Saturday 16 May 2020

రామాయణము ఉత్తరకాండ -ఇరువదిఆరవసర్గ

                                       రామాయణము 

                                         ఉత్తరకాండ -ఇరువదిఆరవసర్గ 

దశగ్రీవుడు ఆ రోజు రాత్రికి కైలాసపర్వతముపైనే ఉండిపోయెను . సైన్యము అందరూ ఆదమరచి నిద్రపోయినా రావణుడు మాత్రము కైలాసగిరి సౌందర్యమును చూస్తూ కూర్చుండెను . అప్పుడు అప్సరసలలో మేటి అయిన రంభ దివ్య ఆభరణములతో ,పుష్పములతో ,సుగంధములతో అలంకరించుకుని వెళ్లుచుండగా రావణుడు చూసేను . అతడు వెంటనే ఆమె చేతిని  పట్టుకొని "సుందరీ !ఎవరు నీవు ?ఈ సమయములో ఎక్కడికి వెళ్లుచున్నావు . నేను లంకాధిపతి రావణుడిని . ఈ ప్రపంచములో నాకు సాటి అయిన వాడు ఎవ్వడు లేడు . కావున నన్ను చేరుము . "అని పలుకగా రంభ కంపిస్తూ రావణునితో "ప్రభూ ! నేను నీ సోదరుడైన కుబేరుడి కుమారుడు నలకూబరుడి భార్యను . కోడలు కూతురుతో సమానము . కావున నీవు నాకు తండ్రివంటి వాడవు . నాపై దయ చూపుము "అని అర్దించెను . 
రంభ ఎంతగా అర్ధించినప్పటికీ రావణుడు వినిపించుకొనక ఆమె ను బలాత్కరించెను . రంభ ఏడుస్తూ నలకూబరుని వద్దకు వెళ్లి జరిగిన విషయమును తెలిపెను . అప్పుడు అతడు కోపముతో "సుందరీ !ఆ దుష్ట రావణుడు బలాత్కారముగా నే పట్ల అకృత్యము చేసినాడు . కావున ఇకపై అతడు ఇష్టములేని వనితను బలాత్కారము చేయ చూసినచో అతడి తల ఏడు ముక్కలైపోవును "అని శపించేను . ఆ శాపము వినగానే రావణుడి ఒళ్ళు జలదరించింది . స్త్రీని బలాత్కారముగా పొందవలెననే భావమును మానుకొనెను . రావణుడు బలవంతముగా తీసుకువెళ్లిన స్త్రీలందరికీ ఈ శాపము గురించి తెలిసి వారు మిక్కిలి సంతోషించిరి . 

రామాయణము ఉత్తరకాండ ఇరువదిఆరవసర్గ సమాప్తము . 

                      శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 





No comments:

Post a Comment