Saturday 2 May 2020

రామాయణము , యుద్ధకాండ ---------నూటపదవ సర్గ

                                            రామాయణము 



                                                     యుద్ధకాండ ---------నూటపదవ సర్గ 




శ్రీ రాముడి బాణముల దాటికి  రావణుడి రధాశ్వములు  బెదిరి వెనుకకు అడుగులు వేసినవి . అది చూసిన రావణుడు కోపముతో రాముని రధసారధి ఐన మాతలి పై బాణములను   ప్రయోగించెను . అతడు  దివ్యశక్తి సంపన్నుడు  అగుట వలన  ఆ బాణములు అతడిని  కొంచము కూడా బాధించలేదు .  కానీ  శ్రీ రాముడు  తనని  కొట్టిన దానికంటే  తన సారధిని  కొట్టిన దానిని ఎక్కువగా భావించి మిక్కిలి  క్రుద్ధుడాయెను .  
ఆ కోపంతో రాముడు ఒకేసారి  ఇరువదేసి , ముప్పదేసి , అరువదేసి , కడకు  వందలవేలకొలది  బాణములను  రావణుని రథముపై  వర్షింప  చేసెను రావణుడు కూడా  రాముడిపై  బాణములను  గధలను , ఎడతెరపిలేకుండా వర్షింప చేసెను .  దేవతలు , గంధర్వులు , అప్సరసలు ఆ సంగ్రామమును చూస్తూ  ఆకాశమునకు ఆకాశమే సాటి,  మహాసముద్రమునకు మహాసముద్రముమే  సాటి, అలాగే  రామ రావణ యుద్ధమునకు సాటి అయినది  మరొకటి లేదని పలికెను . 
శ్రీ రాముడు మిక్కిలి కోపంతో  ఒక తీక్షణ మైన  బాణముతో  రావణుడి శిరస్సును  ఖండింప చేసెను . ఆ శిరస్సు  అందరూ చూచుచుండగానే  యుద్ధభూమిలో నేలపై  పడిపోయినది .  మరుక్షణమే  ఆ శిరస్సు వంటిదే  మరొక శిరస్సు  రావణుడి దేహమున  మొలచెను  అప్పుడు  బాణములను ఒడుపుతో ప్రయోగించుటలో సమర్ధుడైన శ్రీ రాముడు  దానిని కూడా ఖండించెను  వేనువెంటనే  మరొక శిరస్సు  మొలిచెను  .  శ్రీ రాముని శరముల దాటికి  అదియూ  ముక్కలైపోయెను . వెంటవెంటనే మొలుచుచున్న వందలకొలది  శిరస్సులను  శ్రీ రాముడు ఖండించి వేసెను . ఎన్నింటిని ఖండించినా  వెంటవెంటనే  కొత్తవి ఏర్పడుతుండుటచే  రావణుడు హతుడు కాకుండెను .     అపుడు శ్రీ రాముడు  తనలోతాను "ఈ అస్త్రములన్నయూ   ఇంతవరకూ  నాకు  విశ్వసనీయముగా  ఉన్నవి  వీటి సహాయముతోనే  నేను  వేలకొలది రాక్షసులను  అవలీలగా పరిమార్చాను  కానీ  రావణుడి విషయములో  వీటి శక్తి  ఇలా సన్నగిల్లుటకు  కారణమేమి ?". అని ఆలోచించుకొని  శ్రీ రాముడు  రావణుని  వక్షస్థలముపై  శరవర్షము కురిపించెను.   రావణుడు  కూడా శ్రీ రాముడిపై  శరవర్షమును కురిపించసాగెను . రాత్రియందుకాని  , పగటిపూటకాని ఒకముహూర్తకాలము కానీ , ఒకనిమిషకాలముకాని  , ఆగక రామరావణ యుద్ధము నిర్విరామముగా కొనసాగుచూనే ఉన్నది . ఈ యుద్దములో  ఎంత ప్రయత్నించినప్పటికీ  రావణుడు  హతముకాకుండుట చూసిన  మాతలి  శ్రీ రాముడికి  సలహా చెప్పెను . 

రామాయణము ---------యుద్ధకాండ -----------నూటపదవసర్గ -----------సమాప్తము 




శశి , 

ఎం.ఏ,ఎం.ఏ,(తెలుగు), తెలుగుపండితులు . 























No comments:

Post a Comment