Thursday 14 May 2020

రామాయణము ఉత్తరకాండ -పదునాలుగవసర్గ

                                    రామాయణము 

                                      ఉత్తరకాండ -పదునాలుగవసర్గ 

పిమ్మట రాక్షస రాజు  మహోదరుడు , ప్రహస్తుడు , మారీచుడు, శుఖుడు , సారణుడు , ధూమ్రాక్షుడు , అనే ఆరుగురు మంత్రులతో  కలిసి కైలాసగిరి చేరెను . మంత్రులతో  గూడి కైలాసమునకు  చేరినట్లు విని , యక్షులు  ఆ రావణుని ఎదుట  నిలువలేకపోయిరి . కుబేరుడు  ఆ యక్షవీరులను  యుద్ధమునకు   అనుమతింపగా  వారు సంతోషముతో  సమరసన్నద్దులై  బయలుదేరిరి . యక్షులకు, రాక్షసులకు మధ్య సంకులసమరము  ప్రారంభమయ్యెను . రాక్షసరాజు యొక్క  సచీవులు అందరును భీకర పరాక్రమశాలులు . వారిలో ఒక్కొక్కడే  వేయి మంది  యక్ష సైనికులతో పోరాడసాగెను .  రావణుడు ఆ యక్ష సైన్యమును  దగ్దమొనర్చుచుండెను . ఆ రావణ  సచీవులు యక్షులను  చావు దెబ్బ  తీసిరి . యుద్దభూమి యందు కొందరు యక్షులు  తీవ్రముగా  గాయపడగా శరీరములు   భగ్నములగుటచే  నేలపై పడిపోతిరి . 
యక్ష సైనికులు  యుద్ధరంగమున  శాస్త్రములు  కోల్పోయిరి . మిక్కిలి అలిసిపోయి ఒకరినిఒకరు  కౌగలించుకొని కూలిపోయిరి .  యుద్దఱంగములో  యక్షసైనికులు  భంగపడుట చూసిన  కుబేరుడు మిక్కిలి బలాఢ్యులైన  మరికొంతమంది  యక్షప్రముఖులను యుద్ధరంగమునకు  పంపెను .  మారీచుడు  దాటికి తట్టుకొనలేక  కొందరు యక్షులు  రణ  రంగమునుండి  పారిపోయిరి . పిమ్మట  దశగ్రీవుడు అలకాపురి  ముఖద్వారం వద్దకు చేరెను . 
ఆ ద్వారము  బంగారముచే  నిర్మింపబడి చిత్రవిచిత్రముగా ఉండెను . దానిపై  వైడూర్య మణుల పొడి  చల్లబడి ఉండెను .  అప్పుడు  సూర్యభానుడు  అనే పేరు గల  ద్వారపాలకుడు  రావణుణ్ణి  అడగించెను . అయినాను ఆగక  ద్వారంలోకి  ప్రవేశించే రావణుడిని  ఆ  యక్షుడు  ద్వారస్తంభము పెకలించి  దానితో  కొట్టెను . వెంటనే ఆ రాక్షస రాజు  అదే ద్వార  స్తంభము  లాక్కుని  ఆ యక్షుడిని  తీవ్రముగా  కొట్టెను  . ఆ రాక్షస రాజు పరాక్రమము చూసి  మిక్కిలి  అలిసిపోయిన  యక్షులు  భయముతో గడగడ ఒణుకుచూ  ఆయుధములు  పారవేసి పారిపోయిరి . 

రామాయణము ----------ఉత్తరకాండ ---------పదునాలుగవసర్గ -----------సమాప్తము . 

శశి,

ఎం.ఏ,ఎం.ఏ(తెలుగు ), తెలుగు పండితులు . 









  

No comments:

Post a Comment