Sunday 3 May 2020

రామాయణము , యుద్ధకాండ ----------నూటపదమూడవసర్గ

                                          రామాయణము 

                                    యుద్ధకాండ ----------నూటపదమూడవసర్గ 

రావణుడు  శ్రీ రాముడి చేతిలో  మరణించిన  వార్తవిని  రాక్షస స్త్రీ లు  అందరు అంతులేని శోకంతో  అంతఃపురమునుండి  బయలు దేరిరి.   జనులు పెక్కు రీతిలో  వారించుచున్నను  వారు  లంకా నగర ఉత్తర ద్వారము  నుండి బయటకు వచ్చి  ఘోరంగా నున్న    యుద్ధ భూమినందు  ప్రవేశించిరి .  పిమ్మట  తమ భర్త కోసం  ఆ యుద్ధ రంగంలో  వెతక సాగిరి . 
అప్పుడు ఆ రణ  భూమి  అంతా   తలలు లేని మొండెములతో నిండి  రక్తముతో తడిసి  ముద్ద అయ్యి ఉండెను . అప్పుడు వారు  అయ్యో ! నాథా !  అయ్యో ! ఆర్యాపుత్ర ! అని  బిగ్గరగా వెలపించుచూ  పడుతూ లేస్తూ అన్నివైపులా తిరగ సాగిరి . పతి  వియోగంతో  కృంగిపోతున్న  ఆ రాక్షస స్త్రీలు కన్నీరు మున్నీరుగా  విలపించుచుండిరి .  తుదకు రావణుడు నల్లని కొండవలె  యుద్ధభూమిలో  నిహతుడై పడిఉండగా  కనుగొనిరి . రణభూమి యందు  దుమ్ములో  పడిఉన్న  తమ భర్తను చూసినంతనే  ఆ రాక్షస స్త్రీలు    మొదలు తెగి పోయిన లతల వలే అతనిపై పడిపోయిరి . 
రావణునిపై  ప్రేమతో  ఒక స్త్రీ  అతనిని కౌగలించుకొనియు  , వేరొక స్త్రీ  అతని కాళ్ళను  గుండెకు హత్తుకొనియు , మరియొక స్త్రీ  అతని  కంఠము పట్టుకొనియూ  ఏడవసాగిరి . ఒక స్ర్తీ  చేతులుచాచి  భూమిపై పడి  ఏడుస్తూ పొరలుచుండెను .  మరియొక ఆమె  మూర్ఛపోయెను . ఇంకొక స్త్రీ  రావణుని శిరస్సును  తన ఒడిలో  చేర్చుకొని  రోధింప  సాగెను . ఇలా  ఆర్తికి లోనైనా ఆ స్త్రీ లు నిహతుడయి పడి  ఉన్న రావణుని చూస్తూ  అంతులేని శోకంతో  అనేక విధాలుగా  గగ్గోలుపెడుతూ  ఇలా పరితపించ  సాగిరి . 
" ఓ నాథా ! నీ దెబ్బకు  ఇంద్రుడు భయపడెను . యముడు సైతం గడగడలాడేను . కుబేరున్ని జయించి  అతడి పుష్పకవిమానాన్ని  లాక్కొన్నావు . గంధర్వులు , ఋషులు, దేవతలు మహాత్ములు, నీకు భయపడి  ఒణికి పోయిరి  . అంతటివాడివైన  నీవు  హతుడవై  రణరంగమున పడిఉన్నావు .  సురాసురలకు కానీ నాగులకు కానీ, నీవు ఎప్పుడు భయపడలేదు . కానీ ఒక మానవ మాత్రుడి వలన  నీకి దుస్థితి  సంభవించినది కదా  ! .  సీతా దేవిని అపహరించుకు వచ్చి  నీ మరణమును నీవే కొనితెచ్చుకొంటివి . రాక్షసులందరు మృత్యువు పాలయ్యారు . నీ సతులమైన  మమ్ము కూడా  దుఃఖ సముద్రములో  పడవేసినావు . రాక్షసుని యొక్క భార్యలందరు  దుఃఖితులై ,
కనీరు మునీరుగా ఏడ్చుచూ  మిక్కిలి విలపించిరి . 


రామాయణము --------యుద్ధకాండ--------నూటపదమూడవసర్గ ---------సమాప్తము ------------

శశి,

ఎం.ఏ,ఎం.ఏ, తెలుగు . తెలుగుపండితులు . 
















No comments:

Post a Comment