Wednesday 6 May 2020

రామాయణము యుద్ధకాండ -నూటఇరువదినాలుగవసర్గ

                                   రామాయణము 

                                        యుద్ధకాండ -నూటఇరువదినాలుగవసర్గ 

శ్రీ రాముడు ఆ రాత్రికి చక్కగా విశ్రమించి ఉదయమున ప్రశాంతముగా నిద్రలేచేను . ఆయన నిద్రలేచేసరికి విభీషణుడు కొంతమంది  అంతఃపుర దాసీజనముతో అక్కడికి వచ్చి శ్రీరామునితో "రఘురామా !స్నానమునకై నిర్మలజలములు ,సుగంధద్రవ్యములు ,మైపూతలు ,దివ్యములైన వస్త్రాభరణములు నీకోసము సిద్ధపరచబడినవి . ఈ అంతఃపుర స్త్రీలు అలంకారములు చేయుటలో ఆరితేరినవారు . నాపై అనుగ్రహము ఉంచి ,వీరి సేవలను అందుకొనుము . "అని పలికెను . 
ఆ మాటలు విన్న శ్రీరాముడు "విభీషణా !నీవు సుగ్రీవాది ప్రముఖ వానరులను స్నానాదులకి ఆహ్వానింపుము . మా భరతుడు ధర్మాత్ముడు ,సుఖములను పొందవలసినవాడు ,సుకుమారుడు ,ప్రతిజ్ఞకు కట్టుబడివుండెడివాడు . నాకై నిరీక్షించుచు ,తాపసవృత్తిలో వున్నాడు . అటువంటి నా తమ్ముడను కలుసుకోకుండా స్నానాదికములు కానీ ,వస్త్రాభరణములు కానీ ధరించుట నాకు సమ్మతము కాదు . ఈ విధముగానే వీలయినంత త్వరగా అయోధ్యా నగరమునకు తిరిగి వెళ్తాను . చాలా దూరములో ఉన్నందున నా ప్రయాణము కష్టసాధ్యమైనది . "అని పలికెను . 
ఆ మాటలు విన్న విభీషణుడు రామునితో "రామా !మిమ్ము ఒక్క రోజులో అయోధ్యకు చేర్చగలను . నా వద్ద పుష్కము అనే విమానము వున్నది . అది మా సోదరుడైన కుబేరునిది . రావణుడు అతడిని యుద్దములో జయించి ,బలవంతముగా దానిని లంకకు తీసుకువచ్చెను . మేఘము వలే ఆకాశమున వేగముగా వెళ్లగలదు . నీవు ఎటువంటి దిగులును లేకుండా ఆవిమానముపై అయోధ్యకు వెళ్లవచ్చును . నీకు మిత్రభావము వున్నచో సోదరుడైన లక్ష్మణునితో ,సీతాదేవితో కలిసి ఇక్కడే కొంతకాలము ఉండుము . రామా !సైన్యముతో ,మిత్రులతో కూడి ఉన్న నిన్ను నేను నిండు మనసుతో సత్కరించిన పిమ్మట నీవు వెలుదువుగాని . ఇది నా ప్రార్థన "అని పలికెను . 
విభీషణుడు ఇలా పలుకగా సమస్త వానరులు ,రాక్షసులు ,వినేటట్టుగా శ్రీరాముడు అతనితో "విభీషణా !మనస్ఫూర్తిగా నీవు చేసిన సహాయ సహకారములు కు ,అందించిన అండదండలకు నేను ఎంతో సంతోషించితిని . ఇవన్నీ నీవు నాకు చేసిన పూజలే కదా !ఇది నీ ప్రార్ధనను త్రోసిపుచ్చుట ఏమాత్రము కాదు . నా ప్రియా సోదరుడైన భరతుడిని చూచుటకై నా మనస్సు ఎంతో తొందరపడుతున్నది . నేను చిత్ర కూటములో వున్నప్పుడు అతడు నా వద్దకు వచ్చి ,వినయముతో "అన్నా !తిరిగి అయోధ్యకు రా !అని ఎంతగానో ప్రార్ధించెను . పితృవాక్య పాలనకు ,వనవాస దీక్షకు బద్ధుడనై వున్న నేను అతడి మాటలను వినలేదు . వాత్సల్య మూర్తులైన కౌసల్యా మాతను ,సుమిత్రా మాతను ,కైకేయి మాతను ,గురువులను ,బంధుమిత్రులాటి కూడిన పౌరులను త్వరగా చూడవలెనని , నా మనస్సు ఉవ్విళ్ళూరుచున్నది . ఓ రాక్షసరాజా !వెంటనే విమానమును సిద్దపరుచుము . పదునాలుగు సంవత్సరముల వనవాస దీక్ష పూర్తియైన తరువాత కూడా నేను ఇక్కడ ఉండుట ఏవిధముగాను సముచితము కాదు నేను వెళ్ళుటకు అనుమతింపుము "అని పలుకగా విభీషణుడు శ్రీరాముని అభిలాషను అనుసరించి వెంటనే పుష్పకవిమానమును తీసుకువచ్చెను . దానిని శ్రీరామునకు ఇచ్చెను . 

రామాయణము యుద్ధకాండ నూటఇరువదినాలుగవసర్గ సమాప్తము . 

                       శశి ,

ఎం .ఏ ,ఎం .ఏ (తెలుగు ,తెలుగు పండితులు . 









No comments:

Post a Comment