివి . నేను  గౌతమునికి  ఇచ్చి వివాహము  చేసితిని . ఇంద్రా ! నీవు అన్ని ధర్మాలనుఎరిగినవాడివి  అయినా ఆమె నీకు భార్య  కాలేదని కోపంతో గౌహాటముని ఆశ్రముముకు  వెళ్లి అన్యధా ప్రవర్తించితివి . అప్పుడు గౌతముడు ఈ ఇంద్రపదవి  నీకు స్థిరముగా ఉండదని  శపించెను . ఆ శాప  కారణముగానే నేడు నీకీ  దుర్దశ కలిగినది . 
పిమ్మట గౌతముడు  తన భార్యను గట్టిగా మందలించి ఆమెనుకూడా  శపించెను . అప్పుడు అహల్యాదేవి  గౌతమునితో  తన తప్పేమి  లేదని  అది ఇంద్రామాయ అని  ప్రార్ధించెను . అప్పుడు గౌతముడు  " సతీ  ఇక్ష్వాకురాజ వంశమున శ్రీ మహావిష్ణువే  శ్రీరాముడి రూపములో అవతరించును .  అతడు రాక్షసులను సంహరించుటకు  ఇటువచును ఆయన్ని  దర్శించినంత మాత్రమునే నీవు పవిత్రురాలివి కాగలవు  పిమ్మట  నన్ను చెర గలవు " అని పలికి ఆయన తపస్సుకై వెడలిపోయెను .  పిమ్మట  అహల్యా దేవికూడా  తీవ్రమైన  తపస్సులో మునిగిపోయెను . ఆ  దుష్కర్మ  ఫలితమునే  ఇప్పుడు నీవు అనుభవించుచుంటివి .  దేవేంద్రా! వైష్ణవము  అనే యజ్ఞమును  చేయుము . దానివలన  నీకు శుభము కలుగును . నీ కుమారుడైన జయంతుడు  మరణించలేదు . మీ మామగారైన  పులోముడు  తన మనవడిని  తీసుకు వెళ్లి  సముద్రగర్భమున  భద్రముగా ఉంచెను " అని  పలికి బ్రహ్మ  దేవుడు తన లోకమునకు వెళ్లిపోయెను . 

రామాయణము  ఉత్తరకాండ  ముప్పదవసర్గ సమాప్తము . 

శశి,

ఎం.ఏ,ఎం.ఏ(తెలుగు),తెలుగుపండితులు . 












No comments:

Post a Comment